సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -344: ఇల్లెడు కొడితే తట్టెడు పెంకులు రాలవు
***
'అవ్వా! కొంతమందిరిని సూత్తుంటే మస్తుగని పిస్తది.గాళ్ళు కట్టుకునే పంచె ఏసుకున్న లాల్చీ అస్మంటియి సూత్తుంటే  గాయినంత దనంతుడు ఇంకోడు లేడన్నట్టు అన్పిత్తది .ఇంగ బుర్ర మీసాలు తిప్పుతుంటే పుడ్తె గస్మంటోళ్ళ యింట్లె  రాజా లెక్క పుట్టాలె అన్పిచ్చేది. ఇంగ గాయిన పెళ్ళాన్ని సూత్తుంటే కుళ్ళు బుట్టేది. "ఒంటినిండా దగదగ సొమ్ములతో గుల్లె అమ్మోరి లెక్క అగుపిత్తుంటే నాకెందుకు యిచ్చిండు గీ పేద జల్మ అన్కొని మస్తు ఏడ్పు వొచ్చేది.
 ఏంది శెల్లే! ఎవలి ముచ్చట నీకు ఏడుపా? గంత బాద వడ్తున్నవ్ ఎందుకు?
"ఆఁ ఏవుందవ్వా! గీ పేద బత్కుడూ .సచ్చే దనుక దుక్కమేనాయే!"
 "అయ్యో గంత దుక్కం ఎందుకు శెల్లే ఎవలి బతుకులు ఆళ్ళయి .ఎంత శెట్టుకు అంతగాలి అన్నట్టు ఉండాలెగని ఆళ్ళీళ్ళు అట్లిట్లున్నరని పోల్సుకుంటే ఎట్లా శెల్లే! ఇంతకీ ఎవలాయన శెప్పలేదు?"
"గదేనవ్వా! సుందరయ్యోరు ఉండ్రు సూడు శిన్నప్పన్నించి రాశ పుట్కేనాయె.గిప్పుడు సుత.నోశి పుడ్తరు అంటరు సూడవ్వా. గస్మంటోళ్ళ ముచ్చెటినే అవ్వా!"
అయ్యో! శెల్లే శెప్పక శెప్పక గా సుందరయ్యోరీ ముచ్చెటినే శెప్పినావు. గాయినతోనే పోల్సుకున్నావ్ ?శేతిల ముద్ద పైస లేకున్నా ఓగప్పటి దర్జా దర్పం ఒలకబోత్తుండు.ఒకోపాలి పాపం అనిపిత్తది ఇంకోపాలి ఉన్నదున్నట్లు శెప్పుకొని గా లెక్కనే ఉంటేంది అనిపిస్తది."
 "నువ్వు శెప్పింది నిజమేనా అవ్వా! అస్సలు నమ్మబుద్దెయ్యట్లే."
"గదే శెల్లే నీకు తెల్వదా ఏంది.గాళ్ళింట్ల గీ నడ్మల దొంగలు వడ్డరు.గాయిన బార్యయి తీరొక్క సొమ్ములను ఎత్తక పోయిండ్రట."
 అయ్యో గట్ల బీదోడు అయ్యిండా! ఏంది'"
గట్ల గాదు శెల్లే. గా సొమ్మంత గిలేటేనట. గా దొంగతనం సేశినోడు గవ్వీటిని నలగ్గొట్టి ఇంటెన్కాల  పడేశి ఓ కాయితం ముక్క సుత గందుల వెట్టిండంట.''
 "గదెందుకవ్వా! గింతకీ కాయితం మీద ఏవన్న రాశిండా ఏంది?"
 ఆఁ గదే మరి. "ఇల్లెడు కొడితే తట్టెడు పెంకులు రాలవు గని" గా గిలేటు నగలు అవుసరమా మీ మొకాలకి అని తిట్టుకుంట రాశిండంట. "
"గిదెక్కడి శిత్రమవ్వా! గీళ్ళు ఉన్నోళ్ళ లెక్క బత్కుడంటే పర్వు కోస్రం కావొచ్చు గని గా దొంగోడు గట్ల రాసుడేంది నవ్వొత్తుంది అవ్వా!"
అగ్గో గట్ల నవ్వుకోడం కోస్రం, లేనప్పుడు లేనట్టుండాలె గని గట్ల నటిచ్చుడు ఎందుకని శెప్పడం కోస్రం గీ సామెత శెబుతుంటరు శెల్లే!"
"గదండీ సంగతి! ఇల్లెడు కొడితే తట్టెడు పెంకులు రాలవు" అంటే గిదే మరి.గా దొంగ ఇల్లంత ఎతికినా పిసరంత సొమ్మో,పైసలో దొరకలేదని,గాల్ల బీదిర్కాన్ని ఎత్తి సూపడాన్కి గీ శాత్రం శెప్తుంటరు.
కామెంట్‌లు