మౌనం శిక్షే: - -యామిజాల జగదీశ్


 కొన్ని గొడవల్లో మాటలు గాయపరుస్తాయి.
కానీ కొన్ని బంధాల్లో మాటలే లేకుండా ఒకరు మరొకరిని గాయపరుస్తారు.
మనం పంపే మెసేజ్ చూడరు.
మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వరు.
ఒకే ఇంట్లో ఉన్నా లేని మనిషిలా చూస్తారు.
ఏం తప్పు చేశానని అడిగినా బదులు ఉండదు.
ఇంకెంత సేపు ఇలా ఉంటావని అడిగినా మౌనమే మిగులుతుంది.
ఆ మౌనం విశ్రాంతి కాదు.
కొన్నిసార్లు అది శిక్ష.
నువ్వు చేసింది నాకు నచ్చలేదు అందుకే నిన్ను నా ప్రపంచం నుంచి  దూరం చేస్తున్నా అని మాటలు లేకుండా చెప్పే ఒక క్రూరమైన నిజం.
అది అనుభవించే మనిషికే దాని నొప్పి తెలుస్తుంది.
మొదట్లో కోపం వస్తుంది.
తర్వాత గందరగోళం వస్తుంది.
ఆ తర్వాత భయం వస్తుంది.
చివరికి
నేనేం చేశాను నాతో మాట్లాడు దయచేసి ఇలా ఉండొద్దు
అని ప్రేమ కోసం కాదు ఒక సమాధానం కోసమే బ్రతిమిలాడడం మొదలుపెడతాం.
అదే ఈ మౌనంలో చాలా బాధపెట్టే విషయం.
ఒక సమస్యను పరిష్కరించాల్సిన మనిషితోనే మాట్లాడటానికి పోరాడాల్సి వస్తుంది.
ఒక దశలో అసలు సమస్యేంటో మర్చిపోయి
అతను ఎప్పుడు మళ్ళీ నాతో మామూలుగా మాట్లాడుతాడు
అనేదే ముఖం అయిపోతుంది.
అతను మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాక మనశ్శాంతి వస్తుంది.
ఆ ప్రశాంతత కోసం వచ్చేసరి మన తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పాలనిపిస్తుంది.
ప్రశ్నించడానికి భయపడతాం.
సలహా చెప్పడానికి జంకుతాం.
ఏదైనా చెప్తే మళ్ళీ ఆ మౌనం వస్తుందేమోనని మన మాటలనే కొలిచి మాట్లాడడం మొదలుపెడతాం.
అక్కడ ఒక బంధం క్రమంగాతను కోల్పోతుంది.
ఎందుకంటే ఒకరికి కోప్పడే హక్కు ఉంటుంది.
మరొకరు ఆ కోపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతతో బతకడం మొదలుపెడతారు.
కానీ ప్రతీ మౌనం క్రూరమైనది కాదు.
కొన్నిసార్లు గొడవల్లో మనుషులు నిజంగానే దెబ్బ తినవచ్చు.
వాళ్లకు ఆ సమయంలో సరిగ్గా మాట్లాడడం రాకపోవచ్చు.
అలాంటి సమయంలో
నాకు కొంచెం టైం కావాలి నేను ప్రశాంతత అయిన తర్వాత దీని గురించి మాట్లాడతాను
అని చెప్పి పక్కకు తప్పుకోవడం ఆరోగ్యకరమైన దూరం కావచ్చు.
అందులో తిరిగి వచ్చి మాట్లాడాలనే ఆలోచన ఉంటుంది.
కానీ శిక్షించే మౌనంలో మరో ఉద్దేశ్యం ఉంటుంది.
నీకు నొప్పి కలగాలి.
నువ్వు నన్ను వెతకాలి.
నువ్వు ముందొచ్చి బ్రతిమిలాడాలి.
నేను మాట్లాడే వరకు నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు.
అనే అధికారం దాగుంటుంది.
ప్రేమలో దూరం ఉండొచ్చు.
కోపం ఉండొచ్చు.
కొన్ని గంటల నిశ్శబ్దం కూడా అవసరం కావచ్చు.
కానీ ప్రేమను వెనక్కి తీసుకోవడానికి ఎవరైనా భయపడి బతకాల్సిన పరిస్థితి ఉండకూడదు.
నిన్ను ప్రేమించే మనిషి నీపై కోపపడొచ్చు.
నీతో వాదించొచ్చు.
నాకు ఇప్పుడు మాట్లాడాలని లేదు అని చెప్పవచ్చు.
కానీ ప్రతి అభిప్రాయ భేదం తర్వాత
నిన్ను లేని మనిషిలా చూసి నువ్వు కుప్పకూలి వచ్చి బ్రతిమిలాడే వరకు ఎదురుచూడడం
సమస్యను పరిష్కరించే పద్ధతి కాదు.
ఒకరి మనసును నియంత్రించడానికి మౌనాన్ని ఆయుధంగా వాడుతున్నారేమో అనిపించవచ్చు.
కొన్ని గాయాలకు శబ్దమే ఉండదు.
ఎవరు తిట్టి ఉండరు.
ఎవరు తలుపులు పగలగొట్టి ఉండరు.
కానీ ఒకే ఇంట్లో ఒకరు ఏడుస్తూ ఉంటారు.
మరొకరు అసలు వాళ్ళున్నారనే విషయమే మర్చిపోయినట్టు సైలెంట్‌గా ఉంటారు.
ఆ నిశ్శబ్దం కూడా బాధిస్తుంది.
కొన్నిసార్లు మాటల కంటే ఎక్కువగా.
అందుకే కోపంగా ఉంటే చెప్పండి.
విశ్రాంతి కావాలంటే అడగండి.
మాట్లాడలేకపోతే టైం అడగండి.
కానీ
నిన్ను ప్రేమించే ఒకరి మనసును ముక్కలు చేయడానికి మౌనాన్ని ఆయుధంగా మార్చకండి.
ఎందుకంటే ఎక్కువ కాలం శిక్షలా దొరికిన మౌనం
ఒకరోజు వాళ్లను నీతో మాట్లాడకుండానే చెయ్యవచ్చు.
బదులుగా
నీతో ఏది చెప్పకుండా బతకడం నేర్పిస్తుంది.
అప్పుడు ఇంట్లో మౌనం ఉండదు.
బంధంలోనే చాలా పెద్ద దూరం ఉంటుంది.
కామెంట్‌లు