ఓ కంఠ మొలికించె నొక్క పాట!
ఓ కలంబునజారె నొక్క సిరా చుక్క!
ఒకచుక్క కాదురా! యుప్పెనయది !
లక్ష మెదడులనే రగిలించి యురికించె!
శిక్షలన్ భరియించు శిక్షణ యది!
నాటిరాజునుదోసి నలుదిక్కు లను జేరి
మేటిగా వినిపించె! మిన్నునంటె!
ఆటవెలది
ప్రజల కవిగ తాను ప్రఖ్యాతి గడియించి
ప్రజల మనసు మాట బయట పెట్టె
మాతృభాష మహిమ మంచిగా వాక్రుచ్చె!
కలము లోన జారె గళపు బలము!
సత్యంబు వచియించు జాగృతం బొనరించు
చలన శీలత గల్గు స్వరము తనది!
పరభాష వ్యామోహ పరిణామమును గాంచి
వడ్డించె వీపుపై వాతనొకటి!
ఆంగ్లేయ భాషపై యనవస రపుమోజు
నతనికలము దుంచె ననవరతము!
పరదేశ భావాల పాతకంబును బట్టి
వధియించ చెలరేగె పదము లవియె!
నిజములు బలికెనెయని నిజాము బంధించె
నగరమును విడుచుట నాటి శిక్ష!
తెగువ జూపి మరల ధిక్కరించెను తాను!
జైలుగోడలన్ని సద్దుమణిగె!
పలుకుబడిని జూడు!బడిపల్కు సరికాదు
నా భాష నాదిరా!నాకు ముద్దు!
నాబాస నాయాస నాకెప్పుడును ముద్దు!
నీకర్థ మైనచో నిండు మనసు!
నాగొడవను జూడు!నా పదమును జూడు!
మనిజెప్పి మనకిచ్చె నతని శ్వాస!
కాళోజి కవిరాజు!ఘనతలో మృగరాజు!
జైకొట్టు తెలగాణ!చక్రవర్తి!
ఆ. వె.
పుట్టుకయన నీది!పోవుట నీదిరా!
మధ్యలోన బ్రతుకు మాది సుమ్మి!
ప్రజల కొరకు బ్రతికి ప్రాణాల నిచ్చెరా!
ప్రజల కవికి యివియె వందనములు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి