ఈ రోజు ఆదివారం. హైదరాబాద్ లో బోనాలు. మా కమ్యునిటీలో కూడా బోనాలు కార్యక్రమం ఉంటుందనీ. ఉదయం ఏడున్నరకే అందరమూ కూడి కమ్యునిటీ బయట కొంత దూరంలో ఉన్న మైసమ్మ దేవాలయానికీ వెళ్ళాలనీ కార్యక్రమం. సరే ఇక మార్నింగ్ వాక్ కుదరదులే అనుకుని, స్నానం, పూజ కానిచ్చుకుని బయలుదేరాను. ఎంత త్వరగా చేసుకున్నా ఇంట్లోనే ఎనిమిదిన్నర అయింది. సరే ఇంక అందరూ వెళ్ళిపోయి ఉంటారులే అనుకుని, డైరెక్ట్ గా గేటు వైపు నడక సాగించాను.
నా ముందు కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురు పిల్లలు నడుస్తున్నారు. అందులో ఒక పిల్లాడు, ఏదో చిప్స్ తింటూ ప్యాకెట్ అలా పడేస్తూ వెళ్లిపోతున్నాడు. నాకు సర్రున కోపం వచ్చింది.
“ఏయ్ బాబూ,” అంటూ చెయ్యూపి పిలిచాను. వాళ్ళు వెనక్కి తిరగగానే, ఆ ప్యాకెట్ వైపు, డస్ట్ బిన్ వైపు చూపించాను కోపంగా. అది పడేసిన పిల్లవాడు అలా తల తిప్పుకుని ముందుకు నడవగా ఆ పక్కనున్న పిల్లాడు మాత్రం మౌనంగా దాన్ని తీసి బిన్ లో పడేసి వెళ్ళాడు.
కమ్యునిటీ అంతా అడుగడుగునా ‘యూజ్ మీ’ అంటూ డస్ట్ బిన్స్ ఉన్నా శ్రద్ధ లేదు, భయం, బాధ్యత లేదు పిల్లలకి. ఏంటో ఇవాళ్టి పిల్లలు, బాధ్యతగా ఉండరు. చదువుల్లో, కరిక్యులం లొ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి అన్నీ రెగ్యులర్ గా చేపించాలి. పిల్లలని బాధ్యతాయుతంగా ఉండేలా తయారు చెయ్యాలి.
ఇలా ఏమేమొ అనుకుంటూ గేటు వేపు నడిచాను. గేటు దాటి బయటకు వచ్చి, రోడ్డు పక్కగా నడుస్తూ ఉంటే, దారి పొడవునా చాలా చోట్ల కవర్లు, కాగితాలూ, అరటిపండు తొక్కలూ. హు, ఇప్పుడెవరి మీద చూపిస్తావే అనూ, నీ కోపం అని వెక్కిరించింది మనసు. ఏం చేస్తాం, మనసులో తిట్టుకోవటమే! ఇక్కడ ఎవరిని తిట్టగలం. ఎవరో ఒక్కరు కాదు. ఎంతో మంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తేనే కదా రోడ్ల పరిస్థితి ఇలా ఉంది. This is the result of many people’s actions, అనుకున్నా. నిజమేలే, నేను రియాక్షన్ చూపించడానికి అక్కడ యాక్షన్ చేసినవాడంటూ ఒకడు ఉండాలి కదా అన్నాను మనసుతో!
అలా అనుకుంటూ నడుస్తూ వెళ్ళాను. గుడి ఎక్కడ, అని ఆ పక్క గేటు దగ్గర సెక్యూరిటీని అడిగితే, లోపలి వేపు దారి చూపించాడు. అమ్మో ఈ గుడి ఏదో పక్కనే అన్నారు కానీ ఆ దారి మొత్తం గతుకులుగా ఉన్న సన్నని కాలి నడక. కొంచెం కష్టంగానే ఉండింది నడక. ఆ గుడి ఒక విధంగా మా కమ్యునిటీకి వెనుక వైపు ఉంది. ఇదొక రకం వాకింగూ.., అనుకుంటూ మొత్తం మీద ఆ గుడి చేరి దర్శనం చేసుకున్నాను.
అప్పటికి, అందరూ ఇంకా రాలేదు అక్కడికి. ఒక నలుగురయిదుగురు మాత్రం వచ్చి, అక్కడ పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ రావటానికి ఇంకా టైం పడుతుందన్నారు. కాసేపు అక్కడే ఉన్నాను. అందరూ వచ్చేదాకా ఆగితే చాలా లేట్ అవుతుందేమో! సరే, ఎలాగూ దర్శనం చేసుకున్నాను కదా! ఇక వెళ్ళిపోదాంలే అనుకుని వెను తిరిగాను. అలా నడిచి మా గేటు దగ్గరి దాకా వచ్చాను.
మా గేటు ముందే ఒక తెల్ల వ్యాన్ ఆగి ఉంది. నేను ఆ వ్యాను పక్కగా నడుస్తూ, దాన్ని దాటుతూ ఉండగానే, వ్యాన్ కి అటూ ఇటూ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక రకమైన యూనిఫార్మ్ లో. గుట్కానో, జర్దానో ఏదో నోట్లో వేసుకుని ఆ చిన్న ప్యాకెట్లు అలా రోడ్డు మీద పడేసి వ్యానులో కూర్చున్నారు.
పెద్దవాళ్ళు, పైగా ఏదో యూనిఫార్మ్ లో ఉన్నారు. వీళ్ళకు ఆ మాత్రం సివిక్ సెన్స్ లేదా? అనుకుని, సర్రున వచ్చేసింది కోపం. అదే కోపంతొ వాళ్ళని ఏదో అందామనుకుని, వాళ్ళవేపు తిరిగాను. నోరు తెరిచి, ఏదో అనబోయి, అలా నోరు తెరుచుకుని ఉండిపోయాను. ఇంకేమంటాను?
ఆ వ్యాను పైన బోల్డ్ లెటర్స్ తో రాసి ఉంది - ACTION GROUP - QUICK REACTION TEAM….!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి