పెళ్లి అనేది ఒక గొప్ప విలువలతో కూడిన వ్యవస్థ. ఇది ఒక సామాజిక ఒప్పందం కాదు. రెండు తనువులది మాత్రమె కాదు, రెండు ఆత్మల పవిత్రమైన కలయిక. ఒక ముఖ్యమైన సంస్కారం. వివాహం అంటే ఒక...అనుబంధం ఆప్యాయతలతో కూడిన safe attachment.
ప్రాచీన వేదాల ప్రకారం వివాహం అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు. అది సమాజంలోని ఒక క్రమశిక్షణ పవిత్రమైన... గృహస్థాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి పునాది.
పెళ్లి చరిత్ర చూస్తే నాలుగు శతాబ్దాల పూర్వం అంటే దాదాపు 4350 సంవత్సరాలకు క్రితం మెసపటోమియాలో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. మహాభారతంలో కూడా పెళ్లి అనే సంప్రదాయానికి సంబంధించిన కథ కనిపిస్తుంది.
కాని ఇవ్వాళ ధర్మేచ అర్థేచ, కామేచ, నాతిచరామి.....అన్న పెళ్లి ప్రమాణాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పెళ్లిలో వేసిన ఏడడుగులు తర్వాత ఇంకా స్థిరంగా పడాల్సిన ఆ అడుగులు ఈరోజుల్లో ఎందుకు తడబడుతున్నాయి? అగ్నిసాక్షిగా జరిగిన వివాహ క్రతువుకు ఫలితం ఎందుకు రావటం లేదు?
ముందూ వెనకలు అన్నీ చూసుకుని లక్షలు ఖర్చుపెట్టి హల్దీ... సంగీత్... అంటూ హడావిడి చేసి పెద్దలు చేసిన పెళ్లిళ్లు సైతం ఎందుకు నిలబడలేకపోతున్నాయి?
మాంగల్యం తంతునానే... మన జీవన హేతునా... అని కట్టిన తాళి ఎందుకు తెగిపోతోంది?
వీటి లోతుల్లోకి వెళ్లి చూసినప్పుడు... ఒక తరం పెద్దలను ఎదిరిoచి ప్రేమ వివాహాలను, స్టేజ్ మ్యారేజ్ రూపంలో... రిజిస్టర్ మ్యారేజ్ రూపంలో చేసుకున్నారు.
అయినా పరవాలేదు కొంత అంగీకారం కొంత అనంగీకారంతో చాలా మేరకు అంగీకరించింది ఈ సమాజం. మూడుముళ్ల బంధం నిలబడి వాళ్ళు సంతోషంగా వుంటే చాలు అని కూడా అనుకుంది. కానీ ఇవ్వాళ మారుతున్న కాలంతో పాటు వివాహ వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. సామాజిక మధ్యమ తుఫాన్లు ఒకవైపు, ఇంటర్నెట్లు, ఇన్స్టాలు..రీల్స్ టీవీ
గ్లోబలైజేషన్ నేపథ్యంలో...వివాహ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో పడింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులవడం, ఇగో... సమస్యలు పెచ్చరిల్లి కాళ్లు సన్నికాళ్ళు తొక్కి పెళ్లి చేసుకున్న వాళ్ళు కాళ్లతో తన్నుకునే పరిస్థితి ఏర్పడింది.
మమ చిత్తమను... చిత్తoతే అస్తు... నా మనసు నీ మనసు తో ఒకటవ్వాలి అని వేదం చెబితే.. emotional attachment ఒకరి భావాన్ని ఒక అర్థం చేసుకోవాలని సైకాలజీ చెబుతుంది. ఈ అర్థం చేసుకోవాలనే మాటను తీసుకొని పెళ్లి కంటే ముందు సహజీవనం పేరిట
ఇద్దరూ ఒకటవుతున్నారు... ఒకరి అలవాట్లను ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరి ప్రవర్తనను మరొకరు కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో చాలా సమస్యలు తల ఎత్తి... నిశ్శబ్దంగా ఒక ఉదయం ఇద్దరూ చేతులెత్తి, ఎవరికి వారే విడిపోతున్నారు.
సులభంగా విడిపోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుపడుతుందని అనుకుంటున్నారే తప్ప దీని ద్వారా తరువాత తరానికి ఏ సందేశం అందుతుంది... అనే విషయం పట్ల అవగాహన ఏర్పడడం లేదు.
వివాహం ప్రాపంచిక బంధం కాదు. ఇది ఇల్లు కుటుంబం మరియు సమాజం యొక్క మూల స్తంభం. జాతి నాగరికత మరియు సంస్కృతినీ ముందుకు తీసుకొని వెళ్ళేది మార్గం.... ఈ మార్గం లో ఇప్పుడు అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. క్షణిక సుఖం కోసం భాగస్వామిని పక్కకు పెట్టి వివాహేతర సంబంధాలకు వెళుతున్నారు. అశ్లీల సంబంధిత యాప్ లు/ వీడియోలు వీటి వైపుకు మళ్ళీస్తున్నాయి. పైగా దాహాన్ని తీర్చుకోవడం తప్పు కాదు అనే సమర్థించుకోవడం జరుగుతుంది. రేవ్ పార్టీలు ... ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.
నేటి యువత పెళ్లికి ముందు మితిమీరిన అంచనాలు వేసుకొని తరువాత బాధ్యతలు సవాళ్లను ఎదుర్కొనలేక భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇయంసుతా... మమసుతా... సహధర్మచరీ తవ (రామాయణం బాలకాండ 73 వ సర్గ) జనకుడు సీతమ్మ వారిని రాముడు చేతిలో పెడుతూ... ఈమె నీకు సహధర్మచారిణి... ధర్మబద్ధ జీవిత భాగస్వామిని. స్వీకరించు ఎలాంటి కష్టసుఖాల్లో అయినా నీ వెంట నీడలా అనుసరిస్తుంది. అని చెప్పి రామునికి అప్పగిస్తాడు. జనకుడు ఎప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని పునఃశ్చరణ చేయలేదు. తదనంతరం సీతారామ చంద్రులు, ఏ విధంగా తమ జీవనం గడిపారో మనకు తెలుసు.
ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయిని అప్పజెప్పిన తర్వాత అత్తమామల కుటుంబ సభ్యుల జోక్యం వారి ప్రభావం చాలా పెరిగిపోయింది. (Family interference) దీనివల్ల సమస్యలు పెరిగి... ఇడుపు కాగితాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం కెరీర్ ఒత్తిడి ఒకరికి ఒకరు అవసరమయిన సమయాన్ని కేటాయించకపోవడం ద్వారా ఇరువురి మధ్య దూరం పెరిగి భారం అయిపోయి ఫ్యామిలీ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
స్వేచ్ఛగా ఎగిరిపోదాం.... వయసున్నన్నాళ్ళు అనుభవిద్దాం... కుటుంబ బాధ్యతలు అక్కర్లేదు... బంధువుల ఒత్తిడి కి దూరంగా లివ్..ఇన్...రిలేషన్ షిప్ ని ఎంచుకొని జీవిస్తూ... దీర్ఘకాలిక లక్ష్యాలను పక్కకు పెట్టి ఎప్పటికప్పుడు తాత్కాలిక ఆనందాన్ని కోరుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో జన్ జి తరం... మిలీనియల్ యువత ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఉన్నత విద్యా కెరియర్, ఆర్థికంగా స్వతంత్రత, ఎంత ముఖ్యమో పెళ్ళి కూడా అంతే ముఖ్యం. కొంతమంది అమ్మాయిలు కుటుంబ ఒత్తిడిని తట్టుకోవడం కన్నా ఉద్యోగం చేసుకుంటూనే ఆధునిక సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా సంతానాన్ని కని ముందుకు వెళుతున్నారు. కానీ దీనివల్ల పుట్టిన వారికి సంబంధ బాంధవ్యాలు ఉండక ఒంటరితనంలో డిప్రెషన్ లోపలికి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
సమాజం కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత దెబ్బతింటుంది.
కుటుంబ వ్యవస్థను నిలబెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వివాహం ప్రాపంచిక సంబంధం కాదు సమాజం యొక్క మూలస్తంభం అని యువతరం గుర్తించాల్సివుంది.
ఒక భావోద్వేగ భద్రత, వ్యక్తిగత సంఘర్షణ నుండి బయట వేసే మార్గం ఒక మానసిక సామర్థ్యం కలిగించేది వివాహం. లవ్ లాంగ్వేజ్ ఉపయోగంలోకి వచ్చినప్పుడే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
వివాహబంధం ద్వారా ఇద్దరూ మానసికంగా శారీరకంగా కట్టుబడి ఉంటారు. సుఖదుఃఖాలను పంచుకొని ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తారు. పెళ్లి వలన ధర్మార్థ కామ మోక్షాల (పురుషార్థాలసాధన) జరిగి ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుంది
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి