సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము: 379 వ రోజు


కర్ణుడు శల్యుని మీద ఆగ్రహించుట
శల్యుడి మాటలకు కర్ణుడి ఆగ్రహం హద్దులు దాటింది. " శల్యా ! ఆపు నీ అధిక ప్రసంగం. గుణవంతుడి నైన నా వంటి వాడి గుణాలు గుణహీనుడవైన నీకేం తెలుసు. అర్జునుడి గురించి నాకు తెలిసినంతగా నీకేం తెలుసు. నాకు క్రిష్ణార్జునుల బలాబలములు తెలుసు కనుకనే నేను వారిని సంహరిస్తానని నమ్ముతున్నాను. నా చేత నిత్యమూ పూజలందుకుంటున్న సర్పముఖాస్త్రము నుండి తప్పించు కొనుటకు కృష్ణార్జునులే కాదు మరెవ్వరికీ సాధ్యము కాదు. అది తప్పితే భార్గవాస్త్రముతో చంపుతాను. కనుక అర్జునుడికి నా చేత చావు తధ్యము. కృష్ణార్జునుల కపిధ్వజము, గాండీవము నన్ను భయపెట్ట లేవు. వెయ్యి మంది కృష్ణులు పది వేల మంది అర్జునులూ వచ్చినా బెదరక పోరాడగలను పాండవపక్షపాతముతో నోటికి వచ్చినట్లు మాట్లాడక రథము పోనిమ్ము ఇంకా ఇలా మాటాడుతూ ఉంటే నీ ప్రాణములు నీ చెంత ఉండవు " అన్నాడు కర్ణుడు. శల్యుడు ఎదో మాట్లాడబోయే సమయంలో " శల్యా ! ఆగు నీవు నీచుడివి, పాపాత్ముడవు, క్షత్రియాధముడవు నీకు దుర్భుద్ధి కాక సద్బుద్ధి ఎలా ఉంటుంది. మీ మద్రదేశం వాళ్ళంతా దుష్టులు, దుర్మార్గులు, మిత్రద్రోహులు. నీకూ ఆ గుణుముల లేకుండా ఉంటాయా ! మీ దేశం వాళ్ళంతా వావి వరసలు లేకుండా ఆడామగా కలుస్తారట కదా ! అది మీకు తప్పు కాదట. పుట్టిన శిశువులకు తల్లి పాలకంటే ముందే మద్యం సేవించే మీకు ఉత్తమ గుణములు ఎలా వస్తాయి. నిత్యమూ మద్యపాన మత్తులో వావివరసలు లేక తిరుగుతూ ఎవరు ఎవరికి పుట్టారో కూడా తెలియని మీకు గుణము, శీలము గురించి ఎలా తెలుస్తుంది. నీవు శత్రుపక్షం మేలు కోరే వాడివని నాకు తెలియదా ! యుద్ధమున శత్రువులను తనుమాడి వీర మరణం చెందినా చెందుతాను గాని యుద్ధము చేయుటకు వెనుకాడను. నాకు ఇంకా కోపం తెప్పిస్తే ఈ గధతో నీ తల బద్దలు కొడతాను. రథమును పోనిమ్ము " అన్నాడు.
శల్యుడు కర్ణుని సమాధానపరచుట
శల్యుడు " అదేమిటి కర్ణా ! అలా అంటావు ఉన్న మాట చెప్పడంలో తప్పేమిటి. సుయోధనుడికి సాయం చేయ వచ్చాను కనుక అతడికి అతడి మిత్రుడవైన నీకు నాకు తోచిన హితవు చెబుతున్నాను. సారధి అంటే ఏమిటి ? అశ్వముల బలము, రధికుని బలము, రధికుని పరిస్థితి తెలిసి మెలగాలి. సమయస్పూర్తితో రధికుని కాపాడుతుండాలి. ఆయుధప్రయోగము, యుద్ధములో మెళుకువలు తెలిసి ఉండాలి. అన్నీ తెలిసిన నేను నీ హితవు కోరి నాకు తోచిన మాటలు చెప్పడంలో తప్పేమిటి. నీకు కోపం వచ్చినా సారధిగా చెప్పడం నా ధర్మము, నీతి. నేనేం తప్పు చేసానని నా తల బద్దలు కొడతావు. నీవు ఎన్ని చెప్పినా నీ శ్రేయోభిలాషిగా నీకు హితవు చేయక మానను. నీకు ఒక దృష్టాంతం చెప్తాను విను . అది విని నీవు నేను చెప్పినట్లు చేయక పోయినా నాకు బాధ లేదు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు