తెలివైన చిలుక: వై. జశ్వంత్, 6వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల అంబం (వై), ఎడపల్లి, జిల్లా: నిజామాబాద్.


 అనగనగా ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతను రోజూ అడవిలోకి వెళ్లి చిలుకలను పట్టేవాడు. పట్టుకున్న చిలుకలను నగరానికి తీసుకెళ్లి అమ్మి అదే తన జీవనంగా గడిపేవాడు. ఆ చిలుకలు ఆకుపచ్చ రంగు రెక్కలతో చాలా అందంగా ఉండేవి. ఎర్రని ముక్కుతో చూడగానే ఎవరికైనా నచ్చేవి. కొన్ని చిలుకలు మన మాటలు కూడా అనుకరిస్తుండేవి.
అందుకే బోయవాడి దగ్గర నుంచి చిలుకలు బాగా అమ్ముడయ్యేవి. ఒకరోజు బోయవాడికి ఒక చిలుక చిక్కింది. ఆ చిలుక మిగతావాటిలా కాదు. చాలా తెలివైనది. దానికి అడవిని వదిలి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇంత పెద్ద అడవిని వదిలి ఈ చిన్న పంజరంలో ఎలా ఉండాలి? అని చిలుక మనసులో బాధపడింది. పంజరంలో ఉండటం అంటే తన స్వేచ్ఛ పోయినట్టేనని అనుకుంది. అడవిలోనే ఉండాలనుకున్న చిలుకఒక ఉపాయం ఆలోచించింది. బోయవాడు పెట్టిన ఆహారాన్ని తినలేదు. నీటిని కూడా తాకలేదు. రోజులు గడుస్తుండగా చిలుక సన్నగా, నీరసంగా మారిపోయింది. దాన్ని చూసిన బోయవాడు, “ఈ చిలుకకు ఏదో జబ్బు వచ్చినట్టుంది” అని అనుకున్నాడు. చిలుక అలా బలహీనంగా ఉండడంతో ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదు. అప్పుడు బోయవాడు, “దీనికి ఏమైందో ఒకసారి చూద్దాం” అని అనుకొని చిలుకను పంజరం నుంచి బయటకు తీసాడు. తన చేతి మీద కూర్చోబెట్టగానే చిలుక చుట్టూ చూసుకుంది. అదే అవకాశంగా భావించి ఒక్కసారి ఒంట్లో ఉన్న శక్తినంతా తీసుకొని రెక్కలు చాపింది. తుర్రుమని ఎగిరిపోయింది. చిలుక నేరుగా అడవిలోకి వెళ్లిపోయింది. చెట్ల మధ్య సంతోషంగా కూస్తూ స్వేచ్ఛగా ఎగిరింది. బోయవాడు మాత్రం చిలుక తెలివికి ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడ్డాడు.
నీతి :తెలివి ఉంటే ఆపదల నుంచి బయటపడవచ్చు. స్వేచ్ఛకు మించిన సంపద లేదు.
కామెంట్‌లు