ఈ భూమ్మీద ఎంతోమంది పుడతారు. మరెంతో మంది చనిపోతారు. కానీ కొందరు మాత్రమే చనిపోయాక కూడా ప్రజలలో సజీవంగా బతుకుతారు. అలాంటి వారిని మహానుభావులు అని పిలుస్తాం. అలాంటి మహానుభావులలో మన దేశానికి చెందిన మహాత్మా గాంధీ అతి ముఖ్యుడు. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అతడు గుజరాత్ రాష్ట్రంలో పుట్టినప్పటికీ భారతదేశమంతటికీ గొప్ప నాయకుడు కాగలిగినాడు. భారతదేశ్యానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఒక యుగాన్ని ప్రభావితం చేశాడు. ఆయన ప్రభావము నేటికీ ప్రపంచం మీద కనిపిస్తుంది. ఒక గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు ప్రపంచ మానవులుగా వెలుగొందారు. ఆయన త్యాగం నిరుపమానం. ఏది చెప్పాడు అదే ఆచరించాడు. అదే ఆయనలోని గొప్పతనం.
మహాత్మా గాంధీ అంటే బలం, సరళత, సత్యం, అహింస పట్ల అచంచల నిబద్ధతకు పర్యాయపదం. తన జీవితమే తన సందేశం అని నిరూపించిన త్యాగ పురుషుడు. ఆల్బర్ట్ ఐనిస్టీన్ అనే అమెరికా భౌతిక శాస్త్రవేత్త మాటల్లో చెప్పాలంటే " గాంధీజీ వంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భూమ్మీద రక్త మాంసాలతో నివసించాడంటే భవిష్యత్తు తరాల వారు ఆశ్చర్యపోతారు" అని అన్న మాటలు ఎంతటి ప్రభావితం చేశాయో నేడు మనమంతా అర్థం చేసుకోవాలి. గాంధీ అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. కొన్ని సంస్థలకు ఇష్టం ఉండకపోవచ్చు. నీతికి నిజాయితీకి పట్టం కట్టిన వ్యక్తి. అందరిలాగే సాధారణంగా కొన్ని తప్పులు వ్యక్తిగతంగా చేసి ఉండవచ్చు. కానీ ఆ తప్పులను తెలుసుకున్న తర్వాత మరెప్పుడూ తిరిగి చేయలేదు. గాంధీజీ ప్రయాణం అనేది అంత సులభం కాదు. ఆయన తొవ్వలో నడవడం అంత తేలిక కాదు. ఆయనను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. గాంధీ ఒక వ్యక్తి కాదు, మహోన్నతమైన శక్తి. ఆయన అనేక వ్యక్తిగత మరియు రాజకీయ సవాళ్ళను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన తన నమ్మకాలతో ఎప్పుడూ వెనకబడలేదు. దక్షిణాఫ్రికాలో తన జాతి అన్యాయానికి గురైనప్పుడు అక్కడి పాలకులకు వ్యతిరేకంగా గాంధీ చేసిన పోరాటమైనా, తదనంతరం భారత స్వాతంత్ర్యోధ్యమానికి నాయకత్వం వహించడంలో గాంధీజీ తన సూత్రాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. గాంధీజీ ఏది చెబితే అదే ప్రజలు ఆచరించారు. తాను స్వయంగా ఆచరించిందే చెప్పాడు. తాను ఒకటి చేసి ప్రజలతో మరొకటి చేయించలేదు. ఈ తాత్వికత మీదనే గాంధీజీ ప్రజల నాయకుడు అయ్యాడు.
