మంచి పని!; - సరికొండ శ్రీనివాసరాజు
 

వాసు రెండు రోజులుగా పాఠశాలకు రావడం లేదు. పాఠశాలకు ఎప్పుడు గైర్హాజరు కాకుండా క్రమం తప్పకుండా వచ్చే వాసు, రెండు రోజులపాటు పాఠశాలకి రాకపోవడం ఉపాధ్యాయులకు ఆశ్చర్యం కలిగించింది. అదే తరగతిలో రంగ చదువురాని విద్యార్థి. ఎప్పుడో క్రికెట్ ఆటలతోనే కాలక్షేపం చేస్తూ చదువును పూర్తిగా పక్కన పెట్టాడు. తెలివైన విద్యార్థి వాసు పట్ల రంగకు ఈర్ష్యాభావం. 

       రంగ క్లాస్ టీచర్ వద్దకు వెళ్లి, వాసు రెండు రోజులుగా పాఠశాలకు రాకుండా, ఇల్లిల్లూ తిరుగుతూ గణేశ్ చందాలు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. వాసు దొంగ అని, గణేశ్ చందాల పేరుతో అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తాడని రంగ ఫిర్యాదు చేశాడు. వాసు వచ్చిన తర్వాత అతని పని చెప్తా అని, క్లాస్ టీచర్ చెప్పాడు. రంగ ఆనందం అంతా ఇంతా కాదు. రంగ తన చెడ్డ సహవాసగాళ్లతో వాసుకి శిక్ష ఖాయం అని చెప్పాడు.

       మరునాడు వాసు పాఠశాలకు వచ్చాడు. క్లాస్ టీచర్ వాసును రెండు రోజులుగా పాఠశాలకు ఎందుకు రావడం లేదని అడిగాడు. "గురువుగారూ! వినాయక చవితి రోజు చాలామంది గొప్పల కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన  విగ్రహాలను కొంటున్నారు. అవి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల, చెరువు నీళ్లు కలుషితం అవుతున్నాయి. చెరువులోని జీవులకు, మనకు అనేక వ్యాధులను తెచ్చి పెడుతున్నాయి. అందుకే నేను, నా మిత్రుడు రాము మరి కొంతమందిమి కలిసి అనేక మట్టి గణపతులను తయారు చేశాము. మా ప్రాంతంలోని చాలా ఇళ్లకు పంచిపెట్టాము. ఈ మట్టి గణపతులనే ఉపయోగిస్తామని వారి చేత మాట తీసుకున్నాము." అని చెప్పాడు వాసు. ఉపాధ్యాయుడు వాసును మెచ్చుకున్నాడు. మిగతా వారికి కూడా ఈ ఆలోచన వస్తే ఎంత బాగుంటుంది అన్నాడు. "ఒరేయ్ రంగ! ఎప్పుడూ ఆ దిక్కుమాలిన ఆటలతో కాలక్షేపం చేసే బదులు ఇలాంటి మంచి పనులు చేయవచ్చు కదా!" అని నిలదీశాడు. "వాడికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి మాస్టారూ! ఎప్పుడూ బాగుపడుతున్న వారి మీద కుళ్ళుకొని వారి మీద  లేనిపోని నిందలు వేయడం వీడికి అలవాటే కదా!" అన్నది శ్రుతి. రంగ ముఖం మాడ్చుకున్నాడు.
కామెంట్‌లు