సూర్దాస్: - యామిజాల జగదీశ్
 

కృష్ణుడిని తన ప్రాణాల కన్నా మిన్నగా ప్రేమించిన సూరదాసు 
సూరదాసు పుట్టుకతోనే అంధుడు. చూపు లేదనే కారణంతో కుటుంబ సభ్యులు కూడా అతన్ని దూరంగా ఉంచేవారు. ఒకరోజు అతను ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా, కొందరు కృష్ణ భజనలు పాడుకుంటూ అటుగా వెళ్లారు.
ఆ పాటలు విన్న సూరదాసు ఎంతో పరవశించిపోయాడు. వెంటనే వారిలో ఒకరిని పిలిచి, “అయ్యా! మీరు పాడిన పాటలు ఎవరి గురించి? వినడానికి ఎంత మధురంగా ఉన్నాయో!” అని అడిగాడు.
అందుకు ఆ భక్తుడు, “ఇవి కన్నయ్యను కీర్తిస్తూ పాడే పాటలు!” అని చెప్పాడు.
వెంటనే సూరదాసు ఎంతో ఆతృతగా, “మీరు ఇంతగా కీర్తిస్తున్న ఆ కన్నయ్య ఎలా ఉంటాడు?” అని అడిగాడు.
ఆ భక్తుడు ఇలా వివరించాడు.
“కృష్ణుడు నల్లని నీలిమ కలిగిన అందమైన బాలుడు. అతని చిరునవ్వు అందరినీ మంత్రముగ్ధు లను చేస్తుంది. చేతిలో వేణువు పట్టుకుని మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంటాడు!”
అతను చెప్పిన మాటలను సూరదాసు తన మనసులో పదిలంగా దాచుకున్నాడు. తన మనోనేత్రాలతో కన్నయ్యను చూడటం మొదలుపెట్టాడు. ఆ బాలకృష్ణుడి రూపాన్ని తలచుకుంటూ ఎన్నో పాటలు పాడేవాడు.
కొంతకాలానికి అతని కీర్తనలు వినడానికి జనం పెద్ద సంఖ్యలో రావడం మొదలైంది. ప్రజలు అతనికి ఆహారం అందిస్తూ ప్రేమగా ఆదరించేవారు.
 సూరదాసు, తులసీదాసుల స్నేహం!
ఒకరోజు రామభక్తుడైన తులసీదాసు సూరదాసును కలిశాడు. అతని కృష్ణ కీర్తనలు విని ఎంతో ముగ్ధుడయ్యాడు.
పాటలు ముగిసిన తర్వాత సూరదాసును ఆప్యాయంగా కౌగిలించుకుని, "ఇకపై మనం స్నేహితులుగా కలిసి కన్నయ్య కీర్తనలు పాడుదాం!” అని అన్నాడు.
సూరదాసు కూడా సంతోషంగా అంగీకరించాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి కృష్ణుడి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకునేవారు.
ఒకరోజు ఇద్దరూ ఆలయానికి వెళ్తుండగా, ఊరిలోని ప్రజలు భయంతో పరుగులు తీస్తూ ఎదురుగా వచ్చారు.
వారిలో ఒకరిని ఆపిన తులసీదాసు,
“అయ్యా! ఎందుకంత కంగారుగా పరుగెత్తుతున్నారు?” అని అడిగాడు.
ఆ వ్యక్తి భయంతో, “ఎదురుగా ఒక మదించిన ఏనుగు వస్తోంది. కంటికి కనిపించిన వారందరినీ దాడి చేస్తోంది. మీరు కూడా వెంటనే ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి!” అని చెప్పి పరుగెత్తాడు.
అది విన్న సూరదాసు తులసీదాసును అడిగాడు. “తులసీదాసా! ఏనుగు ఎలా ఉంటుంది? దానికి మదం ఎక్కితే ఏమవుతుంది?”
తులసీదాసు ఇలా చెప్పాడు. “ఏనుగు చాలా పెద్ద జంతువు. దానికి మదం ఎక్కితే ఎదురుగా ఉన్నవారిపై దాడి చేస్తుంది. కానీ మన హృదయంలో కన్నయ్య ఉన్నప్పుడు మనకెందుకు భయం?” అని చెప్పి, కృష్ణుడిని ధ్యానిస్తూ ప్రశాంతంగా నిలబడ్డాడు.
మదించిన ఏనుగు అతని వైపు దూసుకొచ్చింది. అయితే తులసీదాసుపై దాడి చేయకుండా, అతని దగ్గర కొద్దిసేపు నిలబడి, ఆ తర్వాత ప్రశాంతంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.
అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి తులసీదాసుకు నమస్కరించారు.
ధ్యానం నుంచి బయటకు వచ్చిన తులసీదాసు సూరదాసు కోసం వెతికాడు. అప్పుడు పక్కనే ఉన్న దుకాణం వెనుక దాక్కుని, రెండు చేతులూ గుండెలకు అడ్డంగా పెట్టుకుని వణుకుతున్న సూరదాసు కనిపించాడు.
అది చూసి తులసీదాసుకు ఆశ్చర్యం కలిగింది.
‘నాలాగే కృష్ణుడిపై అపారమైన భక్తి ఉన్న సూరదాసు, ఆ ఏనుగును చూసి ఎందుకు భయపడ్డాడు?’ అని అనుకున్నాడు.
వెంటనే అతని దగ్గరకు వెళ్లి తన సందేహాన్ని అడిగాడు.
సూరదాసు నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
“తులసీదాసా! నీ మనసులో ఉన్న కన్నయ్య యవ్వనంతో నిండిన అందమైన రూపంలో ఉంటాడు. అందుకే నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు ఏనుగు వస్తే, కన్నయ్య దాన్ని తరిమేస్తాడనే నమ్మకంతో ప్రశాంతంగా నిలబడ్డావు.
కానీ నా మనసులో ఉన్న కన్నయ్య ఒక చిన్నపిల్లవాడు! అతని చిరునవ్వును తలచుకుంటూనే ఇప్పటివరకు ఎన్నో పాటలు పాడాను.
ఏనుగు చాలా పెద్ద జంతువని నువ్వు చెప్పగానే నా మనసులో భయం మొదలైంది. ఆ ఏనుగును చూసి నా చిన్నారి కన్నయ్య భయపడి ఏడిస్తే ఏం చేయాలి? అతన్ని ఎలా ఓదార్చాలి?
ఎప్పుడూ అతని నవ్వుల ముఖాన్ని తలచుకుంటూ జీవించే నేను, నా కన్నయ్య ఏడవడాన్ని ఎలా భరించగలను?
అందుకే ఆ ఏనుగు నా కన్నయ్యను చూడకూడదని, నా రెండు చేతులూ గుండెలపై అడ్డంగా పెట్టుకుని అతన్ని దాచినట్టుగా నిలబడ్డాను!” అని చెప్పాడు.
ఆ మాటలు విన్న తులసీదాసు కళ్లలో ఆనందభాష్పాలు ఉబికి వచ్చాయి.
కృష్ణుడిని తనను కాపాడే దేవుడిగానే కాకుండా, తన ప్రేమను, ఆప్యాయతను కోరుకునే చిన్నారిగా భావించిన సూరదాసు భక్తి తులసీదాసు మనసును కదిలించింది.
అతను సూరదాసును గట్టిగా కౌగిలించుకుని, "నీ లాంటి గొప్ప భక్తుడి స్నేహం నాకు దక్కడం ఎంతో అదృష్టం. పునర్జన్మ అనేది ఉంటే, అప్పుడు కూడా నువ్వే నాకు స్నేహితుడిగా రావాలి!” అని అన్నాడు.
ఈ కథ మనకు చెప్పే సందేశం!
దేవుడిని సంపూర్ణంగా నమ్మడమే భక్తి అయితే, ఆయన సంతోషాన్నే తన సంతోషంగా భావించడం ఆ భక్తిలో అత్యున్నత స్థాయి!
కామెంట్‌లు