ప్రజాకవి కాళోజి కి అక్షర నివాళి.: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-సెయింట్ లూయిస్- అమెరికా.


 ప్రజలే నా దేముళ్ళు ప్రజాహితమే  నా జీవితలక్ష్యం
మాతృభాషతోనే  సమాజ ప్రగతి సాధ్యమని 
ఏ భాషనీది ఏమి వేషమురా 
ఈ భాష వేషం ఎవరికోసంరా 
ఆంగ్లమున మాటలనగానే అంత మక్కువెందుకురా
అన్యభాషలు నేర్చి
ఆంధ్రంబు రాదనుచు 
సెకలించు  ఆంధ్రుడా  చావ వెందుకురా అని
నిర్భయంగా నిర్మొహమాటంగా  చెప్పిన  భాషాభిమాని
కాళోజి.
పుట్టుకనీది చావు నీది 
బ్రతుకంతా దేశానిది  అని
జీవితమంతా ప్రజా సంక్షేమకోసం 
నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా
తన కవితలచే సమాజానికి ప్రేరణనిచ్చి 
జైలు జీవితం గడిపిన కాళోజీ మీరు సదా స్మరణీయులు
.
అన్నపురాశులు ఒక చోట
ఆకలిమంటలు ఒకచోట 
సంపదలన్నీ  ఒక చోట గంపెడు బలగం ఒక చోట అని
అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక అని
సమాజానికి దశా దిశా నిర్దేశించిన ప్రజాకవి
మీరు డాక్టరేట్, దేశ అత్యున్నత పద్మవిభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలకే వన్నెతెచ్చారు.
మరణానంతరం మీ పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకిచ్చిన త్యాగనిరతులు
మీ నిష్కళంక సేవా నిరతి 
భాషాభిమానానికి గుర్తింపుగా 
మీ జన్మదినాన్ని తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రభుత్వం  జరపడం 
మీకిచ్చిన అత్యున్నత గౌరవం 
అందుకోండి ప్రజాకవి కాళోజి  నారాయణ రావు గారు 
మీకివే నే సమర్పిస్తున్న అక్షర నివాళి...!!
.................................
కామెంట్‌లు