సుప్రభాత కవిత : - బృంద


అంతరంగాన ఆమనులను 
అలవోకగా అందించి 
అరవిరిసిన  విరులంటి 
అడియాసలు  తెచ్చేవా?

కనులనిండా కలలు నింపి 
కనువిందుగా జగతిని మార్చి 
కలవరాలు కలగలిపి 
కళ్ల లో కళలు నింపేవా?

చిలకపచ్చ పందిరిపై 
చిరునవ్వులు వెదజల్లే 
సిరిమల్లెల పరిమళమంటి 
చిరు స్నేహం చూపించేవా?

తెలియని సంతోషాల
తెప్పలపై ఊరేగించి 
తెలి వెలుగుల పల్లకిలో 
తేలిపోయే వరమిస్తావా?

వెన్నెల స్నానం చేసినట్టు 
వెతలన్నీ కడిగేసి 
వేడుకలే వెల్లివిరిసే 
వేయి వసంతాలు తెస్తావా?

ఊరుకున్న ఉల్లాన్ని 
ఊహల ఊయలలూపి 
ఊరించి ఉత్సాహం నింపే 
ఉదయానివి  అవుతావా?

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు