అమృత ధార నా మాతృ భాష‌‌...: - నాగమణి రావులపాటి..


 ప్రాచీన శ్వాసల సుస్వరాల అమృత  నాదమై ఉదయించినది మన తెలుగు పలుకు.
యుగయుగాల జీవన చైతన్యానికి అక్షర రూపమైన తరతరాల దివ్య వెలుగు
వేదనాదాల ప్రతిధ్వనియై జానపద హృదయ స్పందనలో పరవశించిన  అమృత ధార...
 
నన్నయ లేఖిక నుండి ప్రవహించిన పవిత్ర రసతరంగిణి మన తెలుగు భాష...
తిక్కన శిల్ప సంపదలో మెరిసిన ప్రజ్ఞా దివ్య దీపమై జగతిని వెలిగించెను
 
పోతన భక్తి పారవశ్యపు మకరందమై మానవతా సువాసనలు వెదజల్లిన అమర వాణి...
రాయల కొలువున అష్టదిగ్గజ కావ్య సంపదై వెలిగిన రసరాజ సౌందర్యం...
అజంత పదాల లలిత లలిత సంగీత నాదమై విశ్వమంతా నిండిన మాధుర్యం...
త్యాగయ్య కీర్తనల భావ రాగ తాళ లయలలో కరిగిపోయిన పరబ్రహ్మ తత్త్వం...
క్షేత్రయ్య పద సౌరభాల మువ్వగోపాల శృంగార భక్తితో విరిసిన భావ కమలం...
శిలా శాసనాల శిల్పకళా రహస్యమై కాలగర్భంలో చెరగని చారిత్రక రత్న దీపం...
గోదావరి కృష్ణా నదీ ప్రవాహాల పరవళ్ళలో ప్రతిధ్వనించే అద్భుత ప్రాణ స్వరూపం...
రైతు నాగటి చాలున పారిన శ్రమజీవన సంస్కృతికి అద్దం పట్టిన అక్షరజ్యోతి...
అమ్మ లాలనలోని అమృతపు తేనెపలుకై శిశు హృదయాలను మీటిన అమూల్య నిధి...
గురజాడ దేశభక్తి ప్రబోధమై సమాజ నవచైతన్యానికి నూతన దిశానిర్దేశం చేసిన గళం...
శ్రీశ్రీ మహాప్రస్థాన విప్లవ శంఖారావమై అణగారిన వర్గాల గొంతుకైన అగ్నిధార...
కాలాన్ని జయించిన కావ్యాల నిలయమై విశ్వసాహిత్య యవనికపై శోభిల్లే దివ్య రత్నం...
వేల ఏళ్ళ సంస్కృతీ మూలాలను భావితరాలకు అందిస్తున్న పవిత్ర జీవన వాహిక...
సప్త సముద్రాలు దాటి ఎల్లలు చెరిపి ఖండాంతరాల్లో వికసించిన తేజోమయ రూపం...
సాంకేతిక యుగపు సరికొత్త వీధుల్లో కంప్యూటర్ తెరలపై మెరిసే ఆధునిక శాస్త్రం...
సకల మానవాళి శాంతి సౌభ్రాతృత్వాల వికాసానికి దారిచూపే అక్షర సత్య దీపిక...
తల్లి పాల తీపితో నిండిన ఆత్మీయ స్పర్శలో అనుబంధాల బంధాన్ని పెంచే అమృతం...
నిత్య నూతనమై నవ్య హరితమై తరతరాల చీకట్లను పారద్రోలే అనంత కాంతి...
కవన సాహిత్య వీచికలలో తేనెలూరే పదబంధాల వైభవమై నిలిచే అఖండ తేజం...
మానవ హృదయ సీమల్లో చిరస్థాయిగా విరాజిల్లే అజరామర దివ్య చైతన్య ప్రవాహం నా మాతృ భాష...
.
కామెంట్‌లు