సుప్రభాత కవిత : - బృంద


అన్నీ మరచి హాయిగా 
ముందుకు సాగాలనుకుని 
ఏమీ తెలియనట్టు 
అడుగులు వేయాలనుకున్నా....

లేనిపోని సాకులు చెప్పి 
అడుగులోని పొరలనుండీ 
అదేపనిగా బయటకు వచ్చి 
అలజడిగా మార్చేస్తావెందుకు?

రాయిలాగా మారి 
గాయాలు మరచి 
హాయిగా  ఉండాలనుకుంటే 
గుండె గుచ్చేలా గుర్తుకొస్తావెందుకు?

తెల్లగా మనసు మార్చి 
మెల్లగా అనునయించి 
నల్లని చీకటి దాటాలనుకుంటే 
చల్లగా బాణంలా గుచ్చుకుంటావేందుకు?

పెదవంచున చిన్ని నవ్వు 
మొలిచే వేళ 
తలుపులు వేసిన 
మదిముంగిట  నిలిచి 
తలపుల జడిలో తడిపే 
మాయని జ్ఞాపకమా......

వెతలను తరిమేసి 
వేదన మరపించి 
వేడుకలాగా వచ్చే 
వేకువలా తోడవవా....

🌸🌸సుప్రభాతం 🌸🌸

 
కామెంట్‌లు