నిలడడ్డంత సుందరంగా
నా ముఖ చిత్రాన్ని
అందంగా మునివేళ్ళ గోళ్లు రెటీనాపై
అలవోకగా చెక్కడం ఓ అపూర్వ కళ
అది
కుంచె పోగులద్దిన రంగుల కళ కాదు
క్షణంలో ప్రకృతి గీసిన స్వీయ నఖ రేఖల చెక్కణం
ప్రియురాలు ముంగురుల సవరించిన మునివేళ్ళ కళాత్మ
నా ముందు
మనసు దోచిన కలల
మదిలో కళ రెటీనాపై
ఆటా పాటా చిత్రాల మెరుపు
ఆకాశ నక్షత్రాల కాంతి గీతం
లోపలి చుక్కల గగనమంత కిటికీ
చుక్కల ముగ్గేసిన అకుపచ్చ ఆలోచన
కళలన్నీ
ఇష్టానుసారం నటనమాడడం
హృదయవీణను ఆత్మీయతతో ఆర్తితో అందంగా మీటడమే!
మూర్చనలన్నీ జీవన ప్రకంపనల రూపాంతరమే!!
ఆస్వాందించే కనుల ఊహలు
దృశ్యించే తెరపై రెపరప రెప్పల ఆశలు
జిహ్వ, వహ్వా! యను రుచి
కడుపు ఆకలిని దీర్చే కళాభినేత్రి
వినగల మనసుంటే
కనగలిగే చెవులుంటే కళలు
జనజీవన నాలుకపై జలసిరులాడు
కళాకారుడు కాని మనిషి
మట్టి, ఆకాశం పైన లోపల
ప్రతి పార్శ్వ కోణాల అంతరంగ అణువణువుల
వెతికినా దొరకడం దుర్లభమేకాదు అసంభవ క్రియ కూడా!
కళ
దశదిశల అమేయ అమాయక చూపుల వెదజల్లే
సరికొత్త మనసుపొర
కదిలీ కదిలించే ఆలోచనల తెర
అంతరంగాలను దోచే సుందర రెటీనా
కాదది ఒట్టిపొర
రంగుల కలలు చూపే
సుందర నయనాకాశ తెర

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి