వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
152. నిష్కారణా (చతురక్క్షరీ)
153. నిష్కళంకా (చతురక్క్షరీ)
నూట ఏభైమూడవ నామ మంత్రము:
ఓం నిష్కళంకాయై నమః
ఏవిధమైన పాపములు తనకు అంటవు అని ప్రకటమైన పరాత్పరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "నిష్కళంకా" అని కీర్తించారు. సృష్టి లోని జీవులచేత చేయబడుతున్న మంచి అంతటికీ కారణమైన తల్లి, జగన్మాత ఆ జీవులు చేసే పాపకార్యాలకు కూడా ఆధారము. కానీ, తానుగా పాపకార్యములు చేయనట్టి పరమేశ్వరికి వందనము.
ఈ తల్లి అన్ని పాపాలకూ దూరముగా ఉండేది. గుణరూపాలకు సంబంధించిన భావనలకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే, శ్రీమాత నిర్గుణ, నిరాకార, పరబ్రహ్మ స్వరూపం అని మనం తెలుసుకున్నాము కాదా! అందుకనే, పరాత్పరి "నిష్కళంకా" అయ్యింది.
సాధారణ వాడుక భాషలో "కళంకము" అనేది చెడు చూపుతుంది. మచ్చ, దోషము, పాపము అని కూడా ఈ పదానికి అర్థం చెపుతారు. అప్పుడే పుట్టిన పాపాయిల మనసు మలినము లేనిదిగా ఉంటుంది. ఈ పాపాయికి, మనలను కాపాడే పరమేశ్వరికి మధ్య ఏ బేధము ఉండదు. ఎందుకంటే, ఈ పాపాయికి మద మత్సరములు, కోప తాపాలు తెలియవు, ఉండవు కనుక. తల్లి ఒడి నుండి పాల పళ్ళు ఊడి, గట్టి పళ్ళు వచ్చేసరికి మొదలవుతుంది ఆజ్ఞానం యొక్క ప్రభావం. అంతవరకు పరమాత్మతో ఉన్న సాన్నిహిత్యం వలన జ్ఞానం లో ఉన్న పాపాయి, గట్టి పళ్ళు రాగానే ఆజ్ఞానం అనే అంధకారంలోకి ప్రయాణం మొదలుపెడుతుంది, తన ప్రయత్నం లేకుండానే.
ఈ పాపాయి ఇంకొంచెం ఎదిగి, ఏదైనా చెడ్డ పని చేయగానే, చెడ్డవాడు, దుష్టుడు అనే ముద్ర వస్తుంది. దీనినే కళంకము అంటాము. ఈవిధమైన కళంకములు ఏవీ కూడా పరమేశ్వరికి ఆపాదించలేము. ఎందుకంటే, పరాత్పరి "నిరాకారా" కదా! అందుకనే, "నిష్కళంకా" అన్నారు, శ్రీమాతను.
రావణబ్రహ్మ బ్రహ్మజ్ఞాని. అన్ని సద్గుణములు ఉన్నవాడు. అయితే ఏమి, పరస్త్రీని చెరపట్టి దుష్టుడు అయ్యాడు. కళంకము మూటకట్టకున్నాడు. చివరికి, రామబాణానికి ఆహుతి అయి ఒరిగాడు. ఇలా ఎదో ఒక విధంగా కళంకితులు అయినవారే, అమ్మ కోపాగ్నికి బలి అయినవారే మహిషాసురుడు, భండాసురుడు మొదలైన రాక్షస ప్రముఖులు. వీరందరినీ, ఈవిధంగా దుష్కర్మరలను చేసి కళంకితులైన వారందరినీ, నయాన, భయాన మంచి మార్గం లొకి తెచ్చి తన ఒడికి చేర్చుకున్న శ్రీమత్సింహాసనేశ్వరికి మాత్రం ఎటువంటి కళంకములు అంటవు.
మనలో ఉన్న అన్ని అవలక్షణాలను జ్ఞానాంజన శలాక తో దూరంచేయగలిగేది శ్రీమాత ఒక్కతే అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిష్కళంకాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి