కానివారు కారు కనికరమ్ము చూప
కారు పంట తీయు కర్షకుని కృషియోలె
కారు కారుకు అక్షర విత్తనంబే చల్లి
కారుణ్య పంటను కనకమోలె తీయు
కార్య దీక్షాదక్ష దయాశీలురు వారు
కమనీయ సమభావ కృషివరేణ్యులు వీరు.
కలత నలత లేక కలనేత విద్యను
అంది ఇచ్చేటి జ్ఞానకుబేరులే వీరు
అంది వచ్చిన ప్రతి అవకాశమందించి
అందలమెక్కించ శిష్యున్ని నడిపించు
నవనీత హృదయులు.నవనవోన్మేషులు
నీరజాభవుడైన బ్రహ్మతో సమానులు
బ్రహ్మమే తామయ్యి బ్రహ్మాండంబునే తెలుప
భ్రమర సుధాపాన సమ సమానముగ
సృష్టి విద్యలకెల్ల తాము విద్యార్థులై
విజ్ఞాన సుధలను విద్యార్థికందించు
వికసిత సుమ సమాన విజ్ఞాన దీప్తులు
విద్యకే జిలుగులు.విద్యాధినేతలు
విపంచికే తెలియు తలరాతలనైన
తరతరాల జలతారు చేసెడి
అక్షర బ్రహ్మలు.అపరమేధావులు
అజ్ఞానమే తుంచి విజ్ఞానమే పెంచు
విజ్ఞాన జ్యోతులు.విద్యాధరి పుత్రులు
పుత్ర పుత్రికా వాత్సల్య ప్రేమానురక్తులు
పంచ భూతాలనైన,పంచమ వేదాన్నైనా
పంచ వన్నెలొలుకు పచ్చని భవితకు
పచ్చని పంటగనిచ్చు పరమ పవిత్రులు
పరమ దయా గురువులు-జగతికే వెలుగులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి