మట్టితోనే ప్రయాణం: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల


మేఘాలు కమ్ముకుంటే మురిపెమే
చినుకుల జల్లులకు సంతసమే
నేలతల్లి నిలువునా తడిసి
మట్టి పరిమళం విరిసే వేళ...

రైతన్న కనులలో ఆనందమే 
పంటలు బాగా పండి
సిరులు ఇంటినిండా కురిసిన
అతని మది నిండా సంతసమే...

ఎండనకా వాననకా శ్రమించే కర్షకునికి
నేలతల్లినే నమ్ముకుని జీవించే హాలికునికి
కురిసే వాన జల్లులతోనే చెలిమి
పండే పంట సిరులే అతని కలిమి...

ఆశల తీరాలు దాపున లేవని 
అవి బహు దూరాలు అని తెలిసినా
కర్షకుడు ఎన్నడూ నిరాశ పడడు
సాగును ఎన్నడూ విడిచిపెట్టడు...

దేహానికి ఆత్మకు ఉన్న సంబంధమే
రైతుకు భూమికి ఉన్న అనుబంధం
మట్టిలో పుట్టిన తన ప్రాణం,
మట్టితోనే ముడిపడిన తన జీవనం
తిరిగి మన్నులో కలిసేవరకూ—
మట్టితోనే సాగుతుంది తన ప్రయాణం...
కామెంట్‌లు