బషీరాబాద్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు: వెంకట్ , మొలక ప్రతినిధి
 ఈడికి విజయ అంకితకు ఘన సన్మానం



మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో చదువుకొని కష్టపడి పాఠశాల నుండి మొట్టమొదటి ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని విజయ అంకితను శ్రీ రామకృష్ణ సేవా సమితి, బాలల మాసపత్రిక మొలక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన  శ్రీనివాస్ గౌడ్  రాధిక దంపతుల కుమార్తె విజయ అంకిత. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తాండూరు పట్టణంలోని తులసీదాస్ బి.ఎడ్. కళాశాలలో కొనసాగుతున్న బషీరాబాద్ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించింది. పదో తరగతిలో 9.2 జీపీఏ సాధించింది.
అనంతరం అదే గురుకులంలో ఇంటర్మీడియట్ బైపీసీ చదివి 988 మార్కులు సాధించింది. ఉన్నత లక్ష్యంతో కష్టపడి చదివిన విజయ అంకిత మెడికల్ ప్రవేశాల్లో 3730 స్టేట్ ర్యాంక్ సాధించి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది.
ఈ విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా సమితి, బాలల మాసపత్రిక మొలక ప్రతినిధులు గురుకుల పాఠశాలకు వెళ్లి విజయ అంకితను అభినందించి సన్మానించారు. తల్లిదండ్రుల ఆశయం, గురువుల మార్గదర్శకత్వం, విద్యార్థిని కృషి ఫలించి ఆమె వైద్య విద్యలో అడుగుపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ, సోషల్ వర్కర్, ప్రోగ్రాం కన్వీనర్ కేవీఎం వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందన్నారు. వారిని ప్రోత్సహించి సరైన మార్గదర్శకత్వం అందిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని అన్నారు.
తండ్రిని కోల్పోయిన విజయ అంకితను కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తూ ఆమె విద్యకు అండగా నిలిచిన రాఘవేందర్ గౌడ్ దంపతులను కూడా సమితి సభ్యులు అభినందించారు.
కార్యక్రమంలో ప్రభు శంకర్, సురేష్, ప్రిన్సిపల్, శివగీత, ఉపాధ్యాయులు శ్రీవాణి, రూపారాణి, సృజనాదేవి, కళావతి, సరస్వతి, పింకీ బాయి, స్వర్ణలత, సువర్ణ, జ్యోతి, వెంకటలక్ష్మి, అరుణ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు