చేదు అనుభవాలు: - యామిజాల జగదీశ్


పుస్తకాలంటే ఇష్టం. ప్రేమ. అభిమానం. ఆసక్తి... ఇలా ఎన్ని మాటలు చెప్పాలో తెలీడం లేదు. ఓ ఇద్దరు ప్రముఖులతో కొన్ని రోజుల క్రితం పుస్తకాల గురించి మాట్లాడాను. ఒకటి రెండు పుస్తకాలు కూడా అడిగాను. అయితే వారిచ్చిన సమాధానాలు విస్మయపరిచాయి. 
ఒకరిలా చెప్పారు...
నేను మీరనుకుంటున్న అడ్రెస్సులో లేను. అక్కడ ఖాళీ చేసి తాముంటున్న ప్రాంతం చెప్పారు. పైగా నేనక్కడికి రాలేనన్నారు. కానీ ఆయన చెప్పిన ప్రదేశం నాకేమీ కొత్త కాదు. ఆ ప్రదేశాన్ని దాటే మా చుట్టాలుండేవారు. వారింటికి రెగ్యులర్ గా వెళ్ళొస్తుండే వాడిని. కనుక ఈ ప్రముఖుడికి నేను వారింటికి రావడం ఇష్టం లేకపోవచ్చు... లేదా నేనడిగిన పుస్తకం నాకివ్వడం ఇష్టం లేకపోయుండొచ్చు. పోనీ నేనడిగిన పుస్తకం నా దగ్గర లేదని చెప్తే సరిపోయేది కదా అనుకున్నాను. అయితే ఇక్కడో విషయం చెప్పాలి... ఈ గొప్ప వ్యక్తిని అడిగిన పుస్తకం కొంత కాలానికి ఒక పాత్రికేయుడి పెద్దమనసుతో పొందాను. అడిగిందే తడవుగా ఆయన జిరాక్స్ తీసి బైండ్ చేయించి తన సహాయకుడిద్వారా మా ఇంటికి పంపడం ఊహాతీతం.
ఇక రెండో ప్రముఖుడు చెప్పిన మాట చివుక్కుమనిపించింది. ఆయన పుస్తకసేకరణను చూడటంతోపాటు ఒకటో రెండో పుస్తకాలు అడిగి తెచ్చుకోవాలని అనుకున్నాను. అదే విషయం ఫోన్లో చెప్పానుకూడా. అయితే ఆయన పుస్తకాలు అటక పైన ఉన్నాయన్నారు. అప్పుడు నేనో మాట చెప్పాను... పోనీ మీకు సాయం చేస్తాను పుస్తకాలు సర్ది పెడతాను అని. ఈ మాటకు ఆయన చెప్పిన జవాబు...
"మీరనడం ఎలా ఉందంటే, మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలిచి మీతో వంట చేయించడంలాగా ఉంటుంది మీరు మా ఇంటికొచ్చి పుస్తకాలు సర్దడం" 
ఇలా అన్నారే తప్ప కనీసం పుస్తకాలు చూడడానికిసైతం ఇష్టపడలేదని ఆయన మాటతీరుతో గ్రహించాను. మరి ఆయన అంతకుముందు కొన్ని పుస్తకాలు మా సమీప బంధువుకి ఇంటికి మరీ పిలిచి ఎలా ఇచ్చారో అర్థం కాలేదు. 
మా బంధువు అదృష్టం అది. నాది దురదృష్టం అనుకోవాలి.
నిజానికి ఈ పై ఇద్దరూ ప్రముఖులే. పది మందికీ తెలిసిన వారే. అందుకే వారి పేర్లు ప్రస్తావించలేదు. 
ఏదేమైనా ఆ చేదు అనుభవాలు మరచిపోలేనివే!!
పుస్తకాలివ్వని ఇద్దరితోపాటు పుస్తకం ఇచ్చిన వ్యక్తికీ నమస్సులు.
కామెంట్‌లు