వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
178. నిర్భేదా (త్ర్యక్క్షరీ)
179. భేదనాశినీ (పంచాక్క్షరీ)
నూట డెభై తొమ్మిదవ నామ మంత్రము:
ఓం భేదనాశిన్యై నమః
తన భక్తుల లో, సాధకుల లో ఉన్న ప్రాపంచకమైన భేద భావాలను అన్నిటినీ తానే దూరంచేస్తాను / పోగొడతాను అని తెలుపుతూ ప్రకటితమైన చాముండేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "భేదనాశినీ" అని కీర్తించారు తరించారు. మనలో ఉన్న "నీ, నా" అనే భేదాలను విదిలించి, వదిలింప చేసే శ్రీమహాలక్ష్మి రూపమైన శ్రీమాత కు నమస్కారము.
మనలో ఉన్న అజ్ఞానము వలన, ప్రకటితంగా, ప్రస్ఫుటంగా కనిపిస్తున్న, "వీరు నావారు, వారు ఇతరులు; ఇది నాది, అది పరాయిది", అనే భేద భావాలను, అమ్మ తన మీననేత్రాల నుండి అమృత ధారలుగా కురుస్తున్న జ్ఞానములో మనలను మునకలు వేయించి, దూరం చేస్తుంది. కనుకనే, పరాత్పరిని "భేదనాశినీ" అని పిలిచారు.
మానవులుగా పుట్టిన ప్రతీ ఒక్కరూ, నేను వేరు, ఆత్మ వేరు అనే భావనలోనే ఉంటారు. ఇది నేను, ఆత్మ అని రెండు ఉన్నాయి అని చెప్పే ద్వైత భావన. కానీ, ఆదిశంకరులు చెప్పినట్టు, పరమాత్మ రూపమైన ఆత్మ, శరీర ధారణ చేసి, నేను గా మారుతుంది. ఈ నేను గా మారిన ఆత్మ, శరీర ధారణ చేసిన కారణంగా, అనేక కర్మలను చేస్తుంది. ఆ చేసిన కర్మల ఫలితాలను బట్టి, మళ్ళీ, మళ్ళీ జన్మించడమూ, కర్మలను చేయడము, ఫలితం అనుభవించడము జరుగుతుంది. ఎప్పుడైతే చెసిన కర్మలు మంచి ఫలితాన్ని, ఇతరులకు ఆనందాన్ని ఇస్తాయో అప్పుడు, జన్మరాహిత్యాన్ని పొంది, అమ్మలో ఐక్యం అవుతుంది, ఈ ఆత్మ. ఈ నేను వేరు, ఆత్మ వేరు అనే ద్వైదీ భావాన్ని పోగొట్టి, అద్వైతాన్ని మనకు తెలిసేటట్టు చేసి, అంతిమంగా మనలను తనలో కలుపుకునే శ్రీమత్సింహాసనేశ్వరిని "భేదనాశినీ" అన్నారు, వశిన్యాది వాగ్దేవతలు.
మనలో ఉన్న ద్వైత విడంబాన్ని పోగొట్టి, ఏకాత్మతా భావాన్ని పరిచయం చేసి, పరిచయం చేయబడిన ఆ అద్వైత సిద్ధాంతాన్ని పరమగురువు కృపతో, ఆకళింపు చేసుకుని, మోక్షాన్ని కోరుకుంటూ, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం భేదనాశిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి