సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము:-383 వ రోజు


కర్ణుడి విజృంభణ
తరువాత కర్ణుడు ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మరొక పక్క ప్రభద్రకులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు ఏడు బాణములతో ప్రభద్రకులను ఎదుర్కొన్నాడు. అది చూసి పాంచాలురు మహా కోపంతో కర్ణుడి మీదకు వచ్చారు. కర్ణుడు ఇరవై అయిదు బాణములతో ఇరవై అయిదు పాంచాలురను వధించాడు. తరువాత భానుదేవుడు, సేనాబిందు, చిత్రసేనుడు, తపనుడు, శూరసేనుడు అను అయిదుగురు పాంచాలురు కర్ణుడిని ఎదుర్కొనగా కర్ణుడు అయిదు బాణములతో వారిని వధించాడు. కర్ణుడి వెంట అతడి కుమారుడు సుషేణుడు, వృషసేనుడు, సత్యసేనుడు వస్తున్నారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు, శిఖండి, భీముడు, జనమేజయుడు, సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు, కేకయ, మత్స్య యోధులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. వారంతా కర్ణుడి మీద అతడి కుమారుల మీద బాణములు గుప్పించారు.
భీమసేనుడు
అది చూసి సుయోధనుడు, దుశ్శాసనుడు, వారి కుమారులు, గజసైన్యముతో వచ్చి భీముని ఎదుర్కొని సుయోధనుడు అతడి మీద శరవర్షం కురిపించాడు. భీముడు వాటిని చిన్నా భిన్నం చేసి సుయోధనుడి మీద పదునైన బాణములు ప్రయోగించాడు. వాటి ధాటికి సుయోధనుడు అతడి సైన్యము నిలువలేక పోయింది. భీముని ధాటకి గజములు కూలుతున్నాయి. హయములు ప్రాణములు కోల్పోతున్నాయి. అప్పుడు కృపాచార్యుడు భీముని ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడు, కర్ణుడి కుమారులు అతడికి సాయంగా వచ్చి భీముని ఎదుర్కొన్నారు. కర్ణుడి కుమారుడు సుషేణుడు భీముని విల్లు విరిచి ఏడు బాణములు అతడి గుండెలో దిగేలా వేసాడు. భీముడు సుషేణుడి విల్లు విరిచి అతడి మీద పదునాలుగు బాణములు వేసాడు. కర్ణుడి మీద పదునాలుగు బాణములు ప్రయోగించాడు. ఇంతలో కర్ణుడి కుమారుడు అత్యసేనుడు భీముని ఎదుర్కొన్నాడు. భీముడు అతడి సారథిని చంపి, ధ్వజమును కొట్టి మరొక పదునైన బాణము వేసి సత్యసేనుడి శిరస్సు ఖండించాడు. తరువాత కృతవర్మ, కృపాచార్యుల ధనస్సును ఖండించి వారిని క్రూరమైన బాణములతో కొట్టాడు. దుశ్శాసనుడి మీద అయిదు బాణాలను సౌబలుడి మీద ఆరు బాణములను వేసి ఉలూకుని అతడి తమ్ముని రథములు విరిచాడు. కర్ణుడి కుమారుడైన సుషేణుడిని చూసి " ఓరి సుషేణా ! ఈ రోజుతో చచ్చావురా ! అంటూ పదునైన బాణములను అతడి మీద ప్రయోగించాడు. కర్ణుడు ఆ బాణములు మధ్యలో తుంచి భీముడి మీద అతి క్రూరమైన మూడు బాణములు వేసాడు. భీముడు తిరిగి సుషేణుడి మీద బాణములు గుప్పించాడు. కర్ణుడు ఆ బాణములను విరిచి భీముని మీద డెబ్భై మూడు బాణములు గుప్పించాడు.
కురు పాండవ యోధుల సమరం
ఆ సమయంలో నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మధ్యలో సుషేణుడు నకులుని మీద బాణవర్షం కురిపించి నకులుని విల్లు విరిచాడు. నకులుడు మరొక విల్లు తీసుకుని సుషేణుడి విల్లు విరిచాడు. సుషేణుడు మరొక విల్లు తీసుకుని నకులుని మీద అరవై బాణములు సంధించాడు. నకులుడికి సాయంగా వచ్చిన సహదేవుడి మీద సుషేణుడు ఏడు బాణములు వేసాడు. నకుల సహదేవులిద్దరూ సుషేణుడితో ఘోరంగా యుద్ధము చేస్తున్నారు. సుషేణుడి తమ్ముడు వృషసేనుడు సాత్యకిని ఎదుర్కొని అతడి మీద డెబ్భై ఏడు బాణములు వేసి అతడి సూతుడి మూడు బాణములు వేసాడు. సాత్యకి ఆగ్రహించి వృషసేనుడి విల్లు విరిచి, హయములను చంపి, పతాకమును విరిచి, అతడి గుండెలకు గురిపెట్టి బాణము వేసి నొప్పించాడు. వృషసేనుడు కత్తి డాలు తీసుకుని సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి వృషసేనుడి కత్తి డాలు విరిచాడు. అప్పుడు దుశ్శాసనుడు వచ్చి సుషేణుడిని తన రథము మీద ఎక్కించుకుని వెళ్ళాడు
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు