సున్నా నుంచి ప్రారంభం : - బి.ఉషారాణి- Govt టీచర్-మంచిర్యాల


నిన్నటి ఓటమిని తలచి కుంగిపోకు
నేటి అడుగుతో కొత్త దారిని వెతుకు
సున్నా నుంచి మొదలైనా ప్రయాణం
శిఖరాన్ని చేరాలనే ఉండాలి సంకల్పం

చేతిలో ఏమీ లేకున్నా దిగులుపడకు
గుండెలో ధైర్యం ఉంటే చాలు ఎదుగుదలకు
పడిపోయానని అక్కడే ఆగిపోకు
లేచి నిలబడి ముందుకు సాగే మార్గం వెతుకు

పొరపాట్లను దిద్దుబాటు చేసుకో 
తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకో
చిన్న అడుగులే పెద్ద మార్గమవుతాయి
నిరంతర ప్రయత్నాలే విజయాన్ని సాధిస్తాయి

కాలం కలిసిరాలేదని బాధపడకు
కోరుకున్నది జరగలేదని నిరాశపడకు
ఎవరు నిన్ను చిన్నబుచ్చినా కృంగిపోకు
నీపై నీకున్న నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోకు

శూన్యం అనేది ముగింపు కాదు
అనంతానికి అదే ఆరంభం
ఈ రోజు నువ్వు మొదలుపెట్టిన చిన్న కార్యం
రేపటి రోజుకు అందిస్తుంది గొప్ప విజయం

కలలను కంటూ కూర్చోవడం కాదు
వాటిని సాకారం చేసుకునేందుకు 
కృషి చేయడం అలవరచుకో
నిన్ను నీవు నిరూపించుకునేందుకు
నీ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకో

అవకాశం కోసం ఎదురుచూడక
నువ్వే అవకాశాలను సృష్టించుకో
రాత్రికి రాత్రే విజయం రావాలని ఆశించక
నిత్యం ఒక్కో అడుగు ముందుకేయడం నేర్చుకో

సున్నా నుంచైనా సరే ప్రారంభించాలి
రేపటి విజయానికి నాంది పలకాలి
ప్రారంభం ఎంత చిన్నదైనా సరే ప్రయత్నించాలి
ప్రయాణం ఆపకుండా సాగి గమ్యాన్ని చేరుకోవాలి
కామెంట్‌లు