గాంధీ మానవ సమాజంలో నిజమైన ప్రజాస్వామ్య పరివర్తనను తీసుకురావడానికి తద్వారా నైతిక, సామాజిక క్రమాన్ని భద్రపరచడానికి ప్రయత్నించాడు. మహాత్మా గాంధీ నేడు మనం గుర్తుంచుకునే భారత స్వాతంత్ర్య నాయకుడి కంటే మరో రకంగా ప్రపంచ ప్రజలను ప్రభావితం చేయడంలో అత్యంత కీలకమయ్యాడు . అతడు భారత జాతిపిత మాత్రమే కాదు. ఆయన 20వ శతాబ్దపు పాశ్చాత్యేతర ప్రజాస్వామ్య సిద్ధాంతాలలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. గాంధీ లేకుండా ప్రపంచవ్యాప్తంగా అధికార పాలనలకు వ్యతిరేకంగా ప్రపంచ పౌర ప్రతిఘటనలో అహింస, ప్రజాస్వామ్య సిద్ధాంతం సాధారణ ఉపయోగంలోకి వచ్చేది కాదు. బౌద్ధమతం, హిందూ మతం, మరియు జైన మతం వంటి తూర్పు మతాలకు సాధారణమైన అహింస అనే మతపరమైన భావనను గాంధీ ప్రజా ప్రతిఘటనకు ప్రజాస్వామ్య సాధనంగా మార్చారు. ఈ విధంగా ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య నిర్మాణము యొక్క అత్యవసర సమస్యలకు అనుగుణంగా అహింసా యొక్క పాత భావనను ఆయన సమీకరించారు. భారత ఉపఖండంలో సంస్కృతులు మరియు విశ్వాసాల వైవిధ్యానికి గాంధీజీ ప్రజాస్వామ్య తత్వశాస్త్రము ఏక ధర్మ వ్యతిరేక మరియు బహుత్వ కోణాలను పరిచయం చేసింది. అహింస, ప్రజాస్వామ్య సిద్ధాంతానికి ఆయన చేసిన విజ్ఞప్తి కలిసి జీవించడం అనే సమ్మిళిత మరియు సంభాషణాత్మక ఆలోచనపై ఆధారపడింది. ఈ ఆలోచన అన్ని రూపాలలో జాతీయ లేదా మతపరమైన స్వార్థం మరియు మతోన్మాదాన్ని తిరస్కరించింది. అందువల్ల అహింసను రాజకీయ పోరాటం మరియు సామాజిక విముక్తి సాధనంగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రాథమికంగా నైతిక ఆవశ్యకతగా కూడా వ్యక్తీకరించారు. గాంధీ దృక్కోణంలో , ప్రజాస్వామ్యం అనేది సమాజాన్ని నిర్వహించడానికి ఒక రాజకీయ మార్గం మరియు సమాజ ప్రవర్తన యొక్క నైతిక విధానం రెండూ. అహింసా, ప్రజాస్వామ్య సిద్ధాంతంలో నైతికత మరియు రాజకీయం ఒకటే. రాజకీయాల పట్ల గాంధీజీకి ఉన్న లోతైన నైతిక దృక్పథాన్ని మనం పరిగణలోకి తీసుకుని నేడు ఆయన మన మధ్య ఉన్నారని ఊహించుకుంటే, భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో రాజకీయాల యొక్క సారాంశం , తుది ఫలితాలు ఆయనను కలవరపెడతాయని ఖచ్చితంగా అనిపిస్తుంది. గాంధీజీ ప్రజాస్వామ్యం అంటే అధికారాన్ని ఏర్పరచుకోవడం, పార్టీని నిర్వహించడం అనే సాంకేతికత కాదు. బదులుగా, అది సమాజాన్ని నైతికంగా వ్యవస్థీకరించే కళ. అందుకే ప్రజాస్వామ్యం పట్ల గాంధీజీ దృక్పథం అదే సమయంలో ప్రజా వ్యతిరేక మరియు ఉన్నత వర్గాల వ్యతిరేకమైనది. గాంధీ దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది మానవ పరిణతికి ఒక వ్యాయామం. వ్యక్తి యొక్క స్వీయ సాక్షాత్కారం మరియు స్వావలంబన కోసం అన్వేషణ నుండి వేరుగా ఉన్న అన్ని రకాల రాజకీయ చర్యలను ఆయన ప్రకటించారు. చివరికి దేశ రాజకీయ జీవితంలో రాజీలేని సత్యం( Truth) నిజాయితీ (Hounstey ), అహింస ( Non violence) ప్రవేశపెట్టడం సాధ్యమే అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. అందుకే మహాత్మా గాంధీ స్వరాజ్యం ( స్వయం పాలన ) అనే సంస్కృత భావనను ఉపయోగించి స్వయం పాలన అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని నిర్మించారు.
మహాత్మా గాంధీ వ్యాఖ్యలు, లేఖలు, మరియు జీవితం, ఆయన సూత్రాలు, అభ్యాసాలు, మరియు నమ్మకాల యొక్క రాజకీయ మరియు పండిత విశ్లేషణలను ఆకర్షించాయి. వాటిలో ఆయనను ప్రభావితం చేసినవి కూడా ఉన్నాయి. కొంతమంది రచయితలు ఆయనను నైతిక జీవనం మరియు శాంతివాదం యొక్క ఉదాహరణగా ప్రదర్శిస్తారు. మరికొందరు ఆయనను ఆయన సంస్కృతి మరియు పరిస్థితులచే ప్రభావితమైన మరింత సంక్లిష్టమైన, విరుద్ధమైన మరియు అభివృద్ధి చెందుతున్న పాత్రగా ప్రదర్శిస్తారు. గాంధీ ఒక హిందూ కుటుంబంలో పెరిగాడు. 57 సంవత్సరాల వయసులో అతను తన మతపరమైన అంశాలను ఒప్పించడంలో తనకు తాను అద్వైత హిందువుగా ప్రకటించుకున్నాడు. గాంధీ తన వైష్ణవ భక్తి గల హిందూ తల్లి సంప్రదాయాలను , ప్రాంతీయ హిందూ దేవాలయాలు మరియు సాధువు సంప్రదాయం ద్వారా ప్రభావితమయ్యాడు. లియోటాల్ స్టాయ్, జాన్ రస్కిన్ రచనలతో పాటు శ్రావణ పితృభక్తి, సత్య హరిచంద్ర నాటకం అత్యంత ప్రభావం అతని జీవితం పై చూపాయి. చరిత్రకారుడు ఆర్.బి క్లిబ్ పేర్కొన్న ప్రకారం " గాంధీ ఆలోచన కాలక్రమేనా పరిణామం చెందింది. అతని ప్రారంబ ఆలోచనలు అతని పరిణతి చెందిన తత్వశాస్త్రానికి ప్రధానమైనవి లేదా పరంజాగా మారాయి. అతను సత్యం, నిగ్రహం, పవిత్రత మరియు శాకాహారానికి ముందుగానే కట్టుబడి ఉన్నాడు . గాంధీజీ లండన్ జీవన శైలిలో ఆయన పెరిగిన విలువలు ఇమిడి ఉన్నాయి. 1891లో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన దృక్పథం సంకుచితంగా ఉండేది. మరియు న్యాయవాదిగా జీవనం సాగించలేకపోయాడు. ఆచరనాత్మకత మరియు నైతికత తప్పనిసరిగా ఏకీభవిస్తాయనే అతని నమ్మకాన్ని ఇది సవాలు చేసింది. 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన తర్వాత ఆయన ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో గాంధీని విలియం సాల్టర్ రాసిన "ఎథికల్ రిలీజియన్", హెన్రీ డేవిడ్ థోరో రాసిన "ఆన్ ది డ్యూటీ ఆఫ్ సివిల్ డిస్ ఒబిడియన్స్" , లియో టాల్ స్టాల్ రాసిన "ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యు " అనేవి నెంబర్ 121 ఎక్కువగా ప్రభావితం చేసిన మూడు పుస్తకాలు. గాంధీజీ, టాల్ స్టాయ్ ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగినవి. గాంధీజీ తనను తాను టాల్ స్థాయ్ శిష్యుడిగా భావించాడు. ఎందుకంటే వారు రాజ్యాధికారం మరియు వలస వాదానికి వ్యతిరేకత గురించి అంగీకరించారు ఇద్దరూ. ఇద్దరూ హింసను ద్వేషించారు. అయితే రాజకీయ వ్యూహంలో ఒకరికి ఒకరు తీవ్రంగా విభేదించారు. అదేవిధంగా కవి మరియు జైన తత్వవేత్త అయిన శ్రీమద్ రాజ్ చంద్రను తన ప్రభావవంతమైన సలహాదారుగా గాంధీ అభివర్ణించారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ అహింసా, సత్యాగ్రహ పద్ధతులతో నాయకత్వం వహించారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించారు. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ప్రభావంచే ప్రజా ఉద్యమాలు ప్రారంభమైనవి. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అక్టోబర్ 2, 1869 న గుజరాత్ లోని పోరు బందర్ లో జన్మించారు. ఆయన 1891 లో ఇంగ్లాండ్ నుండి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. మందు, మద్యం, మగువ ముట్టనని తల్లి దగ్గర ఆన పూని ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత విద్య బారిష్టర్ ను అభ్యసించాడు. తన తల్లి ప్రభావం గాంధీజీ పై అమితంగా ఉంది . ఒక కేసు నిమిత్తం 1893లో దక్షిణాఫ్రికా వెళ్లి జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. అక్కడ ఆయన చేసిన పోరాటం, అనుభవాలు 1915లో ఇండియాకు వచ్చిన తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించే విధంగా ఉపయోగపడ్డాయి.
భారత రాజకీయాలలో మహాత్మా గాంధీ ఆవిర్భావం భారత జాతీయ ఉద్యమాలలో ఒక కొత్త దశకు, ప్రజా ఉద్యమ పోరాటాలకు నాంది పలికింది. దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ ఇండియాకు వచ్చిన తర్వాత తన గురువు గోపాలకృష్ణ గోఖలే సలహాను అనుసరించి ఆయన ఒక సంవత్సర కాలం బ్రిటిష్ ఇండియా అంతటా ప్రయాణించి, ఆనాటి దేశ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి , ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి కాలం గడిపారు. 1916 ఫిబ్రవరిలో గాంధీజీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. తన ప్రసంగంలో భారతీయ జాతీయ వాదం ఉన్నత వర్గాలకు చెందినదని మరియు ప్రజలను ప్రతిబింబించలేదని విమర్శించారు. స్వాతంత్ర్యయ పోరాటాన్ని మరింత సమగ్రంగా భారతీయుల దైనందిన జీవితాల్లో పాతుకుపోయేలా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు ఇది నాంది పలికింది. 1917లో గాంధీజీ చంపారన్ సత్యాగ్రహం చేపట్టి విజయ పరంపర సాగించాడు. ఇది నీలిమందు రైతుల ఉద్యమం. ఈ గాంధేయ ఉద్యమం భారత దేశంలో మొత్తం మొదటి శాసనోల్లంఘన అయింది. అదేవిధంగా 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల, యజమానుల మధ్య తలెత్తిన విభేదాల సమ్మె సమస్యపై పోరాటం ఫలించింది. నైతిక ఒత్తిడిని సృష్టించడానికి స్వీయ బాధను తీర్చుకునే మార్గంగా ఉపవాసాన్ని భారతదేశంలో గాంధీ రాజకీయంగా ఉపయోగించిన మొదటి ఉద్యమం ఇది. అదేవిధంగా 1918 ఖేడ సత్యాగ్రహం విజయవంతమైంది. ఈ మూడు విజయాల పట్ల గాంధీజీ అచంచల విశ్వాసంతో ప్రజా నాయకుడిగా ఎదిగాడు.
1919 రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. ఈ సత్యాగ్రహం సమయంలో గాంధీజీకి ప్రజలతో అనుసంధానం అయ్యే సామర్థ్యం ప్రదర్శిత మైంది. గాంధీజీ భావజాలం మరియు స్వతంత్ర పోరాట పద్ధతులు అహింసా, సత్యాగ్రహం భారతీయ ప్రజలకు పరిచయం చేయబడ్డాయి. 1921 -22 సహాయ నిరాకరణ ఉద్యమం , 1930-34 శాసనోల్లంఘన ఉద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రజా ఉద్యమాలుగా తీర్చిదిద్దాడు. ఇటువంటి ఉద్యమాలు తన లక్ష్యాలను పూర్తిగా సాధించలేకపోయినప్పటికీ, బ్రిటీష్ పాలన బలహీన పడడానికి దోహద పడిందని చెప్పవచ్చు. అంతేగాకుండా భారతదేశ స్వాతంత్ర్యానికి మార్గం సుగమం చేసింది.
ఇట్లా అనేకమంది నాయకులు ముఖ్యంగా మహాత్మా గాంధీ వంటి మహోన్నత వ్యక్తి నాయకత్వంలో సాగించిన పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్ర్య సాధన, దేశ విభజన కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నది. ఆనాడు జరిగిన సంఘటనలు గాంధీజీని మరింతగా శోకానికి గురిచేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో దేశ విభజనకు ఒప్పుకోవాల్సి వచ్చింది. స్వాతంత్ర్యయనంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ, ముస్లిం విద్వేషాలను నివారించడానికి ఆత్మ శోధనకు పరిమితమయ్యాయి. మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. గాంధీజీ పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతున్నాడని హిందు మతములోని తీవ్రవాదులు, హిందువుల కోసం ముస్లిం జాతీయతను బలి పెడుతున్నాడని ముస్లింలలోని తీవ్రవాదులు అనుమానపడ్డారు. చివరకు 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి గాంధీని కాల్చి హత్య చేశాడు. గాంధీజీ " హే రామ్ " అంటూ నెలకొరిగాడు. మహాత్మా గాంధీ భౌతికంగా ఈ ప్రపంచంలో లేనప్పటికీ, ఆయన ప్రతిపాదించిన " సత్యం", "అహింస " సిద్ధాంతాలు నేటి మానవాళిని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు, మౌర్య చక్రవర్తి అశోకుడి సూత్రాలను పాటించిన మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వంటి ప్రపంచ అగ్ర నాయకులకు మార్గదర్శకుడు అయ్యాడు.
ఇవాళ ప్రపంచమంతా గాంధీజీ సూత్రాలను, సిద్ధాంతాలను పాటించే ప్రయత్నం చేస్తుంది. శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పడిన ఐక్యరాజ్యసమితి సహితం గాంధీ సిద్ధాంతాలపైనే నడుస్తుంది. నిజానికి మహాత్మా గాంధీ భారతదేశంలో పుట్టినప్పటికీ ప్రపంచమంతా అతని జీవితాన్ని అనుసరిస్తుంది. ఎవరు అవునన్నా, కాదన్నా గాంధీజీ ఒక యుగపురుషుడు. గాంధీజీ జీవితమే ఒక సందేశం. అతడి జీవితాన్ని అర్థం చేసుకోవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి కాగలదు.
##############################################
(అక్టోబర్ 2, గాంధీజీ జయంతి సందర్భంగా...)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి