సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 శల్య పర్వము ద్వితీయాశ్వాసము: - 427 వ రోజు


కృష్ణార్జునులు యుద్ధరీతిని గురించి చర్చించుట

అప్పుడు అర్జునుడు " కృష్ణుడితో " కృష్ణా ! చూసావు కదా భీమసుయోధనులు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వీరిలో ఎవరిది గెలుపంటావు " అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు " అర్జునా ! ఇద్దరూ విద్యనేర్చుకున్నది ఒకరి వద్దనేగా ! భీముడిది శారీరక బలమే కాని బుద్ధి బలం తక్కువ. సుయోధనుడికి శారీరక బలం, గదాయుద్ధంలో అత్యంత ప్రావీణ్యం, బుద్ధి బలం ఎక్కువ. ఎదుటి వాడు మాయోపాయాలు పన్నుతూ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ధర్మయుద్ధం చేయడంలో ప్రయోజనం లేదు. మనమూ మాయోపాయములు పన్నాలి. నాడు భీముడు కురు సభలో సుయోధనుడి తొడలు విరుగకొడతానని శపథం చేసాడు కనుక నాభికి క్రింది స్థానంలో కొట్టడం గదాయుద్ధంలో అధర్మమే అయినా భీముడు శపథం నెరవేర్చుకునే నిమిత్తం కొట్టాడని సమర్ధించ వచ్చు. లేకున్న విజయం సిద్ధించుట దుర్లభం. కనుక మనకు సుయోధనుడి తొడలు విరుచుట ఒక్కటియే మన కర్తవ్యం.
ధర్మరాజు వలన కలిగిన సంకటం
అదియును కాక ధర్మజుని మాట మనలను చిక్కుల్లో పెట్టింది. భీముడు గెలువకున్న మీరు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాదులను సంహరించి కష్ట పడి గెలుచుకున్న సామ్రాజ్యం కుటిలుడు, అధర్మపరుడు, దుర్మార్గుడైన సుయోధనుడి హస్థగతం ఔతుంది కనుక భీముడు గెలుచుట అత్యంత అవసరం. అయినా ధర్మజుడు ఇంత బుద్ధి హీనుడు అనుకోలేదు. సమస్త సైన్యాల నాశనం కావడానికి, బంధువులను, మిత్రులను కోల్పోవడానికి కారకుడైన సుయోధనుడిని చుట్టుముట్టి చంపక ద్వంధయుద్ధానికి అంగీకరించడం ఒక్కరిని ఓడించిన సామ్రాజ్యానికి అధిపత్యం ఇస్తానని పలకడం ఎంత మూర్ఖత్వం. భీమసేనుడిని గెలువడం సుయోధనుడి చిరకాలవాంఛ. సుయోధనుడు వచ్చిన అవకాశం జారవిడుస్తాడా ! కనుక ఇక ఆలస్యం చేయక సుయోధనుడిని అధర్మమే అయినా జయించడం అవసరం లేకున్న భీముని గెలిచి సుయోధనుడు సామ్రాట్టు ఔతాడు. తిరిగి అతడి చేతిలో మీకు ఇడుములు తప్పవు జాగ్రత్త " అన్నాడు.
సుయోధనుడు నేల కూలుట
అర్జునుడు విషయం గ్రహించాడు. కృష్ణుడు భీమసేనుడి వంకనే చూస్తూ అతడు తన వంక చూడగానే తొడ చూపి అక్కడ కొట్టమని సైగ చేసాడు. ఆ సైగను భీముడు గ్రహించాడు. అధర్మ యుద్ధానికి కృష్ణుడే అనుజ్ఞ ఇచ్చాడు. ఇక ఆలసించకూడదని అనుకున్నాడు. సుయోధనుడి తొడలు విరువడానికి సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ముందుగా భీముడు ముందుగా సుయోధనుడిని ఒక్క బెబ్బ కొట్టాడు. ఆ దెబ్బను తప్పించుకుని సుయోధనుడు భీముని తన గధతో సొమ్మసిల్లేలా గట్టిగా మోదాడు. సుయోధనుడు ఒళ్ళు మరచి గాలిలో ఎగురుతూ గిరగిరా తిరుగుతూ భీముని చంపడానికి గధను బలంగా పైకి ఎత్తాడు. ఇది సరి అయిన సమయమని తెలుసుకున్న భీముడు తనకు అనువుగా ఉన్న సుయోధనుడి తొడలు విరుగ కొట్టాడు. సుయోధనుడు తొడలు విరిగి మొదలు నరికిన చెట్టులా నేల మీద పడ్డాడు. సుయోధనుడు నేల మీద పడగానే భీముడు " సుయోధనా ! నాడు కురుసభలో ఏకవస్త్ర అయిన పాంచాలిని సభకు ఈడ్పించి కూర్చోమని తొడ చూపినందుకు ఫలితం అనుభవించు " అంటూ ఎడమ కాలితో ఎగిసి సుయోధనుడి తలను తన్ని " సుయోధనా ! ఇది వంచనతో గెలువడానికి ఇది యక్షక్రీడ కాదు ఇది యుద్ధం. ఒరేయ్ ! మమ్మలిని పశువులనీ, మృగములనీ, బానిసలనీ ఎగతాళి చేసినందుకు ఫలితం అనుభవించు " అని అరిచాడు. " కృష్ణా ! అర్జునా ! పాంచాల వీరులారా ! చూడండి తాకకూడని పరిస్థితిలో ఏకవస్త్ర అయిన ఒక స్త్రీని సభకు ఈడ్పించి ఫలితం అనుభవిస్తున్న ఈ దుర్మార్గుడిని చూడండి. పాంచాలి కోపాగ్నిలో మాడి మసి అయి పోతున్న పాపాత్ముడిని చూడండి. మమ్ము వ్యర్ధులని, బానిసలని అవమానించిన దుర్మార్గులను ససైన్యంగా సమూలంగా నాశనం చేసాము. ఇక మేము స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఒక్కటే " అంటూ కుడి కాలు సుయోధనుడి మెడ మీద పెట్టి ఎడమ కాలితో తలను తన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు