వృద్ధాప్యం చాలా దారుణమైనది.: - - యామిజాల జగదీశ్


 ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారి అర్హతలను మాత్రమే చూడకండి. ఆకలితో, అవసరంలో ఉన్నవారి దగ్గర బేరాలు ఆడకుండా వస్తువులు కొనడం మంచిది. అది మీకు ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది.
కన్నవారిని అనాథలుగా వదిలేయడం మహాపాపమని మన పురాణాలు చెబుతున్నాయి.
మదిని కలచివేసే ఒక నిజ జీవిత సంఘటన :
నేను రోజూ ఆఫీసుకు వెళ్లే దారిలో ఒక పెద్దాయనను చూసేవాడిని. ఎండనక, వాననక ఆయన ఆటబొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు.
ఓరోజు ఒక బొమ్మ కొందామని ఆయన దగ్గరకు వెళ్లాను. ఒక తెల్లటి పిల్లి బొమ్మ చూపించి "ధర ఎంత?" అని అడిగాను.
ఆయన "80 రూపాయలు" అన్నాడు.
పెద్ద పెద్ద షాపుల్లో రూపాయి కూడా తగ్గించమని అడగని మనం, ఇలాంటి పేదల దగ్గరే కదా బేరాలు ఆడతాం! అది సగటు మనుషుల సహజ స్వభావం కాబోలు...
నేనూ అదే పనిచేశాను. "ఏంటయ్యా, చిన్న బొమ్మకి 80 రూపాయలా? 70 రూపాయలకు ఇవ్వు" అన్నాను.
ఆయన నా కళ్లలోకి నేరుగా చూస్తూ "ఇది మీ చిన్నారి కోసమేనా కొంటున్నారు?" అని అడిగాడు.
నేను "అవును" అన్నాను.
ఆయన కాస్త బొంగురుపోయిన గొంతుతో "సరే, 70 రూపాయలే ఇవ్వండి" అన్నాడు.
అలా అంటున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చడం గమనించాను. నా మనసు ఏదోలా అనిపించింది.
"ఏమైందయ్యా? ఎందుకు ఏడుస్తున్నారు?" అని అడిగాను.
"ఏమీ లేదు బాబూ" అని సర్దుకోబోయాడు. కానీ నేను మళ్లీ మళ్లీ వదలకుండా అడిగేసరికి ఆయన మెల్లిగా తన కథ చెప్పడం మొదలుపెట్టాడు.
"నా పేరు ఆవుడైయప్పన్ (77). నా భార్య పేరు పార్వతి (73).
మాకు ఆరుగురు పిల్లలు. చాలా పేద కుటుంబం.
ఎన్నో కష్టాల నడుమ పిల్లలను పెంచి పెద్ద చేశాం. చాలా రోజులు నేను, నా భార్య అసలు తినడమే మానేసేవాళ్లం. ఉన్న కాస్త అన్నం పిల్లలకే పెట్టేవాళ్లం. ఎన్నో రాత్రులు పస్తులు పడుకున్నాం. అయినా నా భార్య నాపై ఒక్క రోజు కూడా కోపడలేదు, గొడవ పడలేదు.
పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాక వాళ్లు వేరు కాపురాలు పెట్టేశారు. మాకేమో వయసు మళ్లిపోతోంది. శరీరంలో ఓపిక తగ్గింది. కన్న పిల్లల ఇంట్లో ఉందామనే ఉద్దేశంతో పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లి పరిస్థితి చెప్పాను.
దానికి వాడు 'నేను ఇద్దరినీ ఇంట్లో పెట్టుకుని పోషించలేను. మీలో ఎవరో ఒకరు మాత్రమే నా దగ్గర ఉండండి' అన్నాడు. ఇక వేరే దారి లేక నేను పెద్ద కొడుకు ఇంటికి, నా భార్య ఇంకొక కొడుకు ఇంటికి విడిపోయి వెళ్లాం.
47 ఏళ్ల పాటు కలిసి జీవించిన భార్యను వదిలి దూరంగా ఉండటం నరకంలా అనిపించింది. రోజులు గడిచేకొద్దీ తట్టుకోలేక చాలా రాత్రులు ఏడ్చాను. చివరికి ఆమె జ్ఞాపకాలు నన్ను నిద్రపోనివ్వక, నా భార్య ఉన్న ఊరికి వెళ్లాను.
'మనం ఇద్దరం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా?' అని నా భార్యను అడిగాను. ఆమె కూడా కన్నీళ్లతో సరేనంది. అలా కొడుకుల ఇళ్లు వదిలి బయటకు వచ్చేసి ఇప్పటికి ఏడాది దాటింది.
పొట్టకూటి కోసం నేను ఇలా కాలినడకన తిరుగుతూ పిల్లల బొమ్మలు అమ్ముతున్నాను. రోజుకు 80 నుండి 100 రూపాయల వరకు లాభం వస్తుంది. దాంతోనే కాలం వెళ్లదీస్తున్నాం.
ఇప్పుడు నా వయసు 77 ఏళ్లు. ఏ క్షణంలోనైనా నా ప్రాణం పోవచ్చు.
వచ్చే ఆ వంద రూపాయల్లోనే కొంత డబ్బు దాచిపెడుతున్నాను. మా చావు ఖర్చుల భారం కూడా ఆ పిల్లలపై పడకూడదని ఆ దాచిన సొమ్ము నా భార్య చేతికి ఇస్తుంటాను."
ఒక రోజు నా భార్య "ఈ డబ్బు దేనికి దాస్తున్నారు?" అని అడిగింది.
"మన దహన సంస్కారాల ఖర్చుల కోసం" అని చెప్పాను.
ఆ మాట వినగానే ఆమె పెద్దగా అరుస్తూ ఏడ్చేసింది.
"ఇప్పుడు నా భార్య దేవుడిని రోజు ఒకటే వేడుకుంటోంది... 'నా మొగడు చనిపోయే ఆ క్షణంలోనే నాకూ చావు ఇచ్చేయ్ దేవుడా' అని.
నా ప్రార్థన కూడా అదే బాబూ!" అని ఆయన ముగించాడు.
ఆ మాటలు విన్న నా మనసు ముక్కలైపోయింది.
"మీరు ఇక్కడ ఉన్నట్టు మీ పిల్లలకు తెలుసా?" అని అడిగాను.
"వాళ్లకు తెలియదు బాబూ. సంవత్సరం దాటినా మేము ఎలా ఉన్నామో, ఏమయ్యామో అని వాళ్లు కనీసం ఆలోచించినట్టు కూడా లేదు" అన్నాడు.
నా మనసు ఎంతో బరువెక్కింది. జీవిత చరమాంకంలో ఎన్నెన్ని గుండెకోతలు, బాధలు దాగి ఉన్నాయో కదా!
జీవితంలో కష్టపడి పనిచేసే సామాన్యుల దగ్గర, పేదల దగ్గర కొన్ని రూపాయల కోసం బేరాలు ఆడకండి. ఆ పది ఇరవై రూపాయలు మనకు పెద్ద వ్యత్యాసం చూపించకపోవచ్చు, కానీ వాళ్ల జీవితాల్లో ఒక పూట కడుపు నింపుతాయి.
తమిళంలో చదివిన వాస్తవ కథనం. మూల రచయిత ఎవరో తెలియలేదు. మనసుని కట్టిపడేసిన మాటలవల్ల స్వేచ్ఛానువాదం చేశాను. అసలు రచయితకు హృదయపూర్వక కైమోడ్పు.
కామెంట్‌లు