చాపల మహేశ్వరికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు: : వెంకట్ , మొలక ప్రతినిధి
 శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూర్ మొలక ఆధ్వర్యంలో విద్యార్థికి ఘనంగా సన్మానం



పెద్దముల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పూర్వ విద్యార్థిని చాపల మహేశ్వరి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూరు, ‘మొలక’ బాలల మాసపత్రిక ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో మహేశ్వరిని ఘనంగా సన్మానించారు.
మహేశ్వరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మారేపల్లి కేజీబీవీలో విద్యనభ్యసించి SSCలో 8.5 GPA
సాధించారు. అనంతరం తెలంగాణ గురుకుల బాలికలతాండూరు పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 976 మార్కులు సాధించారు. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని NEET పరీక్ష రాయగా 488 మార్కులు సాధించారు. ఆమెకు ఆల్ ఇండియా ర్యాంకు 1,70,129, స్టేట్ ర్యాంకు 3,371 లభించడంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు పొందారు.
అమ్మానాన్నలు లేకపోయినా బాబాయి, పిన్ని సహకారం, గురువుల మార్గదర్శకత్వంతో మహేశ్వరి పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించడం అభినందనీయమని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం రూ.10 వేల చొప్పున ఐదేళ్లు సహాయం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీ రామకృష్ణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు గాజుల బసవరాజ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేకపోయినా కుటుంబ సభ్యుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో మహేశ్వరి 
కోర్సులో సీటు సాధించడం అభినందనీయమన్నారు.
మహేశ్వరిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహేశ్వరి చదువుకు తన వంతు సహాయంగా ప్రతి సంవత్సరం రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎదగడానికి సమాజం కావాలి.. ఎదిగిన తర్వాత సమాజానికి మీరు కావాలి
సోషల్ వర్కర్, కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ ఉంటుందని, ఉపాధ్యాయులు ఆ ప్రతిభను గుర్తించి సరైన మార్గదర్శకత్వం అందించాలని అన్నారు.
“విద్యార్థులు ఎదగడానికి సమాజం కావాలి.. ఎదిగిన తర్వాత సమాజానికి మీరు కావాలి.. సమాజం మీ కోసం ఎదురు చూడాలి” అని పేర్కొన్నారు. విద్యార్థులు చదివిన విద్యను సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, తమకు అన్నం పెట్టిన చేతులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దని అన్నారు.
కేజీబీవీలో చదువుకున్న మహేశ్వరి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించడం పాఠశాలకే కాకుండా సమాజానికి గర్వకారణమన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఇతర విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
చాకలి ఐలమ్మకు నివాళులు
కార్యక్రమంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, హక్కుల కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి మహిళాలోకం ఆదర్శంగా తీసుకోవాలని KVM వెంకట్ అన్నారు. ఆమె పోరాటం తెలంగాణరైతాంగ పోరాటానికి మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు.
పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో మారేపల్లి సర్పంచ్ సునీత వెంకట్, ఉపసర్పంచ్ రామ్ రెడ్డి, పాఠశాల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఉపాధ్యాయులు పద్మావతి, ప్రశాంత, అనిత, పర్వీన్, గోపిక, అరుంధతి, ఉమారాణి, పల్లవి, శ్రీవాణి, సుకర్ణ, సుగుణ, సుకన్య, సరస్వతి, రాజ్యలక్ష్మి, అంజలి, సరిత, సమీక్ష, శ్రావణి, పేరెంట్స్ హనుమప్ప, చంద్రమ్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు