ఆఖరి కోరిక: - బలభద్రపాత్రుని లక్ష్మీ సారధి -తెనాలి -96522 74188
 

జగన్నాథానికి సీరియస్ గా ఉన్నది రెండు రోజుల నుండి. రావలసిన వాళ్లంతా వచ్చేశారు. కొడుకు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు, తమ్ముళ్లు, దగ్గర బంధువులంతా వచ్చేశారు. 
బతికినంత కాలం బ్రహ్మాండంగా బతికాడు. అందరూ మంచిగా చెప్పుకునేలా, మంచిగానే బతికాడు. అలాంటివాడు రెండు రోజుల నుండి మంచంలో పడి ఉన్నాడు పాపం. పెదవులు కదిలిస్తున్నాడు ఏదో చెప్పాలని. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎవరికి అర్థం కాలేదు, జగన్నాథం ఏమి చెప్పదలుచుకున్నాడో! పెదాలు కదులుతున్నాయి తప్పితే, శబ్దం బయటికి రావడం లేదు. 
అంతా అయోమయంగా చూస్తున్నారు. ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు. 
'ఆస్తి గొడవలా అసలే లేవు. ఒకే ఒక్క కొడుకు. డబ్బు, ఇంటికి సంబంధించిన, మిగిలిన వివరాలు అన్నీ అతనికి తెలుసు. మరి ఏం చెప్పదలుచుకున్నాడో జగన్నాథం' అని అందరూ అనుకుంటున్నారు. 
పోనీ భార్య గురించి ఏదన్నా అనుకున్నా, ఆమె పోయి కూడా సంవత్సరం దాటింది. అంతా మతి పోయినట్లుగా చూస్తూ ఉన్నారు. 
ఆయనకి ఏం కోరిక ఉందో? ఇంత మంచి వ్యక్తి కోరిక తీరకుండానే కన్నుమూస్తాడేమో అని బాధ పడిపోతున్నారు అందరూ. ఆ కోరిక ఏదో మనకి చెప్తే బాగుండు అని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 
ఆ సమయంలో కొడుకు రామానికి ఒక ఐడియా వచ్చింది. 
బావా! విజయవాడలో నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. వాడికి పెదవుల కదలికను బట్టి మాట చెప్పగల నేర్పు వాడికి ఉన్నది. నేను వెళ్లి వాడిని తీసుకుని వస్తాను అన్నాడు.
అందరికీ అదే మంచి పని అని అనిపించింది. "అయితే త్వరగా విజయవాడ వెళ్లి అతనిని తీసుకురా!"అన్నారు అక్కడ ఉన్న బంధువులు అందరూ.
రామం విజయవాడ వెళ్లి అతడి స్నేహితుడిని తీసుకొని వచ్చాడు. 
అందరూ అతని వంక ఊపిరి బిగబట్టి చూస్తూ ఉన్నారు, ఇక జగన్నాథం  కోరిక ఏమిటో తెలుస్తుంది అని అనుకుంటూ.
రామం స్నేహితుడు జగన్నాథం కోరిక విన్నాక అప్రయత్నంగా చుట్టూ చూసాడు. అతని చూపు ఒక మూల ఆగిపోయింది. 
అందరూ ఆత్రంగా అతని చుట్టూ మూగి, "ఏమిటి... ఏమిటి... ఏమిటి... జగన్నాథం చివరి కోరిక ఏమిటి? త్వరగా చెప్పవయ్యా! టెన్షన్ తో మేం పోయేలా ఉన్నాం" అన్నారు అందరూ. 
అతను మెల్లగా జగన్నాథం ఆఖరి కోరిక చెప్పాడు. 
విని అందరూ నిర్ధాంత పోయారు. ఇంతకీ ఆ కోరిక చెప్తే మీరు కూడా నిర్ధాంత పోతారు మరి, సరే అతని కోరిక ఏంటంటే..........
"స్కోరెంత?"

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very funny mam😂😂