వర్షంలో తడిసి ముద్దవుతుంది
కాండం మొదలు నుండి
చివరి ఆకు వరకూ
దేహమంతా పరవశించి పోతుంది
ఆకాశంలోంచి రాలిన చినుకులు
ఆకులమీంచి జలజలా జారి
నేలమీద పడి మట్టిని పలకరిస్తాయి
తడిసి పులకరించిన నేల
చెట్టుకేసి చూసి
మట్టి పెదాలతో చిరునవ్వు విసుర్తుంది
కురిసీ కురిసీ అలసిపోయిన వాన చినుకు
నిలిచిపోతుంది
విసురుగా వీస్తున్న చల్ల గాలికి
పులకరించిన చెట్టు ఒళ్లు విరుచుకుని
కొమ్మల్ని పైకెత్తి
ఆకాశానికి కృతజ్ఞతలు చెబుతుంది
నేల తన గొంతు కలిపి
యుగళ గీతం పాడుతుంది
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి