సామెత -346; ఇనుము,తీట(దురద),పేము( బెత్తం )పట్టిన చెయ్యి ఊకుండవు
**
"అవ్వా! అవ్వా! గా బుచ్చిగాడు సూడు ఏం చేత్తుండో...నిన్న సద్వకుంటుంటే నా వయ్యిలు కాయితాలు శింపి పడవలు జేసిండు.వొద్దురా యిన్నే యిన్లే. నువ్వేమో గాన్ని గావురం జేత్తున్నవ్.ఇంగ గిప్పుడు సూద్దు రా గాడు నాన్న గీ నడ్మల పట్టుకొచ్చిన కొత్త పరుపు పర్ర పర్ర కత్తితో కోశి గందుల దూదంత ఇంటినిండ పడ్డదవ్వా!"
" ఓష్నీ!బుచ్చిగాడు గంత పని జేశిండా?అసలానికి కత్తెవర్రా ఇచ్చింది?"
అవ్వా! గాడు నేను శెండాట ఆడుకుంటుంటే శెండు శెంగున ఎగుర్కుంట ఇన్ప సామాన్ల అర్రల వడింది.గదెతుకుతుంటె గా బుచ్చిగానికి తల్పు మూలనున్న పెద్ద ఇనుప కత్తి దొరికింది.ఇంగ జూస్కో నేనే రావనున్ని రండిరా ఎవలొత్తరో సూత్త అన్కుంట కత్తి గిర్ర గిర్ర తిప్పుకుంట వొచ్చి కస్స కస్స పొడిశిండవ్వా?"
"గట్ల జేత్తుంటే ఎడ్డెమొకాలేస్కుంట సూశినారు?యింగ నయ్యం. గాడు మిమ్మల్ని పొడవలే, గింతకీ ఏడున్నడ్రా గాడు బుడ్డోడా? "
గాడు బంతొద్దు.గీ కత్తే మంచిగుంది.దీంతోనే ఆడ్త అన్కుంట పట్కొని తిరుగుతుండవ్వా!'*
'వొద్దురా అయ్యా అంటే మీ నాయిన యిన్నడా? ఆరం దినాలు తాతీల్లు మన బుడ్డోడు,భూలచ్మి గాడు ముగ్గురు కల్శి సక్కగ ఆడుకుంటరని తోల్కొచ్చిన అన్నడు" .గాని అమ్మ సుత పోన్ల 'మావోడు శితిని పోరడు జాగర్త'అని శెప్పింది."
"అవునవ్వా! మస్తు"శితిని పోరడు" బుడ్డోడి దోత్తుగాడు శీనుగాడొత్తే గానికి ఓ బెత్తం బట్కొచ్చి ఇచ్చి గది కట్టె అన్కో.నేనేమో కత్తి యుద్ధం చేత్త, నువ్వు కట్టెతో యుద్ధం జెయ్యి అన్కుంట గానితో ఆడ్తుండవ్వా .గదే నీకు శెప్దామని వొచ్చిన."
"వామ్మో! గీడు లేనిపోని పంచాతి యింటి మీదికి తెత్తడట్టుంది ఎట్లరో నాయనో!"
"వొరేయ్ బుచ్చిగా! ఇట్రారా నాయినా! గా కత్తి అసలే శిలుం బట్టి వుంది.గది కోస్కుంటే వాతం రోగం వొత్తదిరా అయ్యా!"
"అవ్వా! నేను గాని మీద షికాయితి శెప్పినన్నని కచ్చె బట్టి గాడేదో ఆకు తెచ్చి వొంటిమీద రాశిండవ్వా! మస్తు గోకుడు బెడ్తున్నది. ఏడ్సుకుంట వొత్తున్న బుడ్డోడిని సూశి గానికి గీ దూలగొండి ఆకు యేడ దొర్కిందిరా అయ్యా?"
"అవ్వా! గాడు తుంబిష్కల్ని పడ్దామని గా తొవ్వపక్కకి తోల్కపొయ్యి గోంగూర గోంగూర అన్కుంట పిలాస్టిక్ సంచి శేతికి తొడుక్కొని పట్కొచ్చి ఓ తాన దాశిండు. గట్లెందుకు శేత్తున్నవ్.ఇంకింత కోస్కపొయ్యి అవ్వకిద్దామంటే గీ ఆటలన్ని అయినంక ఆటెంక యిద్దామన్నడవ్వా!"
వామ్మో! గాని శెకలన్ని గదేదో శాత్రం లెక్కనే వున్నయి గద! ఒరేయ్ బుడ్డోడా! దా! ఇగ్గో గీ కలబందాకు రసం రాత్తరా!"
"వామ్మో! గదేదో తెల్లగుంది నేను రాస్కోను. నన్ను దవాఖానాకి తోల్కపోవే అవ్వా!" వల్లవల్ల ఏడుత్తున్న బుడ్డోడిని సూశి..."
'గిది దానికి యిరుగుడురా రారా అయ్యా ?గిది రాత్తే తగ్గుతది"
అవ్వ రాత్తుంటే పక్కన కూసోని భూలచ్మి "అవ్వా! అవ్వా ! గదేదో శాత్రమన్నవ్ శెప్పవా?"
గదా" ఇనుము, తీట పేము పట్టిన శెయ్యి ఊకుండవు" అంటరు గీ మూడు ఒక్కపాలె సూపెట్టిండు గీ బుచ్చి బడివెగాడు. గీన్ని యియ్యాల మీ నాయినతో పంపిత్త. ఒక్క దినంలనే గాని లొల్లికి గీ గల్లీ అంత ఏకమైంది.గాన్ని పంపాలె" ..."
"ఒరేయ్ బుచ్చిగా! ఇట్రార" అని పిల్శి ఈ శెంప ఆ శెంప పల్ల పల్ల వాయిచ్చి "ఇంకోపాలి గస్మంటి పనులు సేశినవో కత్తి పట్కొని ముక్కు కోత్త, బెత్తం బట్కొని ఈపు యిమానం మోత మోయిత్త,గా దూలగొండి ఆకు దెచ్చి నీ పెయ్యంత రాత్త.అప్పుడు గని నీ శితిని శకలు పోవు. మంచిగ ఆరం దినాలు తాతీల్లని మావయ్య తోల్కొత్తె గిస్మంటి పనులు శేత్తావ్ బిడ్డా!" అంటుంటే..."
"వామ్మో! వాయ్యో! అన్కుంట గజ్జున వొణుక్కుంట గండమోర్లు పెట్టుకుంటూ ఏడుత్తుంటే అవ్వ తెత్తిన కత్తి,కట్టె సూశి నోరు గట్టిగ మూస్కుండు గా బుచ్చిగాడు."
కొడుకుతో పంపుకుంట బుచ్చి గాడితో" అక్కడ సుత గిస్మంటియి సేశినవని తెలిత్తే ఏం జేత్తనో తెల్సుగా! "అని బెదిరిచ్చి పంపింది."
గదండీ సంగతి! "ఇనుము తీట/ దురద,పేము(బెత్తం) పట్టిన చెయ్యి ఊకుండవు అంటే గిదే మరి. గస్మంటి శెడ్డ అలవవాట్లు బుద్దులు ఉన్నోళ్ళు ఉన్న సోట ఉండకుండ శెడ్డపనులు శేత్తనే ఉంటరని శెప్పడానికి, గవి శేతుల్లో ఉంటే సుత గస్మంటి పాడు బుద్దులు పుడ్తయని శెప్పడానికి గీ శాస్త్రం సుబూది జేసి శెప్తుందన్న మాట."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి