వాకిలి. : - :పాలగుమ్మి జ్యోతి.
    

  సుధ వాకిలిని ఆనుకుని కూర్చుని  ఎప్పటిలాగానే భర్త కోసం ఎదురు చూస్తోంది. భర్త బ్యాంకు యూనియన్ లీడర్ కావడంతో సహోద్యోగులు అంతా అందరి సమస్యలు తీరుస్తాడని పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. ఏ రోజూ యూనియన్ గొడవలే తప్ప ఇంటి గురించి తమ గురించి పట్టించుకున్నదే లేదు. సెలవు రోజుల్లో కూడా మీటింగులు, యూనియన్లంటూ బయటే గడుపుతాడు. అందరి సమస్యలు తీర్చి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుతాడు. క్రొత్త ఊరు కావడంతో, పరిసరాలు క్రొత్త కావడంతో  ప్రతిరోజూ భర్త త్వరగా ఇంటికి రావాలని, ఐదేళ్ళ కూతురి దగ్గర  కూర్చుని, ఎలా చదువుతోందో చూసి, తను పాఠాలు చదివేటప్పుడు అడిగే సందేహాలు తీర్చాలని సుధ కోరిక. "అమ్మా! ఈరోజు నాన్న త్వరగా వస్తారా? మనమందరం సరదాగా బయటకు వెళతామా?" అడుగుతున్న ఐదేళ్ల కూతురు శ్రేయ  ప్రశ్నకు ఎప్పటిలాగా అదే సమాధానం. "వస్తారు తల్లీ! నువ్వు చదువుకో,నాన్న రాగానే అందరం వెళదాం!" కూతురుతో అబద్ధం చెప్తున్నందుకు తనని సూటిగా చూడలేక, ఆ రోజైనా భర్త త్వరగా రావాలని ఆశగా వాకిలి వద్ద ఎదురుచూస్తూ చెప్పింది సుధ.
              **********
             శ్రేయ కాలేజ్ నుంచి ఇంకా రాలేదు. "ఆడపిల్లవి త్వరగా ఇంటికి రామ్మా! నువ్వు ఇల్లు చేరేవరకు నాకు కంగారుగానే ఉంటుంది. అసలే రోజులు బాగాలేవు!" ప్రతిరోజు కాలేజీకి పంపేటప్పుడు కూతురికి హితబోధలు చెబుతుంది సుధ. అయినా స్నేహితులనీ , సినిమాలనీ తల్లి మాటలను శ్రేయ పెడచెవిన పెడుతుంది .'తండ్రిలాగానే బయట వారికి ఇచ్చిన ప్రాముఖ్యత తల్లినైన నాకు ఇవ్వటం లేదు' అనుకుని విరక్తిగా నవ్వుకుని, కాలేజీకి వెళ్ళిన కూతురు ప్రతిరోజూ క్షేమంగా, త్వరగా ఇంటికి రావాలని వాకిలి దగ్గర ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంది  సుధ.
            †*********
             కాలచక్రం గిర్రున తిరిగింది. అమ్మాయికి పెళ్ళి చేసి పంపించేశారు. ఇప్పుడు భర్త, సుధ ఇద్దరే ఉంటారు. భర్త రిటైర్ అయిపోయాక , ఇంట్లో తోచడం లేదని ప్రైవేటు ఉద్యోగం చూసుకున్నాడు. అందరూ ఉండి కూడా సుధ ఎప్పుడూ ఒంటరే. భర్త త్వరగా ఇంటికి వస్తే ఇద్దరూ కష్టం, సుఖం పంచుకోవచ్చని, కలిసి భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకోవాలని సుధ కోరిక. కూతురితో, భర్తతో సరదాగా బయటికి వెళ్ళాలని వయసులో ఉండగా అనుకుంది తీరలేదు. శ్రేయ కాలేజీ చదువుకొచ్చాక  కూతురుతో స్నేహంగా ఉండాలని ఎంతగా ప్రయత్నించినా స్నేహితురాళ్ళతోనే ఆమె గడిపేది తప్ప సుధను  ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పటికీ  అదే వాకిలిని సుధ ఆనుకొని కూర్చుని, భర్త త్వరగా రావాలని, తనతో గడపాలని ఇంకా ఆశగా  ఎదురుచూస్తూనే ఉంది.
                              
                          #######################################.
కామెంట్‌లు