జ్ఞాపకాల రేడియో ఇంకా ఆగలేదు... పాత సినిమాల పరదా దిగలేదు
____
"నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే. మనిషి తన ఊరి పేరు చెబుతాడు.కానీ నిజానికి అతడు వచ్చేది
తన జ్ఞాపకాల నుంచే..." కొందరు కొన్ని పుస్తకాలు చదవడానికి రాస్తారు. ఇంకొందరు కొన్ని పుస్తకాలు గుర్తు చేసుకోవడానికి రాస్తారు. మరికొన్ని పుస్తకాలు మాత్రం మనం మరచిపోయామని అనుకున్న కాలాన్ని మళ్లీ మన ముందు పరచడానికి, మన చేతుల్లో పెట్టడానికి రాస్తారు.
డాక్టర్ వుడుత చంద్రశేఖర్ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకం అలాంటిది.
ఈ పుస్తకాన్ని చదువుతుంటే నాకు ఒక పాత ఇంటి అటక మీదికి ఎక్కిన అనుభూతి కలిగింది. దుమ్ము పట్టిన సందూకుల మధ్య నుంచి ఒక పాత ఫోటో ఆల్బమ్ బయటపడినట్టు అనిపించింది. ఆ ఆల్బమ్‌లో ఫోటోలు మాత్రమే లేవు. పాటలు ఉన్నాయి. స్వరాలు ఉన్నాయి. వినసొంపయిన రేడియో స్వరాలు, ప్రకటనలు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నాలు విన్న సంక్షిప్త శబ్ద చిత్రాలూ ఉన్నాయి. మ్యాటినీ షో సినిమాకు వెళ్లిన అబ్బాయి కళ్లలో మెరిసిన మెరుపు ఉంది. పల్లెటూరి చీకట్లో రేడియో చుట్టూ చేరిన కుటుంబం ఉంది. ఒకప్పుడు మన జీవితంలో ‘ఆకాశవాణి’ ఒక కుటుంబ సభ్యురాలు. ఉదయం సుప్రభాతంతో తలుపు తట్టేది. మధ్యాహ్నం పాడి పంట, పాటలతో పలకరించేది. సాయంత్రం వార్తలు చెప్పేది. రాత్రి నిద్రపుచ్చేది. ఇప్పుడు వందల ఛానెల్‌లు, వేల పాటలు మన వేలి కొనల్లో ఉన్నా ఆ మెరుపు మాధుర్యం కరువే. ఆ కాలంలో ఒక పాట వినడానికి మనసంతా ఎదురుచూసేది. ఒక కార్యక్రమం కోసం వారమంతా వేచి ఉండేది. పాట వినిపిస్తున్నప్పుడు ఇంట్లో ఎవరూ పెద్దగా మాట్లాడేవారు కాదు. ఎందుకంటే పాట అనేది అప్పట్లో వినోదం మాత్రమే కాదు జీవితానికి తోడు వూరట.
ఈ పుస్తకంలో రచయిత డాక్టర్ వుడుత చంద్రశేఖర్ ఆ తోడును వెతుక్కుంటూ తన గతంలోకి, అనుభవాల్లోకి పాత అనుభూతుల్లోకి వెళ్లారు. తను పాటలను గుర్తు చేసుకోలేదు. పాటలు అతన్ని గుర్తు చేసుకున్నాయి. ఆలవోకగా జ్ఞాపకం నుంచి కాగితాల మీదికి నడిచి వచ్చాయి. తను సినిమాలను వెతికి రాయలేదు. తనకు నచ్చిన సినిమాలే అతని జ్ఞాపకాల తలుపు తట్టాయి, ముందు నిలబడ్డాయి.
రచయిత డాక్టర్ వుడుత చంద్రశేఖర్ మనసును ఒక పాట తాకితే అది కేవలం సంగీతం కాదు. అది ఒక అనుభవం ఒక ప్రభావవంతమయిన కాలం.
అందుకే డాక్టర్ వుడుత చంద్రశేఖర్ మనకు ఆ పాటలను కేవలం గుర్తుచేయడు. మనల్ని ఆ కాలానికి తెస్సుకెళ్తాడు. డాక్టర్ గా కృషి చేస్తూనే సంగీతం సినిమాలు వాటి పై అభిమానం పెంచుకొడవడమే కాకుండా అక్షర బద్దం చేయడం అభినందిచాల్సిన విషయం. సినిమాలు పాటలు సాహిత్యం ఇవన్నీ నాకూ అభిమాన విషయాలే కావడంతో ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు అనేక అంశాలు మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చాయి. గతంలో ఒక పాట విన్నప్పుడు కలిగిన కంపనం. ఒక సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టని రాత్రి. ఒక గాయకుడి స్వరంలో తన బాధను కనుగొన్న క్షణం. ఒక కథానాయకుడిలో తన కలను చూసుకున్న వయసు. ఇవన్నీ నాలోపల మళ్ళీ ఫిల్మ్ రీలు లా గిరా గిరా తిరిగాయి. ఇందులో తెలుగు సినీ గాయకులు రామకృష్ణ, మోహనరాజు వంటి తెరమరుగైపోయిన కళాకారుల ప్రస్తావన ఉంది. ఎన్నో మరుగునపడిపోయిన గీతాల ప్రస్తావనాలున్నాయి. అనేక మంది మరచిపోయిన స్వరాల ప్రతిధ్వనులు ఉన్నాయి. ఇవి కేవలం సమాచారంగా ఉండి ఉంటే ఈ పుస్తకం ఒక సూచికగా మిగిలిపోయేది. కానీ రచయిత డాక్టర్ వుడుత చంద్రశేఖర్ వాటి మధ్య తన ఆనందాన్ని అనుభవాన్ని హృదయాన్ని ఉంచారు. అదే ఈ పుస్తక బలం.
ఒక పాట గురించి రాస్తూ దాన్ని మొదటిసారి ఎక్కడ విన్నారో చెబుతారు. ఒక సినిమా గురించి చెబుతూ అది తనలో మిగిల్చిన వెలుగునీ నీడనీ పంచుకుంటారు. ఆ వ్యక్తిగత స్పర్శ వల్లే ఈ పుస్తకం పాఠకుడి చేతిలో ఒక డేటా బుక్‌గా కాకుండా ఒక మిత్రుడిలా మారుతుంది. జ్ఞాపకాలు విచిత్రమైనవి. మనకు మరిచిపోయిన పేర్లు గుర్తుండవు.
కానీ ఒక పాట మొదటి రెండు పంక్తులు మాత్రం యాభై ఏళ్ల తర్వాత కూడా గుర్తుంటాయి. ఒక సినిమా కథ మొత్తం మరిచిపోతాం. కానీ ఒక దృశ్యం జీవితాంతం వెంటాడుతుంది. కాలం తీసుకుపోయేది మన వయసును మాత్రమే.
మనసును తాకిన స్వరాలను కాదు. అందుకే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనం రచయిత జ్ఞాపకాలను మాత్రమే చదవం. మన సొంత జ్ఞాపకాల గదుల్లోకి కూడా ప్రవేశిస్తాం.
జీవితంలో అన్నీ కోల్పోయినట్టు అనిపించిన సందర్భాల్లో కూడా కొన్ని పాటలు మనతో ఉంటాయి. కొన్ని సినిమాలు మనకు ధైర్యం చెబుతాయి. కొన్ని జ్ఞాపకాలు చీకటిలో దీపాలవుతాయి. పాత పాటలు సినిమాలు అంటే ఇష్టం వున్న వాళ్ళకు డాక్టర్ వుడుత చంద్రశేఖర్ పుస్తకం అలాంటి దీపాల సమాహారం.
ఇది రచయిత అనుభూతించిన సాంస్కృతిక స్వీయచరిత్ర.
చివరగా ఒక మాట— పాత పాటలు ఎప్పుడూ పాతబడవు. పాత సినిమాలు ఎప్పుడూ ముగియవు.
నిజమైన జ్ఞాపకాలు ఎప్పుడూ చనిపోవు. అవి మనలో ఎక్కడో ఒకచోట కూర్చుని, మళ్లీ ఎప్పుడైనా పిలుస్తావా అని ఎదురుచూస్తుంటాయి. ఈ పుస్తకం ఆ పిలుపు. ఆ పిలుపును అందుకోండి. చదవండి.
======================================================================
— వారాల ఆనంద్
కవి,రచయిత,సినీ విమర్శకుడు
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి