కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము: 380 వ రోజు
కాకి హంసల కథ
ఒక దీవిలో ధర్మవర్తనుడైన ఒక వైశ్యుడున్నాడు. అతడు యజ్ఞ యాగాదులు చేసిన సత్కర్ముడు. కరుణా మూర్తి, దాన శీలుడు, శాంతి వంతుడు ఉత్తముడు. అతడు ధనధాన్యములతో శోభిల్లుతున్నాడు. అతడికి అనేక మంది సంతానము ఉన్నారు. వారి ఇంటికి ఒక కాకి వచ్చింది. అతడి కుమారులు ఆ కాకికి తాము తినగా మిగిలిన అన్నము పెట్టి పెంచసాగారు. వారు పెట్టిన ఆహారము తిని బలిసిన ఆ కాకి మిగిలిన పక్షులను నిర్లక్ష్యము చేయసాగింది. కొంత కాలానికి ఆ దీవికి కొన్ని హంసలు వచ్చాయి. అవి చాలా పెద్దవి. వైశ్యకుమారులు కాకిని చూసి " ఓ కాకీ ! ఆ హంసలు చూడు ఆకాశంలో ఎంత అందంగా విహరిస్తున్నాయో. నీవు కూడా అలా విహరించి వాటిని ఓడించాలి " అన్నారు. మూర్ఖులైన వారి మాటలు విని ఆ కాకి హంసలను " నాతో సమానంగా ఎగురగల వారు మీలో ఎవరైనా ఉన్నారా ! " అన్నది. ఆ హంసలు " ఓ కాకి ! మేము మానసరోవరంలో విహరించే హంసలము. మాకు ఎంత దూరం ఎగిరినా అలుపుండదు. నీవేమో మాలో బలవంతులెవరని అడుగు తున్నావు. అసలు కాకులు ఎక్కడైనా హంసలతో సమానంగా ఎగురగలవా " అన్నాయి. కాకి " నేను నూటొక్క రీతుల ఎగురగలను. శతయోజనముల దూరము పోగలను. భూమి నుండి నేరుగా ఆకాశంలోకి ఎగిరి భూమి మీదకు రాగలను. నేను ఎలాంటి హంసనైనా ఓడించగలను " అన్నది. వాటిలో ఒక హంస ముందుకు వచ్చి " నీవు చిత్ర విచిత్ర రీతుల ఎగురగలవా ! అయితే నాతో సమానంగా ఎగురు " అన్నది. అక్కడ ఉన్న మిగిలిన కాకులు వద్దు నీవు హంసతో సమానంగా ఎగుర లేవు " అన్నా వినక ఆ కాకి హంసతో పోటీ పడింది. హంస మెల్లగా ముందుకు పోసాగింది. కాకి వేగంగా ముందుకు వెళ్ళి హంసను దాటి ముందుకు వెళ్ళి తిరిగి హంస వద్దకు వచ్చి " నీవు ఇంకా ఇక్కడే ఉన్నావా " అని చెప్పి ముందుకు సాగింది. ఇది చూసిన కాకులు హంసను గేలి చేసాయి. కొంత సమయానికి కాకికి ఆయాసం వచ్చింది. కాని హంస అలుపెరుగక ముందుకు సాగింది. కాకి హంసతో పోటీ పడ లేక వెనుకబడి " అయ్యో ! అనవసరంగా హంసతో పోటీ పడ్డానే ఎక్కడ దిగుదామన్నా నేల కానరాలేదు. కింద పడ్డానంటే జలచరాలు తినేస్తాయి " అని దిగులుగా ఎగర సాగింది. ఆ కాకిని చూసిన హంస ఇది ఏరకమైన విన్యాసము? నా కంటే వెనుక బడ్డావు ఎందుకు అన్నది. ఎగరడానికి బలం చాలక అంతకంతకు కిందకు పోతూ ఆ కాకి " వైశ్యకుమారులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని కొవ్వెక్కి నాకంటే బల వంతులు లేరని గర్వించాను. గరుత్మంతుని కూడా గెలువగలనని తలిచాను. ఇప్పుడు నా బలమేమిటో తెలిసింది. దయ చేసి నన్ను తీసుకు వెళ్ళి మిగిలిన కాకులతో చేర్చు " అని వేడుకుంది. హంస నీటిలో మునుగబోతున్న కాకిని తన కాళ్ళతో పట్టుకుని ఒడ్డుకు చేర్చింది. " ఇటువంటి తెలివి తక్కువ పని ఇక ఎప్పుడూ చేయకు " అని మిగిలిన కాకులు మందలించాయి .
శల్యుడు కర్ణుడిని హేళన చేయుట
కాకి హంసల కథ చెప్పిన శల్యుడు " కర్ణా ! కాకి కథ విన్నావు కదా ! వైశ్యకుమారులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని కాకి గర్వించినట్లు నీవు కూడా కురు కుమారులు పెట్టిన మృష్టాన్నములు తిని గర్వించి హంసతో పోటీ పడిన కాకిలా నీకంటే బలవంతుడైన అర్జునుడిని గెలవగలనని ప్రగల్భములు చెప్తున్నావు. దీని వలన హాని నీకే ఉత్తర గోగ్రహణ సమయాన నీ ముందే నీ తమ్ముని సంహరించి గోవులను మరలించినపుడు నీవేమైనావు? ఘోషయాత్ర సమయాన సుయోధనుడిని వదిలి ఎందుకు పారిపోయావు ? నాడు నిండు సభలో కృషార్జునుల భుజబలం గురించి మహర్షులు చెప్ప లేదా ! ఆ మాటలు విని కూడా నీవు అర్జునుడితో తలపడటానికి సాహసిస్తున్నావు. అర్జునుడితో ఆ పరమశివుడు కూడా పోటీ పడలేడు. కనుక నీకు తగిన వీరులతో పోటీపడుట మంచిది. నీ మంచి కోరి ఇది చెప్తున్నాను " శల్యుడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి