మానవత్వమున్న మనిషెక్కడ?: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి) -సెయింట్ లూయిస్-అమెరికా


 ప్రసవవేదన పడి పునర్జన్మ నెత్తి
పండంటి పసిపాపను చూసి
పరవశించి ముద్దాడి మలమూత్రాదులను తుడిచి
పసిడి బొమ్మలా పెంచి కంటికి రెప్పలా కాపాడిన
పరదేవతా స్వరూపమైన
మాతృమూర్తినే వృద్ధాప్యంలో చూడని మనిషి
స్వార్ధం, అసూయ ద్వేషాలతో
అనురాగ ఆప్యాయతలను మరచి
ధనమే సర్వస్వమని
అహంకారంతో అన్ని బంధాలను వదులుకొనే మనిషి
ప్రియునిమోజులో పడి పసిపిల్లలను
మొగ్గలోనే హంతమొందించి
మాతృత్వానికే కళంకం తెచ్చిన నరరూప రాక్షసి
కన్నవారిని, తోబుట్టువులను వదలి
గోత్రం మార్చుకు మూడు మళ్ళ బంధంతో
పతియే దైవ సమానమని వచ్చిన
ధర్మపత్నిని కట్నం కోసం కిరాతకంగా చంపిన దానవుడు
వైద్యో నారాయణో హరి అన్నదానికి
వ్యతిరేకంగా సాధారణ ప్రజలను పీడించే ప్రాణప్రదాతలు
స్వార్ధం కోసం పర్యావరణ కాలుష్యం చేస్తు
సూనామీలకు,భూతాపాలకు కారణమవుతు
ఆధిపత్యం కొరకు యుద్ధోన్మాదంతో రక్తపాతాలతో 
నరమేథాలతో భయానక వాతావరణం సృష్టిస్తున్న
నేటి పరిస్థితులలో
మానవత్వమున్న మనిషెక్కడ ?
.............................
కామెంట్‌లు