భలే పిల్లలు : - సరికొండ శ్రీనివాసరాజు
 

 

దసరా సెలవుల్లో పిల్లలు అంతా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో గడపడానికి పట్టణం చేరారు.‌ సెలవుల్లో తనివి తీరా ఆడుకున్నారు. దసరా పండుగ రోజు రానే వచ్చింది. వాసు "అందరం సాయంత్రం జమ్మి కోసం ఊరి బయటకు వెళ్దాం. సరదాగా ఉంటుంది." అని అన్నాడు. సాయంత్రం సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడక్కడా పాలపిట్టలను బంధించి, చూపిస్తున్నారు. డబ్బులు వేసి ఆ పాలపిట్టలను ముట్టుకోవచ్చని, ‌మరిన్ని డబ్బులు ఇస్తే ఆ పాలపిట్టల పక్కన నిలబడి వారు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకోవచ్చని అన్నారు వారు. వాసు తన తోటి వచ్చిన రాము, వాణి, సతీశ్, శ్రావణి, హరి, సిరి, రాజు అందర్నీ పిలిచాడు. వాళ్ల చెవిలో ఒక మాట చెప్పాడు. అందరూ అక్కడక్కడ పాలపిట్టలను బంధించిన వారి దగ్గరికి వెళ్లి, తామంతా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళం అని తమ చేతికి ఆ పాలపిట్టలను ఇస్తే అందరం కలిసి ఆ పాలపిట్టలను పట్టుకొని ఫోటోలు దిగుతామని, అందుకు వారికి తలా 500 రూపాయలు ఇస్తామని అమాయకమైన మాటలతో నమ్మించారు. ఈ పిల్లల మాటలను నమ్మి, పిల్లల చేతికి పాలపిట్టలను ఇచ్చారు. ఆ పాలపిట్టలను పట్టుకుని పిల్లలంతా ఒకచోట చేరారు. అందరూ ఒకేసారి తమ చేతుల్లోని పాలపిట్టలను వదిలిపెట్టారు. ఆ పాలపిట్టలు ఎగిరి ఎక్కడికో వెళ్లారు. పిల్లలు అంతా తుర్రుమని పారిపోయారు. పాలపిట్టలను బంధించిన వాళ్లు లబోదిబోమని మొత్తుకున్నారు.

కామెంట్‌లు