--ఊషన్నపల్లి పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
పండుగలు మన సంస్కృతికి సజీవ రూపాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో చిన్నారులు వివిధ స్టెప్పులతో నృత్యాలు చేస్తూ, చూపరులను అలరించారు. పిల్లలు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో కలిసి ఆనందోత్సాహాలతో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ
పండుగలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు సజీవ రూపాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు కొమ్ము కార్తిష, ధరణి లక్ష్మీప్రసన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలిద్దరూ బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు దీవించి, ఆశీర్వదించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, బండారి సరిత, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి