దేవుడి రాజ్యం..!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.


గమనించేందుకు సీసీ కెమెరాలు లేవు- వాచ్మెన్ లేడు -
శిక్షించేందుకు పైన ఎవడు లేడూ. దేవుడు లేడు.
పాపపుణ్యాలు స్వర్గ నరకాలు లేవు 
ఎవడికి దొరికింది వాడు దోచుకుంటాడు 
ఎవడి చేతివాటం వానిది. ఎవడి మోసం వానిది. 
ఎవడెంత మోసం చేస్తే అంత సంపాదిస్తాడు. 

కర్మ ఫలము లేదు కష్టఫలము లేదు 
మోసపోయినోడు మోసపోతాడు 
చేతినిండా సంపాదించేవాడు సంపాదిస్తాడు. 
నీతి నిజాయితీ కాదు ఎంత బలం ఉంటే అంత సంపాదన. 
వ్యాపారము కాదు దోపిడీ దొంగతనమే జాతి లక్షణం. 

ఎవడి చేతిలో గుత్ప ఉంటే వాడిదే రాజ్యం 
ఎవడు బలవంతుడో వాడే రాజు. 
ఎవడి కర్మ వాడిది కాదు. ఎవడి కష్టం ఎంతో -అంత సుఖం కాదు. 
ఎంత కష్టపడితే అంత సంపాదన కాదు. 
ఎంత తెలివి ఉంటే అంత మోసం చేస్తాడు 
ఎంత తెలివి తక్కువ తనం ఉంటే అంత మోసపోతాడు. 

దీన్ని సరి చేసేందుకు రాజు గాని రాజ్యాంగం గాని 
చట్టంగానీలేదు. 
ఇది దేవుడి రాజ్యం. 
ఇక్కడ ఎవడికి వాడే రాజు. ఎవడికి వాడే దేవుడు. 
ఒక్క మరణం తప్ప  ఎవరిని ఏమీ చేయలేం .అంతా మామూలే. 
మరణం ఎప్పటికైనా తప్పదు దాని భయమూ లేదు. 

నేరం చేసిన వాడికి  కఠిన శిక్ష వేసేందుకు చట్టము లేదు 
ఇక్కడ న్యాయము అన్యాయము భయము ఒక బ్రాంతి 
ఇక్కడ మగువ మత్తు కు చాలా భవిష్యత్తు ఉంది 
ఇక్కడ చదువు ఒక చిత్తు కాగితం. ఇది దేవుడి రాజ్యం. 
డబ్బే ఇక్కడ దేవుడు .అన్యాయమే ఇక్కడ న్యాయం. 
=====================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు