కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము-382 వ రోజు
శల్యుడు కర్ణుడు ఒకరిని ఒకరు నిందించు కొనుట
తనను కాకితోను అర్జునుడిని హంసతోను పోల్చడం కర్ణుడికి కోపానికి కారణం అయింది అతడు ఇక సహించ లేక " నీచుడా ! నన్ను ఇలా నీచంగా పోలుస్తావా ! అయినా నీచులకు నీచమైన మాటలే కదా వస్తాయి. అర్జునుడి పరాక్రమము గురించి నిన్ను అడిగానా అనవసంరంగా అర్జునుడిని పొగిడి మిత్రుడినైన నాకు ద్రోహము చేస్తావా ! యుద్ధములో శత్రుపక్షమును పొగిడే వారిని క్షమించ కూడదు. సుయోధనుడు నిన్ను నాకు సూతుడుగా నియమించాడు కనుక ఊరక ఉన్నాను. సుయోధనునితో నా మైత్రి లోకోత్తరమైంది. నీవు నాకు బద్ధ విరోధివి. నీకు బాధ కలించేలా సుయోధనుడికి ఆనందం కలిగించేలా నేను అర్జునుడిని గెలుస్తాను. నా రథము భూమిలో కూరుకు పోక నిలిచిన అర్జునుడిని గెలుచుట నాకు అసాధ్యము కాదు "అన్నాడు. శల్యుడు నవ్వి" కర్ణా ! ఏలనయ్యా ! ఈ వ్యర్ధ ప్రేలాపనలు. నీలాంటి కర్ణులు వేయి మంది అయినా అర్జునుడిని గెలువ లేరు " అన్నాడు. కర్ణుడు కోపము నిగ్రహించుకోలేక పోయాడు. శల్యా ! ఒక రోజు ఒక బ్రాహ్మణుడు బాహ్లిక దేశస్తులు మద్యపాన మదోన్మత్తులని, మాంసభక్షకులని, దిగంబరంగా దురాచారాలు చేస్తారని అని నిందించాడు. వారికంటే మద్ర దేశస్తులు అవినీతి పరులని పేర్కొన్నారు. అలాంటి వారికి రాజువైన నీవు నోరుమూసుకు ఉండుట మంచిది " అన్నాడు. శల్యుడు " కర్ణా ! నీ గురించి తెలియనిదా ! భీష్ముని చేత నీవు అర్ధరధుడవు అనిపించుకోలేదా ! అంగదేశంలో జనులు ఆడవాళ్ళను అమ్ముకుంటారట కదా ! అలాంటి వారికి రాజువైన నీవు నన్ను అంటావా ! ఒకరిని అనే ముందు తమ తప్పు తాము తెలుసుసు కొనుట మంచింది " అన్నాడు. వారి వివాదము విన్న సుయోధనుడు వారి వద్దకు వచ్చి సముచిత మాటలతో సర్ధి చెప్పి ఇరువురను యుద్ధోన్ముఖులను చేసాడు.
శల్యుడుపాండవ పరాక్రమమును శ్లాఘించుట
శల్యుడు " కర్ణా ! నీవు అర్జునుడిని జయించినచో నీవే మహారాజువు. మనకు ఈ రోజు దుశ్శకునము కానవస్తున్నాయి. యుద్ధము ఘోరంగా జరగబోయేలా ఉంది. కర్ణా ! అదుగో అర్జునుడి కపిధ్వజము. అర్జునుడు త్రిగర్త వీరులను చీల్చి చెండాడుతున్నాడు. కర్ణా ! ఎందుకైనా మంచిది. అర్జునుడిని గెలుస్తానని మనం మనం అనుకుని సంతోషిద్దాము. పెద్దగా అనకు పరువు పోతుంది. అర్జునుడిని గెలుచుట ఇంద్రునికైనా సాధ్యము కాని పని. కర్ణా అటు చూడు భీముడు, ధర్మరాజు, నకులసహదేవులు, ఉపపాండవులు అరివీర భయంకరులై ఎలా వెలిగి పోతున్నారో. ఎంతైనా పాండవులు ధర్మపరులు కదా ! కనుక ధర్మం ఎప్పుడూ వారినే వరిస్తుంది " అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేదు. సుయోధనుడు యోధులను చూసి " యోధులారా ! మీ బలపరాక్రమము చూపు సమయం ఆసన్నమైంది. అందరూ ప్రాణాల మీద ఆశ విడిచి యుద్ధము చేయండి. విజయమో వీర స్వర్గమో తేల్చుకోండి " అన్నాడు. అశ్వత్థామ " నా తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుని చంపి కాని ఈ కవచమును విప్పను. భీమార్జునులు అడ్డు వచ్చినా వారిని సంహరించి ధృష్టద్యుమ్నుడిని చంపుతాను " అన్నాడు.
యుద్ధారంభం
యుద్ధము ఆరంభం అయింది. సుయోధనుడు భీముని తన గజ సైన్యముతో ఎదుర్కొన్నాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు " అర్జునా ! అటు చూడు కర్ణుడు పఠిష్టమైన వ్యూహముతో ఎదుర్కొన్నాడు. మనము కూడా అతడికి తగు రీతిన బదులు చెప్పాలి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! కర్ణుడిని చంపడం పెద్ద పనే కాదు " అన్నాడు. ధర్మరాజు అయితే నీవు కర్ణుడిని గెలువుము, భీముడు సుయోధనుడిని, నకులుడు వృషసేనుడిని, సహదేవుడు సౌబలునీ, శతానీకుడు దుశ్శాసనుడిని, సాత్యకి కృతవర్మను, ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను, ఉపపాడవులు శిఖండి కలిసి మిగిలిన ధృతరాష్ట్ర పుత్రులను ఎదుర్కొంటారు. నేను కృపాచార్యుడిని ఎదుర్కొంటాను " అన్నాడు. కాని ఆ రోజు యుద్ధము ధర్మరాజు చెప్పినట్లు జరుగ లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తలపడ్డారు. అర్జునుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మరొక పక్క సంశక్తులు అర్జునుడిని ఎదుర్కొన్నరు. అర్జునుడు కర్ణుడిని వదిలి సంశక్తులను ఊచకోత కోస్తున్నాడు. సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణములతో సంశక్తులను చీల్చి చెండాడాడు. కృపాచార్యుడు, కృతవర్మ, సౌబలుడు పాండవులతో పోరుతున్నారు. రక్తం కాలువలు కడుతూ ఉంది. రథములు విరుగుతున్నాయి. గజములు, హయములు చస్తున్నాయి. పదాతిదళముల కళేబరములతో రణభూమి నిండి పోయింది. సుయోధనుడు కర్ణుడికి సాయం వెళ్ళాడు. కర్ణుడు పాంచాల సేనను ఎదుర్కొన్నాడు. పాంచాల సేనకు దీటుగా ఛేది సేన వచ్చి చేరింది. కర్ణుడు వారిని తరిమి తరిమి స్వర్గ ప్రాప్తి కలిగిస్తున్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి