ఏ దిక్కు నడవాలి ? : - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696


  ఈ రోజు ఉదయాన్నే మా కమ్యునిటీలో వాకింగ్ కి బయలు దేరాను. వాతావరణం చాలా అహ్లాదంగా ఉంది. వేసవి కాలం కనుక మరి కాసేపటికి వాతావరణం వేడెక్కేస్తుంది. అందుకే కొంచెం ఉదయాన్నే వచ్చేస్తున్నాను. అలా చుట్టూ పరిశీలిస్తూ, అందంగా ఉన్న ప్రకృతిని చూస్తూ… అందమె ఆనందం… అని మనసులో కూనిరాగాలు తీసుకుంటూ అలా నడుస్తూ ఉంటే నాలా నడిచే ఎంతో మంది నడకరాయుళ్ళు, నడకమణులూ నాకు ఒంటరిగానూ, జంటలుగానూ, గుంపులు గానూ ఎదురవుతూ ఉన్నారు. అలా చూడగా చూడగా నాకు ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఇవాళే కాదు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వచ్చింది. కానీ, అంతగా ఆలోచించలేదు. 
ఆ డౌట్ ఏంటంటే, అసలు వాకింగ్ ఏ దిక్కుకి చెయ్యాలి? వాకింగ్, ఈ పక్కే చెయ్యాలి అని ఏదైనా రూల్ ఉందా? అంటే తూరుపు తిరిగీ దండం పెట్టు అన్నట్టుగా, తూర్పు నుంచి ఉత్తరం వేపు వాకింగ్ చెయ్యాలనీ, లేదూ దక్షిణం నుంచి  ఉత్తరం వేపు చెయ్యాలనీ ఏమైనా ఉందా? అంటే మనం గుడిలో ప్రదక్షిణాలు చేసినట్టుగా క్లాక్ వైస్ చెయ్యాలనీ, యాంటీ క్లాక్ వైస్ చెయ్యొద్దనీ లాటి వగైరా.. వగైరా లేమైనా…. ఎందుకంటే, నేను నడిచే వేపు, అంటే నాతో పాటో, నన్ను దాటుకునో ఎవరూ నడవట్లేదు. అందరూ నాకు ఎదురే అవుతున్నారు. 
ఆ మరీ విచిత్రమే అనూ.., ఎదురయ్యేవాళ్ళు కనపడతారు, వెనక వచ్చేవాళ్ళు కనపడరు కదా? ఆ...అవునా! అంతే అయ్యుంటుందా? అయినా చూద్దాం, అనుకుని, అలా నడుస్తూ, నడుస్తూ మూడు నాలుగు సార్లు వెనక్కి తిరిగి చూసా. ప్చ్, ఎవరూ కనిపించలేదు. 
సరే ఇలా కాదు, నేనే నా దిశ మార్చుకుందునా? అంటే ఇలా ఇక్కడి నుంచి వెనక్కు తిరిగి నడుద్దామా అని కాసేపు అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది. అవునూ, మొన్న అటువేపే కదా నడిచాను. అప్పుడు కూడా ఇదే అనుమానం వచ్చింది కదా కాసేపు! 
అయితే సోమ, మంగళ వారాలు అటూ, బుధ గురు వారాలు ఇటూ నడవాలి అని ఏమైనా ఉందా మరి? వాకింగ్ లకు ఇలాటి రూల్స్ ఉంటాయా? అయ్యో నాకు తెలియదే! ఇదేమైనా తప్పా? ఆ ప్రకారం నడవకపోతే హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా తక్కువవుతాయా? ఏం చేద్దాం? ఈ సందేహాలు తీరేదెలా? ఎవరినైనా  అడుగుదామా? ఎవరిని అడగాలి?
 ఓయ్ పిచ్చా నీకు, ఎవరినైనా అడిగితే ఇదెక్కడి పిచ్చిది అనుకుంటారు జనాలు. ఇది చెప్పాలంటే బేతాళుడిలా విక్రమార్కుడిని అడగాలేమో. అబ్బే, అక్కడిదాకా ఎందుకు, నేటి విక్రమార్కుడు AI ఉందిగా! అవునూ, నేటి AI ని విక్రమార్కుడు అనాలా, విక్రమార్కి అనాలా? అని అనుకుంటూ ఉండగా…, ఒక అబ్బాయి ఎదురుగా జాగింగ్ చేసుకుంటూ వస్తూ కనిపించాడు. అతను వేసుకున్న టీ-షర్ట్ మీద కొట్టొచ్చినట్టు ఉన్న ఒక కొటేషన్ - చదవగానే ఫక్కున నవ్వొచ్చింది. - Stop Thinking, Just do it!
కామెంట్‌లు