పువ్వులు: - యామిజాల జగదీశ్


“చనిపోయేలోపైనా నీలకురింజి పూలతో నిండిన కొండల్ని ఒక్కసారైనా కళ్లారా చూడాలి!”
87 ఏళ్ల ఎలికుట్టి పాల్ మనసులో మిగిలిన చివరి కోరిక అదే!
12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూసే అరుదైన నీలకురింజి పూలతో నిండిన పశ్చిమ కనుమల్ని చూడాలన్న తన తల్లి కోరిక గురించి కొడుకులు రోజన్, సత్యన్‌లకు తెలిసింది. ఇక వాళ్లు మరో ఆలోచన చేయలేదు.
దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి, తమ తల్లిని ఇడుక్కి కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు.
కానీ అక్కడో సమస్య ఎదురైంది…
నీలకురింజి పూలు కనిపించే చోటుకు వాహనంలో వెళ్లడం కుదరదు. దాదాపు కిలోన్నర దూరం నిటారుగా ఉన్న కొండ దారిలో నడిచి ఎక్కాలి!
వయసు పైబడటంతో ఆ తల్లికి నడుచుకుంటూ కొండ ఎక్కడం సాధ్యం కాలేదు.
కానీ, తల్లి కోరిక ముందు ఆ అడ్డంకి కూడా చిన్నబోయింది! 
ఆ ప్రేమగల కొడుకులు తమ తల్లిని భుజాలపై ఎత్తుకుని కొండ ఎక్కారు! 
దారిలో ఒకరి తర్వాత ఒకరు తల్లిని భుజాలపై మోస్తూ కొండ శిఖరానికి చేరుకున్నారు.
ఎవరికో తమ ప్రేమను చూపించాలనో, అందరి ప్రశంసలు పొందాలనో వాళ్లు ఇదంతా చేయలేదు.
తమ తల్లి ఎన్నో ఏళ్లుగా మనసులో దాచుకున్న కోరికను నెరవేర్చాలన్నదే వాళ్ల ఆశ! 
చివరికి నీలం, ఊదా రంగులు కలిసిన అందమైన నీలకురింజి పూలతో నిండిన కొండలు ఆ తల్లి కళ్ల ముందు కనిపించాయి.
ఎన్నో ఏళ్లుగా తన మనసులో దాచుకున్న కల ఆ రోజు నిజమైంది! 
వయసు పైబడిన తల్లిదండ్రులకు మన నుంచి కావాల్సింది డబ్బో, ఖరీదైన కానుకలో కాదు…
మనం కేటాయించే కొంచెం సమయం…
మనస్ఫూర్తిగా చూపించే ప్రేమ, ఆప్యాయత…
వాళ్ల చిన్న చిన్న కోరికలకు మనం ఇచ్చే విలువ…
 వాళ్లు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రేమగా అక్కున చేర్చుకునే మనసు…
మనల్ని చేయి పట్టుకుని నడక నేర్పించిన వాళ్లు, వయసు పెరిగి నడవలేని స్థితికి చేరుకున్నప్పుడు, వాళ్లను మన భుజాలపై మోసుకెళ్లే మనసు కూడా మనకు ఉండాలి! 
తల్లిదండ్రుల ప్రేమకు సాటి ఈ ప్రపంచంలో మరేదీ లేదు. వాళ్ల చిన్న చిన్న కోరికల్ని కూడా నెరవేర్చేందుకు మనం చేసే ప్రయత్నమే వాళ్లకు ఇవ్వగలిగే గొప్ప కానుక!
 
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌👌👌