కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: -376 వ రోజు
త్రిపురాసుర సంహారానికి కావలసిన రధము
దేవతల కోరిక మన్నించి త్వష్ట ప్రజాపతి విశ్వంభరా చక్రమును రథముగా చేసాడు. సూర్య చంద్రులను చక్రములుగా చేసి మహాసముద్రాలను ఇరుసులుగా చేసాడు. హిమవత్పర్వతము, వింధ్యాచలము, అస్తాచలమును స్తంభములుగా చేసాడు. త్రేతాగ్నులను హశ్వములకు త్రాళ్ళుగా చేసాడు. మేరు పర్వతమును ఛత్రముగా అమర్చాడు. నాలుగు వేదములను నాలుగు అశ్వములుగా అమర్చాడు. ఒక సంవత్సర కాలమును విల్లుగా చేసి విష్ణుమూర్తిని బాణంగా ఉండమని కోరాడు. ఈ విధంగా రథమును చేసాడు త్వష్ట ప్రజాపతి. అది చూసి శివుడు సంతోషించిన పరమశివుడు గ్రహమండలమును ఉపాదానముగా చేసి విశ్వకర్మ చేసిన కవచమును తొడుగుకొన్నాడు. వృషభమును ధ్వజము మీద నిలిపి త్వష్టప్రజాపతి తన కొరకు రూపొందించిన రథము అధిరోహించి విల్లును పట్టుకున్నాడు. శివుడు ఇంద్రుడితో " దేవేంద్రా ! నాకు సారధి ఎవరు " అని అడిగాడు. ఇంద్రుడు " నీకు ఇష్టము అయిన వాడిని ఎన్నుకో " అన్నాడు. శివుడు " దేవేంద్రా ! నా సారధి నాకంటే అధికుడై ఉండాలి. అలాంటి వాడిని నాకు సారధిగా నియమించండి " అన్నాడు. దేవతలు మునులతో సంప్రదించి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి " బ్రహ్మదేవా ! నీవు కోరిన ప్రకారము ఆ దేవదేవుడు మా కోరిక మన్నించి త్రిపురాసుర సంహారముకు అంగీకరించారు. మేము అతడు కోరినట్లు రథమును సమకూర్చాము. కాని ఆయన కోరినట్లు మాకు అతడిని మించిన సారధి దొరక లేదు. రుద్రుడికి సారధ్యం వహించడానికి మీకంటే ఎవరూ మాకు కనిపించుట లేదు కనుక మీరు రుద్రుడికి సారధ్యం వహించాలి " అప్పుడు బ్రహ్మదేవుడు వారి కోరిక మన్నించి రుద్రుడికి సారథిగా ఉండటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు సారథిగా రథమును అధిరోహించగానే రథాశ్వములు ఇద్దరు మూర్తులను భరించ లేక కింద పడుకున్నాయి. బ్రహ్మదేవుడు ఆ అశ్వములను లేపి వాటికి బలము, శౌర్యము ఇచ్చి త్రిపురాసురులతో యుద్ధానికి సన్నద్ధం చేసాడు. అప్పుడు పరమశివుడు " బ్రహ్మ దేవా ! ఆ రాక్షసులు ఉన్న వైపు రథము పోనిమ్ము " అన్నాడు. బ్రహ్మదేవుడు వాయువేగ మనో వేగాలతో రథమును తోలాడు. అధర్వుడు, అంగీరసుడు తనకు చక్రరక్షకులుగా రాగా పరమేశ్వరుడు రాక్షసులతో యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు తన విల్లు ఎక్కు పెట్టి పాశుపతమును మనసున స్మరించి ఆ మూడు పురములను తలిచాడు. వెంటనే పరమశివుని సంకల్పము మేరకు మూడు పురములు ఒక చోట చేరాయి. అప్పుడు రుద్రుడు పాశు పతమును ప్రయోగించి త్రిపురములను దగ్ధం చేసాడు. కాని ఆ పాశుపతాగ్ని జ్వాలలకు మూడు లోకములు దహించుకు పోసాగాయి. అప్పుడు శివుడు ఆ అగ్ని జ్వాలలను ఆర్పి వేసాడు. మహా మునులు, దేవతలు పరమశివుని స్తుతించారు. కనుక శల్య మహారాజా మీరు కర్ణుడి కంటే అర్జునుడి కంటే కృష్ణుడి కంటే బలము శౌర్యములో గొప్ప వాడివి. నా జీవితము, నా రాజ్యము మీ చేతిలోఉన్నాయి
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి