వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
146. నిష్ప్రపంచా (చతురక్క్షరీ)
147. నిరాశ్రయా (చతురక్క్షరీ)
నూట నలభైఏడవ నామ మంత్రము:
ఓం నిరాశ్రయాయై నమః
పరమేశ్వరి, అన్నిటికీ తాను ఆశ్రయం అవుతాను కానీ, తనకు ఏదీ ఆశ్రయము కాదు, ఇవ్వలేదు అని తెలియజేస్తూ ప్రకటీకృతమైన అమ్మను చూసి వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "నిరాశ్రయా" అని కీర్తించారు. మనకందరికీ ఆధారంగా ఉంటూ, తనకు ఏ ఆధారము లేకుండా ఉన్న "బాలకు" నమస్కారము.
పరాత్పరియే పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మము ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉండి, ఈ జగత్తుకు ఆధారంగా ఉంది. అంటే, పరబ్రహ్మము లేదా శ్రీమాత అందరిలోనూ ఉన్నది. కానీ, ఈ పరబ్రహ్మము లేదా శ్రీమాత నిత్యసత్య, నిర్వికల్ప, నిరాకారా, నిష్ప్రపంచా, నిత్యముక్తా అని ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము, కదా!!! ఇటువంటి కల్యాణప్రదాయినికి ఏ ఆధారము అవసరం లేదు. కాబట్టి, "నిరాశ్రయా" అయ్యింది.
సృష్టికి ముందు గానీ, లయము / తిరోధానము జరిగిన తరువాత గానీ ఉండేది, ఉన్నది ఒక్క పరమేశ్వరి అయిన శ్రీమాత మాత్రమే. శ్రీమహారాజ్ఞి, కామేశ్వర వామాంకస్థిత కదా! పార్వతీ పరమేశ్వరులు అద్వైత రూపులై, అర్థనారీశ్వరంగా ఉన్నారుకదా!. కామేశ్వరుడు, కామేశ్వరి ఒకరికి ఒకరు ఆధారమే తప్ప, వారిరువురికీ వేరుగా ఆధారములు లేవు / ఉండవు. ఆ మహారాజ్ఞి ఎన్ని రూపాలు ధరించినా, ప్రతీ అవతారం లోనూ పరమేశ్వరుడే ఆమె భర్త. ఆ తల్లి, సదా శివపతివ్రత. కనుకనే, "నిరాశ్రయా" అయ్యింది.
అన్ని జీవాలకు ఆత్మ రూపంలో ఆధారంగా ఉన్నది తానేనని, తనకు మాత్రం పరమేశ్వరుని వామాంకము మాత్రమే ఆధారమని, యోగసాధన ద్వారా గుర్తెరిగి, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిరాశ్రయాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి