శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 169


 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
147. నిరాశ్రయా (చతురక్క్షరీ)
148. నిత్యశుద్ధా (చతురక్క్షరీ)
నూట నలభైఎనిమిదవ నామ మంత్రము:
ఓం నిత్యశుద్ధాయై నమః
నిత్యశుద్ధా = త్రిసంధ్యలలోనూ / భూత, భవిష్యత్, వర్తమాన కాలాలోనూ ఎటువంటి మలినమూ అంటనిది / లేనిది. 
బురదలో పుట్టిన పద్మమును ఆసనముగా చేసుకున్నా గానీ, తనకు ఆ బురద అంటదని తెలియజేస్తూ ప్రకటితమైన శ్రీచక్రసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, జగన్మాతను "నిత్యశుద్ధా" అని కీర్తించారు. తనకు మలినాలు అంటకున్నా, మనలోని మలినాలను పారద్రోలి, తన సాన్నిహిత్యం అనుగ్రహించే పరాభట్టారికకు నమస్కారము.
ఈ పాంచభౌతిక శరీరము లోని, అన్ని శరీర భాగాలకూ స్పర్శ జ్ఞానం ఉంటుంది. ఈ స్పర్శ జ్ఞానం వలన, ఈ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్న మలినాలు, శరీరానికి అంటుతాయి. కానీ, ఈ శరీరము, పరమాత్మ తనలో ఉండడం వలన సశరీరంగా ఉంది. పైన ఉన్న చర్మసౌందర్యంతో కూడిన శరీరం మలినము అవుతుంది. కానీ, లోపల ఉన్న ఆత్మరూపమైన పరబ్రహ్మ తత్త్వాన్ని, మలినం ఏమీ చేయలేదు. పరబ్రహ్మ స్వరూపిణి అమ్మే కదా!! అందుకనే, జగజ్జనని "నిత్యశుద్ధా" అయ్యింది.
"అస్పర్శశ్చ మహాన్ శుద్ధి" అని శృతి వాక్యం. స్పర్శించబడనివి అన్నీ కూడా శుద్ధిగా ఉంటాయి లేక మలినాలు అంటకుండా ఉంటాయి. పరమేశ్వరి మన అంతఃకరణలోని దహరాకాశంలో బిందు రూపంలో స్థిరంగా ఉంటుంది. ఉంది. కనుక, స్పర్శతో తాకడం కుదరదు. కనుకనే పరాత్పరి సృష్టి, స్థితి, లయ కాలలో "నిత్యశుద్ధా" గా ఉంటుంది.
"అత్యంత మలినో దేహో, దేహీచాత్యంత నిర్మల" అనేది కూడా శృతి వాక్యమే. దేహానికి మలినాలు అంటుతాయి. కానీ, దేహానికి ఆధారంగా ఉన్న ఆత్మకు మలినాలు అంటవు. ప్రతీ జీవి లోనూ, జీవదారంగా, జీవాధారంగా ఉన్న పరమాత్మ స్వరూపిణి స్పర్శ రహిత. కామేశ్వరీ పరదేవతకు స్పర్శను అనుగ్రహించగలిగినవాడు, పరమేశ్వరుడు ఒక్కడే. అర్ధనారీశ్వరము కనుక, పరమేశ్వర, పరమేశ్వరిలు ఇద్దరూ, ఇద్దరు కాని ఒక్కరు, "నిత్యశుద్ధా" అని పిలవబడతారు.
ఈ విధంగా, మలినాలు ఏమైనా ఉంటే, అవి నా శరీరానికే కాని, తనను లాలించి, పాలించే అమ్మకు అంటవు, ఉండవు అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం నిత్యశుద్ధాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు