వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
148. నిత్యశుద్ధా (చతురక్క్షరీ)
149. నిత్యబుద్ధా (చతురక్క్షరీ)
నూట నలభైతొమ్మిదవ నామ మంత్రము:
ఓం నిత్యబుద్ధాయై నమః
నిత్యబుద్ధా = చిత్ రూపములో ఉన్న చిద్రూప కనుక, నిత్యబుద్ధా; ఎటువంటి వికారమూ లేని తెలివితో ఉంటుంది.
తానే జ్ఞాన రూపములో ఉన్నది కనుక, ఈ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్న సకల జ్ఞానమునకు తానే ఆధారమని తెలుపుతూ దర్శనం ఇచ్చిన శ్రీమాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు "నిత్యబుద్ధా" అని కొనియాడారు. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తరిమివేసే పరాత్పరికి నమస్కారము.
"విజ్ఞాత" = బ్రహ్మ; "విజ్ఞాతి" అనగా జ్ఞానము. "గురుర్బ్రహ్మ గరుర్విష్ణుః" అని కదా పెద్దల మాట. గురువు, బ్రహ్మ అయినప్పుడు, గురువే జ్ఞానమునకు నెలవు అవుతాడు. అప్పుడు, గురువు యొక్క తెలితేటలకు కొదువ ఏముంటుంది. మరి, బ్రహ్మమే తానైన పరమేశ్వరి యొక్క విజ్ఞానమునకు లోటు ఎలా ఉంటుంది. ఆ లోటు అనే తలంపు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. అందుకనే, కాత్యాయని "నిత్యబుద్ధా" అయ్యింది.
మూడుకాలలోనూ బ్రహ్మమే తానైన బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, అన్ని శాస్త్రాలకూ, వేదాలకూ ఆధారభూతమైనది, చిద్రూపిణి అయిన శ్రీమాత "నిత్యబుద్ధా" అని పిలువబడింది. శ్రీమహారాజ్ఞి అయిన లలితా పరాభట్టారిక, మూర్తీభవించిన జ్ఞాన సంపదకు ఆలవాలము, పుట్టిల్లు. ఆ కారణంచేత "బుద్ధ" అవుతుంది. పరమేశ్వరి సర్వకాల సర్వావస్థలలో, పరాత్పరునితో కూడి జగత్తు రక్షణలో ఉంటూ "నిత్య" అయ్యింది. సహస్ర కోటి సూర్యుల కాంతితో తళుక్కున మెరుస్తూ, బుద్ధికి ఆటపట్టుగా ఉండి, నిత్య అయిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరి "నిత్యబుద్ధా" యే కదా!!
తనని సకల జ్ఞాన స్వరూపిణిగా గుర్తించి, తమను ఆక్రమించి ఉన్న అజ్ఞానము అనే చీకటిని పోగొట్టుకోడానికి "నిత్యబుద్ధా" అనబడే "సరస్వతి దేవి" గా తెలుసుకుని, భక్తి జ్ఞాన సంపాదన కోసం తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిత్యబుద్ధాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి