రోజూ వాకింగ్ చేసి ఇంటికి వెళుతూ ఒక కొబ్బరి బొండం త్రాగి వెళ్ళడం అలవాటు నాకు .ఆ రోజు కూడా యధావిధిగా ఆగి, బొండం త్రాగుతూ ఉండగా ప్రక్కనే బొగ్గులను పేర్చుకుంటూ... మొక్కజొన్నపొత్తుల అతను కనిపించాడు. పొత్తులు లేతగా చాలా బాగున్నాయి. సరే! కాసేపు నుంచుని ఓ రెండు పొత్తులు కాల్పించుకుని తీసుకెళదామని చూస్తున్నాను.
అతను బొగ్గులకి మంట రాజేసుకున్నాక "ఏం బాబు! పొత్తు ఎంత?" అని అడిగాను."ముప్పై రూపాయలు అండి" అన్నాడు. రెండు తీసుకుంటాను యాభై చేసుకో" అన్నాను."లేదండి రావు!" అన్నాడు. పొత్తులు బాగున్నాయి కదా అని "సరే! రెండు కాల్చివ్వు" అన్నాను.
నా చిన్నప్పటినుంచి కూడా ఈ మొక్కజొన్న పొత్తులు కాల్చే వాళ్ళని చూస్తే తెగ జాలి వేస్తుంది నాకు. వాళ్ళు పొత్తులు కాల్చడానికి విసనకఱ్ఱతో రోజంతా విసిరి విసిరి పాపం! జబ్బలు పులిసిపోతాయి, మణికట్లు నొప్పి పుడుతూ ఉంటాయి అని చాలా బాధపడుతూవుంటాను .
అతను పొత్తులు కాల్చడానికి వాడిన సాంకేతికత చూసి నాకు మూర్ఛ వచ్చినంత పని అయింది. విసనకఱ్ఱ లేదు, విసరడమూ లేదు. బ్యాటరీ ఫ్యాన్ ఆన్ చేసి బొగ్గుల దగ్గర పెట్టి హాయిగా కుర్చీలో కూర్చుని పొత్తులు కాలుస్తున్నాడు. అతని నైపుణ్యానికి అబ్బురపడి నాలో నేనే నవ్వుకుని పొత్తులు తీసుకుని వెళ్ళిపోయాను. 😂😂😂
#################################################
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి