పండరీపురానికి దగ్గర్లో సింజిరునిపురం అనే గ్రామంలో గంగాధర రావు అనే వ్యక్తి ఉండే వాడు. అతని భార్య కమలాబాయి. వీరు ఎప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ, మంచిదే ఆలోచిస్తూ, అందరికీ మంచే చేస్తూ వచ్చారు. వీరికి సక్కు బాయి అనే కూతురు ఉంది.
రోజూ దైవ పూజలను, భజనలను వింటూ ఆ చిన్నారి పెరిగింది. ఒకరోజు స్నేహితులతో కలిసి సక్కు బాయి ఇసుక ఇల్లు కట్టి ఆడుకుంటోంది. అప్పుడు భజన పాటలు పాడుకుంటూ ఒక ముసలివాడు ఆ వీధి గుండా వెళ్తున్నాడు. సక్కు బాయి కట్టిన ఇసుక ఇల్లు, ఆయన కాలు తగిలి కూలిపోయింది. కోపంతో సక్కు బాయి, "తాతా, నేను ఎంతో ఆశగా ఈ ఇల్లు కట్టాను తెలుసా? మీరు ఒక్క నిమిషంలో నాశనం చేసేసారుగా... ఇది న్యాయమా?" అని అడిగింది.
"భగవానుని నామంలో లీనమై ఉండటం వల్ల పొరపాటు జరిగింది!" అని క్షమాపణ కోరాడు ముసలివాడు. చిన్నపిల్ల కదా, తన ఇల్లు కూలిపోవడంతో ఆ పసి మనసు తట్టుకోలేకపోయింది. తన ఇసుక ఇందుకు బదులుగా, ఆయన చేతిలో ఉన్న తంబురాను అడిగింది. ఆయనే తంబూరాను ఇచ్చి దాన్ని ఎలా వాయించాలో నేర్పించాడు. పిల్ల చెవిలో అష్టాక్షర మహా మంత్రాన్ని చెప్పి దాన్ని రోజూ జపించమని చెప్పాడు.
"అష్టాక్షర మహా మంత్రంలో ఉన్న పేరు గల వాళ్లు ఈ గ్రామంలో చాలా మందే ఉన్నారు కదా? వారిలో ఎవరి పేరు ఇది?" అని అడిగింది సక్కుబాయి.
ఆమెకు గజేంద్రుడు అలాగే ప్రహ్లాదుని కథలను చెప్పిన ముసలివాడు, అష్టాక్షరి మహిమలను వివరించాడు. అన్నీ విన్న ఆమె, పెద్దమనిషితో తాను సరదాగా తంబూరా అడిగానని చెప్పి, "దాన్ని మీరే ఉంచుకోండి!" అంది.
ఆమె వీపుపై ప్రేమగా నిమిరి, "తంబూరా వాయించు, వీలు దొరికినప్పుడల్లా భజన పాట పాడు!" అని చెప్పి మాయమయ్యాడు ఆ ముసలివాడు.
ఆ తర్వాత ఆ చిన్నారి మనసులో అంతులేని సంతోషం కలిగింది. ఆయన నేర్పించిన అష్టాక్షర మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూనే ఉంది. స్నేహితులతో ఆడుకోవడానికి కూడా వెళ్లలేదు. మనసులో ఎప్పుడూ దేవుని నామమే మోగుతోంది. మళ్లీ ఆ పెద్దమనిషిని చూడాలని మనసు తపించింది. పదేళ్లు నిండటంతో, వెంటనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు వెతికారు. ఎప్పుడూ మౌనంగా ఉండటంతో ఆమె ‘పిచ్చిది!’ అని ఊరి జనమంతా అనుకునే వారు.
ఈ సమయంలో సింధు దేశం నుంచి మిత్రరావు అనే యువకుడు వ్యాపార నిమిత్తం అక్కడకి వచ్చాడు. అతని తెలివితేటలు అందం సక్కుబాయి తల్లిదండ్రులకు నచ్చడంతో, అతనితో వివాహం నిశ్చయించారు. అప్పటి వరకు పెళ్లే వద్దు అన్న ఆమె కూడా పెళ్లికి అంగీకరించింది.
వివాహం వైభవంగా జరిగింది. సకుబాయి సింధు దేశానికి వెళ్లింది. భర్త ఇంట అత్తగారు ఆడపడచు బాగా పని చేయించుకున్నారు. సక్కుబాయి కూడా అన్ని పనులూ ఓపికగా చేసేది. మనసు మాత్రం ఎప్పుడూ భగవానుని నామాన్ని జపిస్తూనే ఉంది. తన భార్య దేనియందూ ఆసక్తి లేకుండా ఉండటం మిత్రరావుకు కోపాన్ని తెప్పించింది.
అయితే ఆమె సమయం దొరికినప్పుడల్లా ధ్యానం, భజన చేయడం చేస్తూ ఉండేది. ఇక్కడ కూడా కొందరు ఆమెను ‘పిచ్చిది’ అన్నారు. ఆమెకు దయ్యం పట్టిందని చెప్పి మంత్రగాడిని పిలిపించి, దయ్యం వదిలించమన్నారు. గదిలో పెట్టి తాళం వేశారు. అక్కడా ఆమె ధ్యానం చేసింది. భజన పాటలను కన్నీళ్లతో మనసు కరిగి పాడింది. ఆమె చిన్నతనంలో ఇసుక ఇల్లు కట్టినప్పుడు ముసలివాడి వేషంలో వచ్చిన భగవానుడు, మళ్లీ అదే వేషంలో ఆమె ఇంటికి వచ్చాడు.
తాను దయ్యం వదిలించడంలో నిపుణుడనని ముసలివాడు చెప్పడంతో, ఆమె అత్తగారు అతన్ని సక్కుబాయి గదికి వెళ్లి దయ్యం వదిలించమని చెప్పింది. అతన్ని చూడగానే, సక్కుబాయికి మొదట కలిసిన సంగతి గుర్తుకొచ్చింది. అతని కాళ్లపై పడి నస్కరించింది. దీన్ని చూసిన భర్త అత్తగారు ఇతనితో ఆమె పిచ్చి కుదురుతుందని సంతోష పడ్డారు.
ముసలివాడు ఆమెతో, "సంసార జీవితంలో ఉంటూ భర్తకు ఇతరులకు కావలసినవి చేసి, ఆ జీవితాన్ని అనుభవించిన తర్వాతే దాంట్లోని ఆసక్తి పోతుంది. కాబట్టి, ఇకపై నీ భర్తకు కావాల్సినవి సంతోషంతో నెరవేర్చు" అన్నాడు. అలాగేనని మాట ఇచ్చింది. భర్తతో ప్రేమగా మాట్లాడి, అతనిని సంతోషపెట్టింది సక్కుబాయి వీళ్ల కాపురాన్ని చూసి ఊరే ఆశ్చర్యపోయింది.
ఆమె సంతోషంగా ఉన్నా, ఆ ముసలివాడిని మళ్లీ ఒకసారి కలవాలనే కోరిక తరచూ ఆమెను వేధించింది. దీంతో, మనసానిస్థితి దెబ్బతిని, నీరు తెచ్చేందుకు వెళ్లినప్పుడు బావిలో దూకింది. దీన్ని చూసి భగవంతుడు ఊరుకుంటాడా? భక్తుడి రూపంలో వచ్చి కాపాడి, మంచి మాటలు చెప్పి ఆమెను ఓదార్చాడు. దాంతో స్పష్టత తెచ్చుకున్న ఆమె ఆయనతో స్వేచ్ఛగా మనసారా నవ్వి మాట్లాడింది. అక్కడ నీళ్లు పట్టడానికి వచ్చిన కొందరు స్త్రీలు, ఈ దృశ్యాన్ని చూసి మిత్రరావుకు వెళ్లి ఆమె వేరే మగవాడితో సంబంధం ఉందని చెరువు కట్టపై వాళ్లిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటు న్నారని చెప్పారు.
కోపంతో అక్కడకి వచ్చిన మిత్రరావు, ఆమెను తిట్టడంతోపాటు, ఆమెతో మాట్లాడిన ఆ మాయా భక్తుడిని చూశాడు. అయితే, మిత్రరావు కళ్లకు, గతంలో ఇంటికి వచ్చిన ముసలివాడిలా కనిపించాడు భగవంతుడు. సక్కుబాయి కాలు జారి బావిలో పడిపోయిందని, తానే కాపాడానని చెప్పాడు. ఆయనను క్షమించమని కోరి, భార్యతో ఇల్లు చేరాడు మిత్రరావు. పాత పద్ధతిలోనే కాపురం హాయిగా సాగింది.
ఒకసారి ఆమె నీళ్లు తెచ్చేందుకు చెరువు కట్టకు వెళ్లినప్పుడు, ఆ దారిలో భజన చేసుకుంటూ ఒక గుంపు పండరీపురం వెళ్తోంది. కబీర్ దాస్, రామదాస్, నామదేవుడు అని చాలామంది ఆ గుంపులో ఉన్నారు. వారి చుట్టూ తిరిగి తనను కూడా తమతో పండరీపురం తీసుకెళ్లమని కోరింది ఆమె. దానికి వాళ్లు, "భర్తనొద్దనో, అత్తగారొద్దనో అనుమతి తీసుకువస్తేనే తీసుకెళ్తాం!" అన్నారు. ఇంటికి వచ్చిన సక్కుబాయి భర్తకు విషయం చెప్పి, అనుమతి కోరింది. భర్త అప్పట్లో వెళ్లడానికి వీలుకాక తదుపరి సంవత్సరం తానే తీసుకెళ్తానని చెప్పాడు. ఆమె పట్టుబట్టడంతో ఆమెను ఒక గదిలో పెట్టి తాళం వేశాడు.
గదిలో ఉంటూ పాండురంగన్ని మనసారా పిలిచి ఏడ్చింది. ‘ఎంతమంది భగవానుని ఉత్సవాన్ని చూస్తుంటే, తనకు మాత్రం ఆ అదృష్టం దక్కలేదే!’ అని బాధపడింది. తన భక్తురాలు కష్టపడటం భగవానుడు చూస్తూ ఊరుకుంటాడా? వెంటనే ఆయన ఒక స్త్రీ రూపంలో ఆ గదికి వచ్చాడు. తాళం పగలగొట్టి ఆమె తాడు విప్పి, తనను స్థంభానికి కట్టమని చెప్పాడు. "ఎవరికీ సందేహం రాకుండా నేను చూసుకుంటాను. ధైర్యంగా పండరీపురం వెళ్లు!" అన్నాడు.
వచ్చింది భగవంతుడే అని తెలియక అతన్ని స్థంభానికి కట్టేసింది సక్కుబాయి. ఆ తర్వాత ఇంటి వెనుక వైపు నుంచి బయటకు వెళ్లి, కబీర్ దాస్ భజన బృందాన్ని కలిసి, తాను కూడా పండరీపురం వస్తున్నానని చెప్పింది. తన జ్ఞాన నేత్రంతో జరిగినది తెలుసుకున్న కబీర్ దాస్ సంతోషంతో ఆమెను తన భజన బృందంలో చేర్చుకున్నాడు.
ఆమె తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ, అందరినీ సంతోషపెట్టింది. భక్తుల, ‘పాండురంగ విఠల! జే! జే! విఠల పండరీ నాథా’ అనే ధ్వని మాట చోట్లా మార్మోగింది.
పండరీపురం వెళ్లిన సక్కుబాయి భగవంతుడి సన్నిధిని విడిచిపెట్టలేక, అన్నీ మరచి, ప్రతి రోజూ ఎంతో సంతోషంగా గడిపింది. ఒకరోజు భగవానునికి పూలమాల వేయడానికి, పూలు కోస్తున్నప్పుడు, పాము కరిచి పాండురంగని సన్నిధిలో స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన మిగతా వాళ్లు, ఆమెను దగ్గర్లోని సత్రంలో ఉంచి, ఆమె భర్తకు కబురు పంపారు. ఈ విషయం విన్న మిత్రరావు కోపంతో వాళ్లపైకి వచ్చి, "ఎప్పుడూ నా భార్యను తప్పు పట్టడమే మీ పని అయిపోయింది. ఆమె ఇక్కడే ఉంది. ఆమెను తప్పు పడుతూ ఇక ఎవరూ ఇక్కడికి రావద్దు!" అని వచ్చిన వాళ్లను తరిమివేశాడు. పాము కాటుకు గురై స్పృహ కోల్పోయి ఉన్న సకుబాయిని భగవానుడు వైద్యుడిగా వచ్చి కాపాడాడు. ఆ తర్వాత ఆమెకు మంచి మాటలు చెప్పి, ఆమెను పండరీపురం నుంచి ఊరి వరకు తీసుకెళ్లి మాయమయ్యాడు.
ఊరిలోకి వచ్చిన సక్కుబాయి, తాను కట్టేసిన స్త్రీ ఊరి చెరువులో నీళ్లు తోడటం చూసింది. ‘వెంటనే వస్తానని చెప్పి ఇన్ని రోజులు ఆగిపోయానే!’ అని బాధపడి, ఆమెను క్షమాపణ కోరింది. వెంటనే ఆ స్త్రీ, సక్కుబాయికి భగవంతుడిగా దర్శనమిచ్చాడు. ఇంకొంత కాలం సంసారంలో ఉండమని చెప్పి మాయమయ్యాడు. ఇంటికి వచ్చిన ఆమె తన కోసం, ఇక్కడ ఉన్నది భగవానుడే అని అందరికీ చెప్పింది. భర్త కూడా తన తప్పును తెలుసుకున్నాడు. సంపద బాగా ఉండి కూడా దానం చేయడాన్ని మరచిపోయి బతికినందుకు చింతించాడు. ఆమెతో కలిసి ఎన్నో దానధర్మాలు చేశాడు. అనేక క్షేత్రాలకు భార్యాభర్తలుగా వెళ్లి పూజించారు. ఆ తర్వాత పండరీపురానికే వచ్చి దేవుని కీర్తించి, ధ్యానంలో గడిపి తమ జీవితాలను భగవంతుడికి అంకితం చేసి తుదిశ్వాస విడిచారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి