దూర….దృష్టి!: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
   

ఈ రోజు సాయంత్రం నాలుగున్నరకే వాకింగ్ కై కిందికి దిగాను. ఆరుగంటలకి కాస్త బయటకు వెళ్లే పని ఉంది. వాకింగ్ చెయ్యాలని లేదు కానీ, ఊరికే ఎందుకు మానెయ్యటం ఒక పదిహేను నిమిషాలైనా నడుద్దాంలే అనుకుంటూ వచ్చాను. అలా మెల్లిగా నడుస్తూ నడుస్తూ పైకి ఎక్కాను. పైన నైఋతి మూల దగ్గరికి వచ్చాక కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం చూసాను. 
మా కమ్యునిటీ లో పైన బ్లాకులు ఉన్న వైపు, నైఋతి మూలన ఒక మూడు బెంచీలు బయటివేపు ఫేస్ చేసి ఉంటాయి. అవి చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను, కమ్యునిటీ లో తిరిగే వాళ్ళ వైపు కాకుండా అటు గోడ వేపు ముఖం పెట్టి ఎవరు కూర్చుంటారు? ఎవరికి వచ్చిన ఆలోచనో ఇది? అని. 
నువ్వు మరీనూ, ప్రకృతిని చూసే వాళ్ళు, సోలోగా గడపాలనుకునే వాళ్ళు ఉంటారు కదా! అని మళ్ళీ నన్ను నేను సమాధాన పరచుకుంటూ ఉంటాను. ఆ… ఏం ప్రకృతి, సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ అటు కనపడవు. ఉన్నది ఒక మురికి పట్టిన లేక్. అది పేరుకే లేక్. అందులో నీరు ఉన్నానా, లేనా అన్నట్టుంటుంది. దూరంగా ఒక సన్నని రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్డు నుంచి మా కమ్యునిటీకి వెనక వేపు కనెక్ట్ అయ్యే మరో రోడ్డు. అక్కడ ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఏముంది అక్కడ చూడటానికి. ఇక సోలోగా ఉండాలనుకునే వాళ్ళంటారా, ఏమో నాకయితే ఎప్పుడూ ఎవరూ అక్కడ కూర్చున్నట్టు కనపడలేదు మరి, అనుకుంటూ ఉంటాను. 
సరేలే, నీకు నచ్చింది లేకపోతే, ఇక ఎవరికీ నచ్చదా?  నీకు ఎవరూ కనపడనంత మాత్రాన, ఎవరూ కూర్చోనట్టా? లేక్ వ్యూ అనే ఉద్దేశ్యంతోనే ఆ బెంచీలు అక్కడ ప్లాన్ చేసి ఉంటారు. ఆ తరువాత ఆ లేక్ దాని అందం కోల్పోయి ఉంటది, అని నా మనసు చెపుతూ కూడా ఉంటుంది. 
  అయితే ఈ రోజు మాత్రం, అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఊరికే కూర్చోవటమే కాకుండా, లేస్తూ కూర్చుంటూ తన ఫోన్ ని అన్ని వేపులా తిప్పుతూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నాడు. ముందే ఎత్తుగా ఉన్న గోడకి, సేఫ్టీ మెషర్స్ తీసుకుంటూ, ఈ మధ్య రెండు ఫీట్ల గ్రిల్స్ కూడా పెట్టారు. ఆ గ్రిల్స్ మధ్య నుంచి అతను ఫోటోలు తీసుకుంటున్నాడు. అక్కడ ఏం కనపడుతుందబ్బా ఈయన కెమెరాలకి? అని అనుకుంటూ నా నడక కొనసాగించాను.
అలా అక్కడినుంచైతే వెళ్ళిపోయాను కానీ, నా మనసులో ఆలోచనలు మాత్రం ఆగలేదు. అతను ఎవరు? ఫోటోగ్రాఫరా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరా, జర్నలిస్టా, సూపర్వైజరా…  ఇక్కడ ఏం స్టోరీ దొరుకుతుంది వీళ్ళకి?  అని ప్రశ్నించుకుంటూ ఉండగా…., సూపర్వైజర్ అన్న మాట దగ్గరి అగింది మనసు. 
ఈయన సూపర్వైజరా…? సూపర్వైజర్ అయితే దేనికి సూపర్వైజర్ అయ్యుండొచ్చు? ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కా? దూరంగా జరిగే ఏదైనా కన్‌స్ట్రక్షన్  సైటుకా…? ఆ, మరీ విచిత్రమే అనూ! ఒకవేళ వాటికి సూపర్వైజర్ అయితే అక్కడికి వెళ్ళి చేస్తాడు. ఇక్కడినుంచి ఫోటోలు ఎందుకు తీస్తాడు? CID, లేదా RAW ఏజెంట్ల లాగా ఏదైనా సీక్రెట్ మిషన్, సీక్రెట్ అబ్సర్వేషన్ లాటిది అయ్యుండొచ్చా? అయ్యుండొచ్చేమో! అవునా, ఇలా దూరం నుంచి, ఇంత దూ….ర దృష్టితో కూడా పని చేస్తారంటావా? ఇదేదో బాగుందే! 
అలా అయితే అతను అక్కడ సైట్లో ఉన్నట్టా? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నట్టా? ఆన్ సైట్ ఆఫ్ సైట్ అంటుంటారు కదా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు! ఇది అలాటిదేనా? ఏయ్, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్రం హోం అనుకోవచ్చు కదా! అనుకోగానే పెదవులపై చిరునవ్వు వెలిగింది. అతనెవరో ఏంటో కానీ, నీ ఆలోచనలు ఎక్కడికో…., వెళుతున్నాయే! అంటున్న మనసుని బుజ్జగించుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ ఇంత దూర….దృష్టియా నాకు/ అతనికి!  అనుకుంటూ ఇంట్లోకి నడిచాను.
కామెంట్‌లు