ఉపాధ్యాయుల సేవలను, విద్యా రంగంలో వారి విశిష్ట కృషిని గుర్తిస్తూ నిర్వహించిన “Symposium on World Peace: Role of Teachers” కార్యక్రమంలో డాక్టర్ అడిగొప్పుల సదయ్యకు “జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” లభించింది.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్, రెస్టొరేషన్ ఆఫ్ లైట్ (HWPL), ఇంటర్నేషనల్ పీస్ యూత్ గ్రూప్ (IPYG), నవభారత్ నిర్మాణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఈ సింపోజియం నిర్వహించారు.
“ప్రపంచ శాంతి – ఉపాధ్యాయుల పాత్ర” అనే ప్రధాన అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో విద్య, శాంతి, మానవతా విలువలు, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ అడిగొప్పుల సదయ్యను జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ ఆర్. కృష్ణయ్య, ఎంపీ హాజరుకాగా, దీపప్రజ్వలన కార్యక్రమాన్ని శ్రీ అమ్రత్ కుమార్ జైన్, సామాజిక కార్యకర్త నిర్వహించారు. గౌరవ అతిథులుగా డా. దుంపేటి అనిత, శ్రీ సామ్ కిమ్(HWPL కొరియా దేశం), శ్రీ వెంకట్ మాథంగి, శ్రీ అశోక్ హిరావత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి శ్రీ ఎస్. రవి కుమార్, అధ్యక్షులు, నవభారత్ నిర్మాణ సంఘం, హైదరాబాద్, అధ్యక్షత వహించారు.
గౌరవ అతిథుల చేతుల మీదుగా డాక్టర్ అడిగొప్పుల సదయ్య జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను అభినందిస్తూ, విద్యార్థుల్లో జ్ఞానం, విలువలు, మానవత్వం, శాంతి భావాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఈ జాతీయ స్థాయి గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని డాక్టర్ అడిగొప్పుల సదయ్య పేర్కొన్నారు.
“ఉపాధ్యాయుడు ఒక తరాన్ని మాత్రమే కాదు… భవిష్యత్ సమాజాన్ని నిర్మించే శిల్పి” అనే సందేశంతో సాగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ అడిగొప్పుల సదయ్యకు లభించిన జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి