షష్టిపూర్తి: - వరలక్ష్మి యనమండ్ర
 

నూరేళ్ల మానవ జీవితంలో జన్మించటమే  ఒక విశేషం.  అయితే 60,70,80,85,100  సంవత్సరాల తర్వాత ఒక ఉత్సవం చేసుకోవడం ఇంకా విశిష్టమైన ఘట్టం.

 60 సంవత్సరాల ఉత్సవం షష్ట్యబ్ది పూర్తి, 70 సంవత్సరాలు పూర్తి ఐతే భీమరథ శాంతి, 80 సంవత్సరాల పూర్తి ఉత్సవం శతాభిషేకం, 80-83 సంవత్సరాల పూర్తి ఐతే సహస్ర చంద్రోదయం, 100 సంవత్సరాలు పూర్తి ఐతే శత వార్షికోత్సవం అనీ అంటారు.
ఇప్పుడు మనం 60 సంవత్సరాల పూర్తి ఉత్సవం గురించి వివరించుకుందాం. 
ఒక వ్యక్తి తన జీవితం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసుకునే పండుగని "షష్యబ్ది పూర్తి" లేదా "ఉగ్రరథ శాంతి" అంటారు. 
దంపతులలో  భర్తకి 60 సంవత్సరాలు నిండిన తరువాత చేసే ఉత్సవం పేరే షష్యబ్ధి పూర్తి. అదే షష్టిపూర్తి అని వ్యావహారికం.
ఈ పండుగ వైభవోపేతంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం మానవుల పరిపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు. అందువలన సగం జీవితం విజయవంతంగా గడిపినందుకుగాను, మిగిలిన సగ జీవితాన్ని సంతోషంగా కొనసాగించేందుకు ఉద్దేశింపబడినది ఈ పండుగ. పూజలు హోమాల ద్వారా దైవ బలాన్ని పెంచుకుంటారు. ఇది బంధుమిత్రుల సమక్షంలో, శుభాకాంక్షలు అభినందనలు శుభాశీస్సులు మధ్య జరుగుతుంది. 
ప్రభవ మొదలుగా తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ఒక ఆవృత్తి కాలం పూర్తి అవడానికి 60 సంవత్సరములు పడుతుంది. జీవితంలో మరొక ఆవృతి ప్రారంభమవుతున్న శుభ సందర్భంలో ఈ షష్టిపూర్తి ఉత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటారు. 
గడిపిన 60 సంవత్సరాల జీవిత కాలాన్ని సింహావలోకనం చేసుకొని వచ్చే 60 సంవత్సరాలు కాలాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకునుటకు శుభ తరుణం ఇది. 
స్కాంధపురాణంలో షష్టిపూర్తి వ్రతాన్ని మానవులు దీర్ఘాయుష్షును, సంపదలను కోరి 60 ఏళ్లు పూర్తయిన తర్వాత ఆచరించవలెనని వ్యాసమహర్షి తెలియజేశారు. 
ఈ వ్రతమును నూరు అశ్వమేధములు ఆచరించిన నహుషుని కుమారుడైన యయాతి తన మామ శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు ఆచరించినట్లుగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. 
వ్యాసమహర్షి వైశంపాయనుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 60 సంవత్సరములు రాగానే శ్రద్ధ, భక్తులతో ,వేద వేదాంగములు తెలిసిన బ్రాహ్మణులను సంప్రదించి శుభముహూర్తంలో షష్టిపూర్తి నిర్వహించుకొనవలెను అని చెప్పారు.
బోధాయయన మహర్షి కూడా "పండిత పరిష్కారము" నందు మానవునికి 60 సంవత్సరాలు నిండగానే అతని జన్మ తిథి యందు షష్టిపూర్తి వేడుకలు జరుపవలెను అని వివరించెను.‌
అంటే మానవుడు తాను జన్మించిన సంవత్సరం, మాసం, నక్షత్రం, తిధి మొదలైన వాటిని సరిచూసుకొని ఉగ్రరథ శాంతిని దేవాలయాలలో కానీ, నదితీరంలో కానీ, స్వగృహంలో కానీ ,ప్రస్తుతం కళ్యాణ మండపాలలో కానీ నిర్వహించుకొనవచ్చును. 
60 సంవత్సరములకు ఒకసారి గ్రహాలు కూడా యధాస్థానానికి వస్తాయని ప్రాచీనుల నమ్మకం. అందువలన కూడా ఈ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తున్నది. 
ఈ వేడుకలో 60 ఏళ్లు నిండిన దంపతులకు వారి సంతానం మరల వివాహ వేడుక జరిపిస్తారు. ఇది రెండు రోజులు జరిగే కార్యక్రమం. దీనివలన ఈ కుటుంబంతో సంబంధం కలిగిన బంధు మిత్రులందరూ ఒకచోట కలిసి మధురానుభూతులను ఒకరికొకరు పంచుకొనుట ఒక విశేషం.
పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాధాన్యము, కలశస్థాపనం, మహాగణపతి హోమము, నవగ్రహ ఆరాధన,‌ఆయుష్య హోమము, మృత్యుంజయ హోమము మొదలయినవి చేస్తారు.
ఈ సందర్భంగా గోదానం,భూదానం,హిరణ్యదానం,‌రజత దానం, లవణదానం, అన్నదానం, ఘృతదానం, గుడదానం, వస్త్ర దానం, ఉదకదానం మొదలుగా దశ దానములను శాస్త్రోక్తంగా పండితులు చేయిస్తారు. 
వేడుకల అనంతరం శ్రేష్ఠ బ్రాహ్మణులకు భూరి దానములను ఇచ్చి సత్కరిస్తారు. 
అందరూ దంపతులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతారు.

కామెంట్‌లు