మార్గదర్శకుడు - భరద్వాజ సార్: - ఎర్రెల్లి గగనశ్రీ -8వ తరగతి-ప్రాథమికోన్నత పాఠశాల అంబం, ఎడపల్లి,-జిల్లా నిజామాబాద్
 

నా పేరు గగనశ్రీ, నేను ప్రాథమికోన్నత పాఠశాల అంబంలో 8వ తరగతి చదువుతున్నాను. మా బడిలో ఎందరో విద్యార్థులు ఎన్నో మంచి మంచి కథలు రాశారు.  మొలక మ్యాగజిన్ లో కూడా అచ్చు అయినవి.
నేను రాస్తున్న ఈ కథ మాత్రం చాలా ప్రత్యేకమైనది. నేను కథలు రాయగలననే అంతర్గత ప్రతిభను, నాలోని టాలెంట్‌ను గుర్తించి నన్ను ప్రోత్సహించిన మా ప్రియమైన భరద్వాజ సార్‌ గురించి ఈ చిన్న కథను మీ ముందుకు తీసుకువస్తున్నాను.
మాది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఒక ప్రశాంతమైన చిన్న గ్రామం. మా ఊరి పేరు అంబం. మా పల్లె పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉంటుంది.  మా ఊరు బడిలో నేను గాక ఎందరో నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చదువుకుంటున్నారు. మా పాఠశాలలో మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆ ఏడుగురు గురువులు కూడా ఎంతో మంచివారు, అందరీ విద్యార్థులపై ప్రేమగా ఉండేవారు. వారిలో భరద్వాజ సార్‌ ప్రత్యేకమైన వ్యక్తి.
సాధారణంగా చాలా మంది టీచర్లు బడికి వచ్చి తమ పాఠం బోధించి, సిలబస్ పూర్తి చేసి వెళ్ళిపోతుంటారు. కానీ భరద్వాజ సార్‌ అలా కాదు. ఆయన తరగతి గదిలోకి వస్తే కేవలం పుస్తకంలోని పాఠాలే కాదు, ఈ విశాల ప్రపంచంలో మనం ఎలా బ్రతకాలో జీవిత సత్యాలు నేర్పించేవారు. ఈ సమాజంలో ఉన్నతమైన స్థితిలో బ్రతకాలంటే మంచి విద్య ఎంత అవసరమో, ఆ చదువుతో మన దేశానికి ఏ విధంగా సేవ చేయాలో సోదాహరణంగా వివరించేవారు. మేము అందరం భవిష్యత్తులో మంచి జీవితాన్ని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిత్యం ఎన్నో ఉత్సాహపూరితమైన మాటలతో మమ్మల్ని ఉత్తేజితులను చేసేవారు. మేము చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కోపగించుకోకుండా, ఎంతో ఆప్యాయంగా తప్పు ఏంటో వివరించి సరిదిద్దేవారు. అందుకే మా పాఠశాలలోని విద్యార్థులందరికీ భరద్వాజ సార్‌ అంటే ప్రాణం, 
ఎనలేని ప్రేమ.
సాధారణంగా చదువుకునే పిల్లలు బావిలోని కప్పల లాగా పుస్తకాలే ప్రపంచం గా ఉండిపోతారు. కానీ భరద్వాజ సార్‌ మా ఆలోచనలను అలా ఉంచలేదు. మా విద్యార్థులను తరగతి గది గోడలకు పరిమితం చేయకుండా, బయటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి విహారయాత్రలకు తీసుకెళ్లేవారు. మమ్మల్ని విహారయాత్రకు తీసుకెళ్లడం మా జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకం. "ఈ ప్రపంచం మనం ఊహించినదానికంటే చాలా పెద్దదిరా పిల్లలూ, మీ గమ్యం, లక్ష్యం కూడా అలాగే పెద్దది గా ఉండాలి" అని సార్‌ మాకు ఎప్పుడూ చెబుతుండేవారు.
మా ఆలోచనలను, మా జీవన విధానాన్ని ఎంతో సానుకూలంగా మార్చేసే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మనం కష్టపడి చదివి, ఉన్నత స్థాయికి ఎదిగి మన ఊరికి, తల్లిదండ్రులకు, మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సార్‌ నిత్యం తపించేవారు. భరద్వాజ సార్‌ మనసులో ఎప్పుడూ ఒక బలమైన నమ్మకం ఉండేది. అదేమిటంటే— "కలలు కనడం ఆపకండి; ఎందుకంటే కలలు కన్నప్పుడే వాటిని సాధించాలనే తపన వస్తుంది. ఆ కలలను నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి" అని ఆయన బలంగా నమ్మేవారు. ఏ పని చేసినా అంకితభావంతో, గట్టి ప్రయత్నంతో చేయాలని బోధించేవారు. సార్‌ ఎప్పుడూ మా భవిష్యత్తు గురించే, మా అభివృద్ధి గురించే ఆలోచిస్తుంటారు. అందుకే, అలాంటి గురువు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తూ, సార్‌ అంటే మాకు జీవితాంతం ఎనలేని గౌరవం, అపారమైన అభిమానం.
చివరిగా ఒక మాట... గురువైన భరద్వాజ సార్‌ గురించి రాస్తూ, ఈ చిన్న కథలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే, ఒక విద్యార్థిగా నన్ను మన్నించి క్షమించండి సార్‌!.
కామెంట్‌లు