అదృశ్య వీరుడు" జానపద నవల: 1️⃣5️⃣✅వ భాగం,: "నాగమణి రావులపాటి"


 "అవునా, నీ రుగ్మతకు కారణం ఏమిటి? నేనేమైనా సహాయం చేయగలనా? నాతో చెప్పు తాతా!" అని అన్నాడు జయసేనుడు.
"నీవలన అయ్యేది కాదులే నాయనా! నేనే ఎలాగోలా కష్టపడి సాధించుకోవాలి" అని అన్నాడు ఆ ముసలి తాత.
"అలాగా, అయినా పరవాలేదు. చెబితేనే కదా తెలిసేది! నా వలన అయ్యేదైతే చేస్తాను. విషయం వివరించు తాతా!" అని అన్నాడు జయసేనుడు.
"చెబుతాను నాయనా" అని చెప్పడం మొదలుపెట్టాడు తాత అనబడే ఆ ముసలి అతను.
"ఇక్కడికి పది ఆమడల దూరంలో కామ్యకవనం అనే ప్రదేశంలో ఒక తటాకమున్నది. ఆ కొలను మధ్యలో ఒక నల్ల తామర పుష్పం రోజుకు ఒకటి మాత్రమే పూస్తుంది. ఆ తామరపువ్వు రేకులతో నా ఈ జబ్బు తగ్గుతుంది...
దానికోసం ఎంతో శ్రమపడి వెళుతున్నాను" అని అన్నాడు ఆ బాటసారి. "చూడగా వయోభారంతో నడిచే శక్తిలేక చాలా బాధపడుతున్నావు. ఆ పని నేను చిటికెలో సాధించి తెస్తాను. నీవు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకో!" అని అన్నాడు జయసేనుడు.
"ఆగు నాయనా! ఆ నల్ల కలువను సాధించి తేవడం అంత సులువు కాదు! ఆ కొలనును సుగంధి అనే మొసలి కాపలా కాస్తుంది. దాన్నుండి తప్పించుకుని ఆ పువ్వును తేవాలి" అని చెప్పాడు ఆ వృద్ధుడు.
అతను అలా అనేసరికి, "అలాగే తాతా! నీవు ముందే చెప్పావుగా, కావున తగిన జాగ్రత్తలు తీసుకుని నీవు చెప్పిన ఆ నల్ల కలువను తీసుకుని వస్తాను!" అని గుర్రాన్ని అధిరోహించి, అతను చెప్పిన దిక్కుకు పయనం సాగించాడు.
విజయసేనుని గుర్రం కళ్యాణి తన వాయువేగ మనోవేగాలతో కొలను వద్దకు చేరుకుంది. అది చూడటానికి ఏమంత పెద్ద తటాకం కాదు, చిన్న మడుగు లాగానే ఉన్నది.
తాత చెప్పినట్టు ఆ కొలను మధ్య భాగంలో చుట్టూ తామర రేకులవంటి అందమైన రాతి కట్టడం, నడుమ పచ్చని తామరాకుల మెరుపుల మధ్య నల్లకలువ అందంగా వికసించింది.
ఆ మడుగులోకి అడుగు పెడుతూనే సందేహించాడు. ఎక్కడా మొసలి జాడలు కనిపించలేదు. ఆ నీరు అద్దంలో తన ప్రతిబింబం కనిపించేలా ఎంతో స్వచ్ఛంగా ఉన్నది. మెల్లగా కొలనులో కాలు మోపాడు జయసేనుడు. (సశేషం)........
కామెంట్‌లు